6, జూన్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 727 (రాముఁడు సేయలేని పని)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రాముఁడు సేయలేని పనిరా కపులెల్లరకున్ సుసాధ్యమే!

కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో...

కన్నడ సమస్య...

“ರಾಮಗಾಗದ ಕಾರ್ಯ ಕಪಿಗಳಗುಂಪಿಗತಿ ಸುಲಭ”

23 కామెంట్‌లు:

  1. రాముని పంపునన్ కపులు లంకకు చేరుట సాధ్యమౌనొకో
    యేమిటి కుప్పి గంతులని యెంచకు రావణ భూమికీశుడౌ
    స్వామికసాధ్య మేదిలను వార్నిధి నాపుట వారినంపుటల్
    రాముఁడు సేయలేని పనిరా ? కపులెల్లరకున్ సుసాధ్యమే!

    రిప్లయితొలగించండి
  2. రాముని నామ మంత్రము వరమ్ము బలమ్ముగ నొంది వానరుల్
    నేమముతో జపించుచును నీరధిపై నొక యద్భుతమ్ముగన్
    గామిడియైన సేతువును గట్టిరి కేవల మైదు నాళ్ళలో
    రాముడు సేయలేని పనిరా కపు లెల్లరకున్ సుసాధ్యమే

    రిప్లయితొలగించండి
  3. రాముని నామమే తనకు రక్షగనెంచి హనూమ వారధిన్
    శేముషితోడ లంఘనముజేసెను, భీకర తాటకాద్యులన్
    రాముని బాణమే కదన రంగమునందున కూల్చివైచెనే
    రాముడు సేయలేని పనిరా? కపులెల్లరకున్ సుసాధ్యమే.

    రిప్లయితొలగించండి
  4. తానె పరంధాముడని ఆ రామచంద్రునికి తెలుసునా ?
    సీత కై లంకను జేర తన కృతి కపి,ఉడుతలను నాడినాడు
    తాము ఆ పై వాని కి సేవిస్తున్నామని వాటికి తెలుసునా ?
    రాముడు సేయలేని పనిరా, కపులెల్లరకు సుసాధ్యమే !


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. భూమిజుశోధనంబొసగి భూతలమంతయు జల్లడాడగా
    నామము రాయగా శిలలు నాజలధిన్ దలదేలినిల్వగా
    సామిని సంగరంబునను సారగ మోయగ వాలమాడగా !
    రాముడు సేయలేని పనిరా కపు లెల్లరకున్ సుసాధ్యమే

    రిప్లయితొలగించండి
  6. భీమబలాఢ్యుడై సురల భీతిల జేసిన రావణాసురున్
    నామబలమ్ముపై మిగుల నమ్మికతోడను భూమిజాతకున్
    క్షేమముఁగోరి నాడసురు జీల్చిరి స్వర్గము నేలినట్టి సు
    త్రాముడు సేయలేని పనిరా, కపులెల్లరకున్ సుసాధ్యమే!

    రిప్లయితొలగించండి
  7. భీమబలాఢ్యుడై సురల భీతిల జేసిన రావణాసురున్,
    నామబలమ్ముపై మిగుల నమ్మికతోడను, భూమిజాతకున్
    క్షేమముఁగోరి, నాడసురు జీల్చిరి; స్వర్గము నేలినట్టి సు
    త్రాముడు సేయలేని పనిరా, కపులెల్లరకున్ సుసాధ్యమే!

    రిప్లయితొలగించండి
  8. నా పూరణలో అసురు జీల్చిరి అంటే రావణుని కపులేం చేశారు రాముడు చంపాడనిపించవచ్చు.
    గెల్చిరి అంటే సరిపోతుందనుకుంటాను. రామనామమ్మును నమ్మి పోరాడి వానిని గెల్చారు కాబట్టి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 06, 2012 2:28:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    గ్రామములందు కుడ్యములు ప్రాకుచు చంచల మైన బుద్ధితోన్
    కోమలమైన వృక్షముల కొమ్మలు ద్రుంచుచు గోల సేయుటల్
    రోమము రోమముల్నడుమ లోతులలోగల పేల నేరుటల్
    రాముఁడు సేయలేని పనిరా, కపులెల్లరకున్ సుసాధ్యమే!

    రిప్లయితొలగించండి
  10. రాముడు యానతీ యగనె రాకపు లందరు ప్రీతి జెందుచున్
    మేమిక రామునిన్ గొలిచి మేరువు దాటుచు మేఘ దీపమై
    భీముని మించు రూపమున భీకర రూపము దాల్చి వేగమే
    రాముడు సేయలేని పని రాకపు లేల్లరకున్ సుసాధ్యమే

    మేఘ దీపము = మెరుపు

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    వేమరు కుప్పిగంతులును, వీక్షణలో చిటిలింపు, వాలముల్
    పాముల వోలెఁ ద్రిప్పుటలు, పండ్లికిలింపులు, నెత్తి గోకుటల్,
    నీమముతోడ నిక్కుటలు, నిత్యము కొండలు చెట్టు లెక్కుటల్
    రాముఁడు సేయలేని పనిరా కపు లెల్లరకున్ సుసాధ్యమే.

    రిప్లయితొలగించండి
  12. రాముడుధర్మవిగ్రహమని రాజ్యము లోకముప్రస్తుతింపగన్
    ప్రేమలుజూపగన్ మిగులపిన్నలుపెద్దలుమ్రొక్కుచుండగన్
    రాముడుసేయలేనిపనిరా?కపులెల్లరకున్ సుసాధ్యమే
    రామునినామమేజగతిఁరక్షణజేయునటంచుఁదెల్పగన్!

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కృతులు...
    ఒక మిత్రునితో అత్యవసరంగా ఊరికి వెళ్ళవలసి వచ్చింది. రోజంతా ఎండలో ప్రయాణం... బాగా అలసిపోయాను.
    పూరణలు పంపిన కవిమిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు.
    రేపు ఉదయం వీలువెంబడి మీమీ పూరణలను విశ్లేషిస్తాను. ఆలస్యానికి మన్నించండి....

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితుల పూరణ మనోహరంగా ఉంది.
    లక్ష్మీ దేవి గారి పూరణ భేషుగ్గా ఉంది.
    మిత్రుల అందరి పూరణలూ చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారు,
    ధన్యవాదాలండి.
    ప్రథమ తాంబూలం అందుకున్న పెద్దలు మీరు.

    రిప్లయితొలగించండి
  16. రాముని దివ్య నామ మధురామృత పానము సేయుటన్న; శ్రీ
    రాముని ధర్మపత్ని పద రాజము మ్రొక్కి తరించుటన్న; ఆ
    రాముని పంపునన్ వెడలి రాచ పనుల్ జరిపించుటన్న - ఆ
    రాముడు సేయలేని పనిరా! కపు లెల్లరకున్ సుసాధ్యమే!

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    రామునిపై పద్యం అంటే మీరు తన్మయులౌతారని తెలుసు. మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘హనూమ’ అనరాదు కదా! అక్కడ ‘రక్షగ వాయుసుతుండు వారధిన్’ అందాం.
    *
    జిలేబి గారూ,
    మంచి భావాన్ని ఇచ్చారు కానీ దానికి ఛందోరూపం ఇవ్వాలంటే నాకు కొంత గడువు కావాలి.
    *
    చంద్రమౌళి గారూ,
    బాగుంది మీ పూరణ. ముఖ్యం యతిమైత్రిని చక్కగా పాటించారు. అభినందనలు.
    ‘భూమిజు’ను ‘భూమిజ’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    వాహ్! అద్భుతమైన పూరణ. అభినందనలు.
    ‘నా డసురు’ అన్నచోట ‘రాక్షసులఁ జీల్చిరి/ గెల్చిరి’ అంటే బాగుంటుందేమో?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    కోతి చేష్టల వర్ణనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘రాముడు + ఆనతీయ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘రాముడు పంపగా కదలిరా కపు....’ అందాం.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    స్వభావోక్తితో మీ పూరణ అలరించింది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారు,
    మీ ఆశీర్వాదం వల్ల నేను ధన్యత పొందినాను.
    మీ సవరణ బాగున్నప్పటికీ, మొదటి పాదంలో రావణాసురుని అని ప్రారంభించి యున్నాను కాబట్టి నాడు అసురుని అనే అనవలసి వస్తున్నదండి.

    రిప్లయితొలగించండి
  19. తప్పును సవరించినందులకు ధన్యవాదములు గురువుగారూ.

    ఒకానొక సంస్కృతస్తోత్రములో "హనూమంతమీడే" అని వుంది. అంతే గాక ఒక జానపద గీతములో
    " ఓరినాపే రనూమంతుడు,
    రావణా వినరా నేనే రా ములా బంటునూ " అని వుంది.
    అందువలననే వ్రాసినాను. జానపద భాషను పద్యానికి తీసుకొనలేము. అలానే సంస్కృతములో ఎన్ని సంధి సమాసాలతో వ్రాశారో కదా ( సంస్కృతపరిజ్ఞానము లేనివాణ్ణి ).

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  20. భీమబలుండు శత్రుజనభీకరుడై యిటు వాయునందనున్
    డా మదర్వితుండగు దశానను,తో నిటు బల్కె మూర్ఖ 'నా
    స్వామి రఘూత్తముండు నిను జంపు ససైన్యముగా రణమ్మునన్
    రాముడు సేయలేని పనిరా కపులెల్లరకున్ సుసాధ్యమే.

    రిప్లయితొలగించండి
  21. గోముగ చెట్టు లెక్కుటయు; గొప్పగ పేలను నొక్కి చంపుటన్;...
    పామును జూచి పారుటయు; పళ్ళను జూపుచు వెక్కిరించుటన్;...
    క్షేమముగా సముద్రమును చెంగున దాటుచు లంక కాల్చుటన్;...
    రాముఁడు సేయలేని పనిరా;...కపులెల్లరకున్ సుసాధ్యమే!

    రిప్లయితొలగించండి