8, జూన్ 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 37

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


37

I THOUGHT that my voyage had come
to its end at the last limit of my power,
that the path before me was closed,
that provisions were exhausted and the
time come to take shelter in a silent
obscurity.

But I find that thy will knows no
end in me. And when old words die
out on the tongue, new melodies break
forth from the heart; and where the
old tracks are lost, new country is
revealed with its wonders.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....


నా మనసులోన నిట్లొకనాడు దోచె
*“ఏది కావలెనో యది యెల్ల నయ్యె,
పయన మిది తుది ముట్టె, శక్తియు గతించె,
బాట తెలియదు ముం దొక పనియు లేదు,
దారి బత్తెము మొత్తము తీరిపోయె,
ఈ శిథిలజీవితమ్ముతో, నీ విశీర్ణ
మలినవేషమ్ముతో, నెట్టి యలికిడి విన
రాని యొక యేదొ యేకాంత మైన నీడ
పట్టు చేరెడి సమయము వచ్చె” నంచు ||

కాని కన్గొంటి నేడు, నాలోన నీదు
లీల కింక ముగింపు కాలేదు స్వామి!
దీని నవ్యత కవధియె కానరాదు ||

నాదు శబ్దమ్ముల పురాతన స్వరాలు
తీయఁదనమెల్ల చెడి మూగబోయినపుడు
శ్రావ్య నవపదగీతికాస్వరము లంత
రంగమందున పొంగులు పొంగె మఱర ||

పరిసమాప్త మైపోయిన ప్రాతబాట
యదియె నన్నిప్డు కొని చనె, నద్భుతంపు
దృశ్యముల్ పొల్చు కొంగ్రొత్త దేశమునకు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి