5, జూన్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 726 (కారము లేకున్న)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కారము లేకున్న కావు కార్యము లెందున్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

  1. కోరినవన్ని దలంచిన
    తీరుగ జరుగుటకు తీయతీయని మాటల్,
    మారుగ పల్కుచు తగు మమ
    కారము లేకున్న కావు కార్యములెందున్.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా సమస్యను పంపిన కవిమిత్రమా! మీరు యే కార్యము గురించి మాట్లాడుతున్నారో ఆ కారం వేసి పూరిస్తాము :-)

    రిప్లయితొలగించండి
  3. అదేదో తెలియజేయండి స్వామీ!

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత గారూ,
    ఆ ‘కారము, కార్యము’లేమిటో మీ ఊహాశక్తికే వదలివేస్తున్నాను. ఏదైనా సభ్యతను అతిక్రమించకుంటే చాలు!

    రిప్లయితొలగించండి
  5. ఔరా బలసంపదలును
    మీరిన విశ్వాసగరిమ మేలు సమయమున్
    మేర లెరుంగవె హరిసహ
    కారము లేకున్న కావు కార్యములెందున్.

    రిప్లయితొలగించండి
  6. భారము తలపైఁ దాలిచి
    యూరికి యుపకారములవి యొప్పుగఁ దానే
    ధీరుడు చేయదలచు సహ
    కారము లేకున్న కావు కార్యము లెందున్.

    రిప్లయితొలగించండి
  7. కూరలు రుచించ వెప్పుడు
    కారము లేకున్న, కావు కార్యము లెందున్
    పోరంబోకుని మాదిరి
    భీకరముగ వాదు లాడి బిగుసుకు నుండన్ .

    రిప్లయితొలగించండి
  8. ఔరా! ప్రభుత్వమునగల
    తీరా? పెద్దలగు వార్కి తృప్తిగ లంచాల్
    పేరిమి సభలన్ బహు సత్
    కారము లేకున్న కావు కార్యములెందున్

    రిప్లయితొలగించండి
  9. కూర పులుసులు రుచించవు
    కారము లేకున్న;; కావు కార్యము లెందున్
    కారయిత లేక కలుగవు
    కోరిన మోక్షాదు లతనిఁ గొలువక వత్సా!

    రిప్లయితొలగించండి
  10. కారణ-కార్య నియమముల
    మీరక వివరించి మంచి మాటల మోడిన్
    సారోత్సాహించే నుడి-
    కారము లేకున్న కావు కార్యములెందున్

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    ధరలో నెక్కడఁ జూచిన
    విరళముగా లంచ మెంతొ విశ్వాకృతినిన్
    ధరియించెను; ధనసాక్షా
    త్కారము లేకున్న కావు కార్యము లెందున్.

    అజ్ఞాత గారూ!
    ఈనాటి సమస్య నిచ్చిన ‘కవిమిత్రులు’ వీరే! వీరు ఏ‘కారం’తో ఏ‘కార్యం’ సాధించారో గమనించారు కదా!

    రిప్లయితొలగించండి
  12. బేరము వాటాలందున
    సారము సహజవనరులను స్వాహా కొరకై
    ఘోరములలోన కడు సహ
    కారము లేకున్న కావు కార్యము లెందున్

    రిప్లయితొలగించండి
  13. మీరిన విశ్వాసములును,
    మేరునగసమాన కలిమి మెండుగయున్నన్,
    శ్రీరస్తని పల్కెడు శ్రీ (యోం)
    కారము లేకున్న కావు కార్యములెందున్.

    రిప్లయితొలగించండి
  14. భారత అహింస యుద్యమ
    సారధిస్వాతంత్ర్యదేశసాధకుడాయెన్
    పోరాటపటిమగల శ్రీ
    కారములేకున్నకావుకార్యములెందున్!

    రిప్లయితొలగించండి
  15. మారును యుగములు మరి మరి
    మారదు మర్కటపు బుద్ధి మనుజుల కెపుడున్ !
    ధీరత మీరిన పలువి
    కారము లేకున్న కావు కార్యము లెందున్ !

    రిప్లయితొలగించండి
  16. కారము వలె కూరకు సహ
    కారము వలె దంపతులకు కాపురమున శ్రీ
    కారము వలె కావ్యమునకు
    'కారము' లేకున్న కావు కార్యములెందున్.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! అజ్ఞాత గారూ ! 'కార్యము ' కావాలంటే ముందు (సహ) 'కారము ' కావలసిందే.తర్వాత 'యావత్తు ' ఇస్తే సరిపొతుంది.

    రిప్లయితొలగించండి
  18. ఆశావాదదృక్పథ స్పూర్తితో:

    పోరుకు ముందరె క్రీడా
    కారులు'వి' నిజూపి విజయకాంక్షనుదెలుపన్
    జేర విజయతీరమ్ము 'వి'
    కారము లేకున్న కావుకార్యములెందున్

    రిప్లయితొలగించండి
  19. **************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘సమాన కలిమి’ అని దుష్టసమాసం. అక్కడ ‘సమాభూతి’ అంటే సరి!
    *
    శ్యామలీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    చక్కని బోధామృతాన్ని ఇచ్చారు మీ పూరణతో. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది. ‘మీరక వివరించి మంచి మించిన మోడిన్’ అంటే యతిదోషం తొలగిపోతుందని నా సూచన.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘భారత + అహింస’ అన్నప్పుడు సంధి జరగాలి కదా! ‘భార మన కహింసోద్యమ’ అందామా ఆ పాదాన్ని.
    మీ రెండవ పూరణ చమత్కారభరితమై ఉత్తమంగా ఉంది. భళీ!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రకరకాల ‘కారాల’తో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కోరికలు దీర దలచిన
    సారవిచారమ్ము విబుధ సంగతి,వెలయన్,
    ధీరోదాత్తతయు ,బురుష
    కారము లేకున్న కావు కార్యము లెందున్.

    రిప్లయితొలగించండి
  21. నమస్తే
    శ్రీ గుండు మధుసూధన్ గారి భావము బాగున్నది. కానీ పద్య పాదముల ఆద్యక్షరములు గురువులు కావలసి యున్నది.

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 05, 2012 11:35:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    చేరువలో నిలిపినను
    న్నేరీతిగ చేయగల్గుదిక్కార్యంబుల్
    ఏరూపమును శరీరా
    కారము లేకున్న కావు కార్యము లెందున్.

    ఒకానొక సినిమాలో చిరంజీవిగారి పాత్ర అకాలమరణం పొంది యమధర్మరాజుతో పోరాడి తిరిగి భూలోకమునకు వచ్చుసరికి శరీరాన్ని నశింపజేసి ఉంటారు. అప్పుడు యమభటులతో చిరంజీవిగారి పాత్ర శరీరం లేకుండా ఏమీ చేయలేము అని అంటాడు. (శరీరమాద్యంఖలు ధర్మసాధనం)

    రిప్లయితొలగించండి
  23. కమనీయం గారూ,
    పురుషప్రయత్నం కార్యసాధనకు మూలమన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు. మీరు చెప్పేదాకా గుండు వారి పూరణలోని వైలక్ష్యణ్యం నా దృష్టికి రాలేదు. నిజమే!
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గుండు మధుసూదన్ గారూ,
    పాదాద్యక్షరము గురువై ఉండాలి కదా! మీ పద్యానికి నా సవరణ....

    ధారుణి నెక్కడఁ జూచిన
    నారూఢముగాఁ జెలంగె నఁట లంచము, స
    ర్వారాధ్యము; ధనసాక్షా
    త్కారము లేకున్న కావు కార్యము లెందున్.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ గురుభ్యోనమః
    గురువుగారూ,
    పొరపాటున సంధి తప్పింది.
    ‘భార మన కహింసోద్యమ’ గా మొదటి పాదాన్ని సరిచేద్దమన్నారు.నా బుర్రకు అర్థం స్పురించడంలేదు.దయతో వివరించ ప్రార్థన.ధన్యవాదములు.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. సహదేవుడు గారూ,
    అది ‘భారము + అనక + అహింసోద్యమ’

    రిప్లయితొలగించండి
  27. గౌరవనీయులు మంత్రులు
    కోరికలను దీర్చువారు కోరిన వరముల్
    తేరకు నివ్వరు; తగు స్వీ
    కారము లేకున్న కావు కార్యము లెందున్

    రిప్లయితొలగించండి
  28. బేరము సారము తెలియక
    చీరలు సారెలు కొనుటను చిక్కున పడగా
    కూరిమితో నత్తయ చీ
    త్కారము లేకున్న కావు కార్యము లెందున్

    రిప్లయితొలగించండి