4, జూన్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 725 (రావణాగమనముఁ గోరె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రావణాగమనముఁ గోరె రమణి సీత.

కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో...

కన్నడ సమస్య...

"ರಾವಣಾಗಮನ ವನುಕಾದಳು ಸೀತೆ ಕಾತುರದಿ"

25 కామెంట్‌లు:

  1. ఉత్సాహ:
    ఏ విపత్తు సంభవించు నెటుల మారు యోగమో
    దైవలీల యేమిటోకదా! వడిన్ మృగంబుతో
    శ్రీవిభుండు వచ్చుననుచు చిత్తమలర దైత్య వి
    ద్రావ ణాగమనము గోరె రమణి సీత వేడ్కతో

    రిప్లయితొలగించండి
  2. "నేడు పోయి రేపటి వేళ నీవు రమ్మ"
    టంచు రఘుకులుండు వదలె ననుచు వినగ -
    మరుదిన మాహవంబున మరణమొంద
    రావణాగమనము గోరె రమణి సీత.

    రిప్లయితొలగించండి
  3. పాఠశాల వార్షికోత్సవమున తమ కుమారుడు వేయు రావణాసుర పాత్రను చూడాలని వెళ్ళిన తల్లి ఆతృత....

    రావణాసుర వేషము రాము డాడ
    బడికి జేరెను తండ్రియు భార్య తోడ
    కొడుకు వేసెడి పాత్రను కోరి చూడ
    రావణాగమనముఁ గోరె రమణి సీత.

    రిప్లయితొలగించండి
  4. రావణుడి ఆగడములు అధిక మాయె
    జగన్మాత సంకల్పించె ఆతని కట్టిపెట్ట
    ప్రకృతి సంకల్పింప మనంబున
    రావణాగమనము గోరె రమణి సీత!


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. బడిని నాటక మందున కొడుకు వేయు
    రావణాసుర పాత్రను రయముగాను
    చూచి సంతస మందగ వేచి వేచి
    రావణాగమనముఁ గోరె రమణి సీత.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సీతారాముల కళ్యాణ మాయె
    రామ చంద్రుని నగు మోము
    మనః పున్నమి లో మది నిండ
    శ్రావణాగమనము గోరె రమణి సీత!

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  7. మృత్యుదేవత రణమున మిగుల వేచి
    రావణాగమనము గోరె; రమణి సీత
    వేచె రాముని కరుణకై, వీరుడయిన
    తనదు పతిదేవు రాకకై తపము చేసె.

    రిప్లయితొలగించండి
  8. రావణాసుర గణముతో రణమునందు
    చెలగె రాముండు వానర సేన తోడ
    నేలకూలిరి రాక్షస నేతలెల్ల
    రావణాగమనము గోరె రమణి సీత( యుద్ధరంగానికి )

    రిప్లయితొలగించండి
  9. భయము కల్గిం చె సీతకు బాధ కలిగె
    రావణా గమనము , గోరె రమణి సీత
    రాము డేతేరి లంకకు రయము గాను
    రావణాదుల మర్దించి కావ తనను

    రిప్లయితొలగించండి
  10. శోక బాధను సహియింప శమమె దారి
    మాస మెయ్యది సుపవిత్ర మొసగ తపము
    అనగ ఆషాడమానాడె అంత్య మొంద
    శ్రావణాగమనము గోరె; రమణి సీత

    తేటగీతిలో ఇది నా తొలి యత్నమని మనవి!

    మూల సమస్య కన్నడంలో భామినీ షట్పదీ అనే (౩+౪ గణాల) మాత్రాగణబద్ధమైన ఛంధంలోనిది. అప్పుడు చేసిన పూరణాన్ని తెలుగులో భామినీషట్పదిలోనే ఇలా అనువాదిస్తున్నాను.


    దైవ నియతిని దాట నెటులగు
    చావమని వేదవతి శాపము
    భావమదియే సీతగా ఖలయజ్ఞదీక్షితయై
    పావకమొ పాపాంధకారమ
    దావహించిన మృత్యువాపికి
    రావణాగమనమునుగాంచెను సీత కాంక్షించి

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ....

    ద్వాపరమ్ము రానున్నది; శాపమందు
    రెండవదియైన జన్మమ్ము నిండె, యముఁడు
    రావణాగమనముఁ గోరె; రమణి సీత
    రాము దరిఁజేరి సుఖియించ, రాణి కాగ.

    రిప్లయితొలగించండి
  12. జలేబీ గారి భావాలకు ఛందోరూపం....
    (1)
    రావణుని యాగడములు దురంతము లయె
    నా జగన్మాత తాఁ గోరె నతనిఁ జంప
    ప్రకృతి సంకల్ప మది, దాని ఫలిత మనఁగ
    రావణాగమనముఁ గోరె రమణి సీత.
    (2)
    అవనిజకు రామునకును గళ్యాణ మయ్యె
    రామచంద్రుని నగుమోము రక్తిఁ గూర్చ
    నెమ్మనమ్మున నాషాఢమాస మరిగి
    శ్రావణాగమనముఁ గోరె రమణి సీత.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ చంద్రమౌళి గారి పద్యములు -- 3 + 4 మాత్రా ఛందస్సును తెలుగులో మనము ముత్యాల సరాలు అంటాము. గురజాడ వారి రచనలు ముత్యాల సరాలుగా ప్రశస్తి గాంచినవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. యుద్ద మంత్యంబు లంకకున్ పీడ తొలగె
    శుద్ధ స్నాతయై సానంద సాదరముగ
    ప్రాణ పతియంత కబురంప వచ్చె, విజిత-
    రావణాగమనము గోరె; రమణి సీత

    రిప్లయితొలగించండి
  15. మాయ లేడిని చూపించి మర్మ మెరిగి
    మానవాళికి యవతార మహిమ దెలియ
    ప్రాణ సఖుడైన రాముని ప్రతిభ కోరి
    రావ ణాగమనము గోరె రమణి సీత !

    రిప్లయితొలగించండి
  16. అంతా శోభగా రామాయణా౦తర్గత పూరణలు చేశారు. బాగున్నవి. నేను ప్రయోగాత్మకంగా సంధిలేకుండా (ముందు అక్షరం గురువు కాకుండా) "ద్రావణాగమనము..." అని పూరించాను. ఇది సరియేనా? రావణ శబ్దాన్ని ద్రావణ శబ్దంగా మార్చవచ్చా?

    పాఠశాల యందా సీత ప్రాక్టికల్సు
    చేయుచు వగచె చివరకొచ్చె ద్రవమంచు
    వేగనటనున్న బంట్రోతుకు వెల్లడించి
    ద్రావణాగమనముఁ గోరె రమణి సీత.

    రిప్లయితొలగించండి
  17. నా పూరణ "The Other" గా పోస్టు అయింది. గమనించగలరు.
    -చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. క్షమించాలి . ఒక చిన్న ప్రయత్నం. [ ఎన్ని తప్పులుం టాయో }
    ఉత్సాహ .
    నీవె నాదు ప్రాణ ధనము నీవె నాదు యశము గా
    భావ జాల మందు చిక్కి బాధ మరువ నెంచి తిన్
    అవని జాత నైన నన్ను నాద రించ దైత్య వి
    ద్రావ ణాగ మనము గోరె రమణి సీత మోద మున్ !

    రిప్లయితొలగించండి
  19. భర్తచావుమండోదరిమదినిఁదోచె
    స్త్రీసహజచిత్తమేపతిధ్యాసగొల్ప
    రావణాగమనముఁగోరె,రమణిసీత
    కోరె రామనాధుని ప్రేమకొరతదీర!

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులారా,
    లక్ష్మీదేవి గారి వల్ల కన్నడ బ్లాగు ‘పద్యపాన’ చూడడం తటస్థించింది. చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాను. ‘శంకరాభరణం’లో ఉన్నట్టే అందులోను సమస్యాపూరణలు, దత్తపదులు, ప్రహేళికలు ఉన్నాయి. చాలా సంతోషం కలిగింది. ముఖ్యంగా ఈవాడు ఆ బ్లాగులో ఇచ్చిన సమస్య ‘శాసనధిక్కారమే ప్రశస్తము కాదా’ అన్న శంకరాభరణం సమస్యకు అనువాదమే! సమస్య నిచ్చి దాని క్రింద ‘ఆధారం : తెలుగు బ్లాగు శంకరాభరణం’ అని ఇవ్వడం ఆనందాన్ని కల్గించింది.
    http://padyapaana.com/?p=1198#comments

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారూ,
    తేటిగీతి పాదాన్ని రూపాంతరం చేసిన మీ ఉత్సాహం ఔత్సాహిక కవులకు తప్పక స్ఫూర్తి నిస్తుంది. అద్భుతమైన పూరణ. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    రాముని చేతిలో రావణుని మరణాన్ని కోరుకున్న సీతను గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రావణుని పాత్రలో కొడుకును చూడగోరిన తల్లి సీతను గూర్చిన మీ పూరణ అన్ని విధాల సబబుగా, సమర్థంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    తొలి ప్రయత్నమైనా చక్కగా వ్రాసారు పద్యాన్ని. ఎంతైనా ‘పద్యపానం’ చేసేవారు కదా! చక్కని పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘మాస మెయ్యది సుపవిత్ర మగును తపము’ అని సవరిస్తే సరి!
    మీ భామినీ షట్పది అనువాదం చాలా బాగుంది.
    మీ రెండవ పూరణలో ‘విజిత రావణాగమనం’ అనడం శ్రేష్టంగా ఉంది. అభినందనలు.
    కన్నడ సంప్రదాయాన్ని బాగా ఒంట బట్టించుకున్నారు కనుక ఈ పద్యంలోను మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. నా సవరణ....
    పెనకువ ముగిసి లంకకున్ పీడ తొలగె (పెనకువ = యుద్ధము)
    శుద్ధ స్నాతయై సానంద శోభతోడ....
    *
    గుండు మధుసూదన్ గారూ,
    యముడు రావణాగమనాన్ని కోరాడన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు తప్ప ఇంకేం చెప్పను?
    ఇక ఉత్సాహం మహోత్సాహంతో ఉరకలు వేసింది. సంతోషం!
    *
    చంద్ర శేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చివరకొచ్చె’ను ‘తుదకు వచ్చె’ అందాం.

    రిప్లయితొలగించండి
  22. సహదేవుడు గారూ
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. రామచంద్రుడు వానరరాజు గూడి
    లంక పైన దండెత్తి బలాఢ్యులైన
    రాక్షసుల గూల్చెనని విని రయము మీర
    చెర వదలునని సమ్మోద చేతమునను
    విధిగ జరుగును దశకంఠు వధమటంచు,
    రావణాగమనము గోరె రమణి సీత.
    సీతాదేవికి రావణవధ తప్పదని తెలిసింది.అందువలన వాడిని ఒకసారి దయతో చూడాలను కున్నది అని నా వివరణ.

    రిప్లయితొలగించండి
  24. కమనీయం గారూ,
    మీ తేటగీతిక పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి