11, జూన్ 2012, సోమవారం

పద్య రచన - 26

 కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. గంగమ్మ దుమికె కడు ర
  మ్యంగా నల్లదె కనుడటు యవనికి జేరెన్
  సింగారముగా పంటల
  బంగారముగా నడచుచు వచ్చెను గనుమా!

  రిప్లయితొలగించండి
 2. తలపట్టెను గంగను తన
  తలపెట్టగ భవుడు నిలచె తడుపగ నవనీ
  తలము భగీరథు డప్పుడు
  తలపట్టుక దిక్కు నీవె దయ జూప మనన్.

  రిప్లయితొలగించండి
 3. భగీరథుండు దీక్షతో తపమ్మొనర్ప గంగ తా
  దిగెన్ నభమ్మునుండి తీవ్ర తేజమొప్ప నీశుడున్
  సిగన్ ధరించె నా నదిన్ విశేష శక్తి యుక్తులన్
  జగమ్ములెల్ల తత్ప్రశస్తి సంస్తుతింప సాదృతిన్

  రిప్లయితొలగించండి
 4. ఘోరతపంబొనరించి భ
  గీరథుడీశ్వరుని గూర్చి గెల్చెను గంగన్,
  ధీరులకవనీతలమున
  కోరిన సకలంబు గల్గు కువలయనాథా.

  రిప్లయితొలగించండి
 5. ఆకసంబున నుండియా యమ్మ గంగ
  శివుని దల మీద జారగ శివుడు నంత
  జటల యందున బంధించ జడల మౌని
  భాగి రధుడు ను గోరంగ వదలె గంగ

  రిప్లయితొలగించండి
 6. ఉత్తుంగ గంగఁ బట్టెను
  సత్తువ జూపి శివుడు తన జటలన్, కోరెన్
  బత్తుడు భగీరథుండు స
  రిత్తును పంపమని పితృల రేకెత్తుటకై !

  రిప్లయితొలగించండి
 7. శ్రీగంగా సంస్మరణమె
  పోగొట్టును పాపచయము పుడమిని జూడన్
  వేగమె వైష్ణవసన్నిధి
  నా గంగయె గూర్చుచుండు నవగాహమునన్. 1.

  తపమొనరించె భగీరథు
  డపుడా గంగను దలంచి యద్భుతరీతిన్
  కృపఁ జూపుచు మందాకిని
  నృపతికి సమ్మతిని దెల్పె నేలకు రాగన్. 2.

  శివుడు భగీరథుడడుగగ
  భువిఁ జేరెడు గంగ కొరకు భువనావనుడై,
  ధవుడై జటలం జూపెను
  శివయై స్వర్గంగ యందు జేరినదపుడున్. 3.

  జేజే గంగామాతా!
  జేజే కరుణాంతరంగ! జే స్వర్గంగా!
  జేజే విష్ణుతనూజా!
  జేజే లొనరింతుమమ్మ శ్రేయము లిమ్మా! 4.

  దేవా! సకలసురేశ్వర!
  రావా! ప్రమథాధినాథ! రా మము కావన్
  నీవే సర్వేశ్వరుడవు
  నీవే సుఖదాత వింక నిక్కం బీశా! 5.

  రిప్లయితొలగించండి
 8. (గంగాస్తవము - శ్రీమదధ్యాత్మరామాయణము నుండి)

  అమర గంగానదీ! ఆకాశసీమలో
  ప్రణవనాదమ్ముతో ప్రభవమొంది
  యఖిల పావనకర్త్రివై భగీరథు తప
  స్సిద్ధిచే ధాత్రికి జేరుచుండి
  ధాటిగా శివుజటాజూటమ్ము నందుండి
  ప్రథిత మానస సరోవరము జొచ్చి
  కాశీ గయా ప్రయాగ ముఖ తీర్థములలో
  శ్రితబృందములకు సద్గతుల నిడుచు
  నాదరమ్మున విభుడగు నబ్ధి జేరి
  యమిత సుఖముల దేలునో యమృతరూప!
  పుణ్య మందాకినీ మనః పుండరీక
  సంస్థవగు నిన్ను గొలుతు ప్రసన్న హృదయ

  రిప్లయితొలగించండి
 9. సగరుని పుత్రుల కొఱకై
  వగచి భగీరథుఁడు వేడె పరమేశ్వరునిన్.
  దగురీతి సురనది నిలకు
  దిగునట్టులఁ జేయమంచు దేవునిఁ గోరెన్.

  సురలోకము వీడి దుమికి
  పరుగులుఁ దీసెడు నదికిని పగ్గము వేసెన్
  హరుఁడు జటాజూటమునన్
  గురి చూసి నదిని విడువక కొలదిగ నైనా.

  పృథివికిఁ బంపగను భగీ
  రథునికిని వరమునొసంగి రయమున పంపెన్
  కథలనుఁ బలికితి నే దశ
  రథు వంశమునున్ దలంచి రక్తిని గొలుపన్.

  రిప్లయితొలగించండి
 10. తపము ఫలించె భగీరధ
  నెప మెన్నక దుమికె గంగ నురుగుల తరగల్ !
  కపర్ది శిరము నుండియు
  జప తపముల మునుల దాటి సగరుల పైనన్ !

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారూ,
  ఉదయమే పంపిన మీ మొదటి పద్యం బంగారంలా సింగారించుకొనే ఉన్నది. కాకుంటే ఆ బంగారంలో చిన్నమొత్తు రాగి కలిసింది. ‘రమ్యముగా’ అనవలసిన దానిని ప్రాసకోసం ‘రమ్యంగా’ అని వ్యావహారికం చేసారు. పరవాలేదు లెండి. ‘కనుడటు యననికి’ని ‘కనుడటు లవనికి’ అందాం...
  మధ్యాహ్నం పంపిన మూడు పద్యాలూ ముచ్చటగా ఉన్నాయి.
  మొదటి పద్యంలో ‘వేడె పరమేశ్వరునిన్- దేవునిఁ గోరెన్’ అని పునరుక్తి వస్తున్నది. ‘దేవునిఁ గోరెన్’ అన్నచోట ‘తీక్ష్ణతపమునన్’ అంటే ఎలా ఉంటుంది?
  రెండవ పద్యం చివర ‘కొలదిగ నైనా’ ను ‘కొలదిగ నైనన్’ అందాం.
  మూడవ పద్యం బాగుంది.
  మీ పద్యరచనోత్సాహానికి అభినందనలు.
  *
  హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  “సగౌరవమున త్వత్కవిత్వచాతురిన్ నుతించెదన్” ఇంతకంటే ఏమనగలను?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  గంగావతరణ ఘట్టాన్ని చిన్న పద్యంలో చక్కగా ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు.
  ‘భాగీరథుని’... ‘భాగిరథుని’ చేసారు. ఆ పాదాన్ని ‘వదలు మని కోరె శర్వుడు వదలెనంత’ అందామా?
  *
  చంద్రశేఖర్ గారూ,
  చక్కని ప్రాసతో అందమైన పద్యం వ్రాసారు. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  గంగా ప్రాశస్త్యాన్ని మనోహరంగా వర్ణించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్యా,
  మంచి భావంతో పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  రెండో పాదంలో యతి తప్పింది. మూడో పాదం మొదటి (బేసి)గణం(కపర్ది) జగణం అయింది. సవరిద్దామంటే జ్వరంతో నాకు మతి తప్పింది, ఇంట జగడం అయింది. వీలైతే రేపు ఉదయం సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 13. తపము ఫలించె భగీరధ
  నెప మెన్నక దుమికె గంగ నెవ్వడి తరగల్ !
  కపటము తెలియక పరుగిడె
  జప తపముల మునుల దాటి సగరుల పైనన్ !

  నె వ్వడి = మిక్కిలి వేగము
  ------------------------------------------------------
  తమ్ముడూ ! " సవరించాను మరి " ఇప్పుడు , జ్వరం రాకుండా ఉంటే చాలు . " "జ....గ....డం.....మ........జా.......! "

  రిప్లయితొలగించండి
 14. గురువు గారు,
  సవరణలకు ధన్యవాదములు. మీకు శ్రమ యిచ్చాను. దొరికిన తక్కువ టైములో వ్రాయాలనుకోకుండా నిదానంగా సరిచూసుకొని వ్రాస్తాను.
  యననికి, లవనికి - ఎప్పుడూ వినలేదు. అర్థం కాలేదండి.

  రిప్లయితొలగించండి
 15. రాజేశ్వరి అక్కయ్యా,
  ఇప్పుడు అన్ని విధాలా బాగుంది. సవరించినందుకు ధన్యవాదాలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ‘కనుడటు యవనికి’ ని ‘కనుడటు లవనికి’ అని సవరించమన్నాను. ‘యవనికి’ అనేది ‘యననికి’ అని నా టైపాటు...
  అది ‘లవనికి’ కాదు.... ‘కనుడటుల + అవనికి’

  రిప్లయితొలగించండి
 16. గురువు గారు,
  ఇప్పుడర్థమయింది నా మట్టి బుఱ్ఱకు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి