2, జూన్ 2012, శనివారం

సమస్యాపూరణం - 723 (తనయను సేవింప)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్


ఈ సమస్యను పంపిన

కవిమిత్రునకు

ధన్యవాదాలు

26 కామెంట్‌లు:

  1. కనకపు ధారా స్తవమును
    వినయముతో పఠన జేసి వివిధ సుమాలన్
    అనవరతము క్షీరాంబుధి
    తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    రిప్లయితొలగించండి
  2. అనయము "మాతా"యంచును
    మనమున సద్భక్తిఁ బూని మహిమాన్వితయున్
    ఘనదురితాపహ నా గిరి
    తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్

    రిప్లయితొలగించండి
  3. వనరాశిశయను, జనజీ
    వన సంరక్షకుని, సుజనవందితు, బృందా
    వన సంచారుని వనజా
    తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్

    రిప్లయితొలగించండి
  4. అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు & శ్రీ హరి....మూర్తి గారూ!
    తనయను తనయ అనే వాడుతారా లేక మారుస్తారా అనుకొనినాను, మీరు మార్చ లేదు. అయినా భక్తిరసముతో మీ పూరణలు బాగుగ నున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. కలికాలమున కొమరుడు అమెరికాకి అంకితం
    తల్లి దండ్రు లారా,తెలుసుకోనుడీ జిలేబీ సత్యం
    కాలగతిన తనయ అనునయమే మీకు రక్ష కాన
    తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్

    జిలేబి.
    (అమెరికా కి అంకితమై పోయిన పుత్రా, వింటున్నావా!)

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారి భావానికి ఛందోరూపం......

    తనయులు విదేశగతులై
    జననీజనకులను చూడఁ జాలని కాలం
    బని యెఱిఁగి, క్షేమ మరసెడి
    తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    రిప్లయితొలగించండి
  7. అనయము ప్రేమ తొ జూడుము
    తనయను , సేవింప నొదవు దద్దయు సుఖముల్
    నిరతము భక్తి తొ శివునకు
    వినయముగా నొదిగి యుండి వేమరు విధముల్ .

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పూరణ....

    అనలాంబకు, నభవు, శివునిఁ,
    ద్రినయను, బాలేందుమౌళిఁ, ద్రిపురారిఁ, బినా
    కిని, సర్వజ్ఞుఁ, గృపా భరి
    త నయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    రిప్లయితొలగించండి
  9. నా పూరణ....

    మినుసిగవేలుపుఁ, బంచా
    ననుఁ, ద్రిపురాంతకుని, శీతనగతనయేశున్,
    మనసిజ దాహ ప్రజ్జ్వలి
    త నయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    రిప్లయితొలగించండి
  10. అనవరతము హరి కీర్తన
    సునిసితపు నడత, పలుకున్ సూనృత వాక్యము
    తొణికించియు కరుణా భరి
    త నయను సేవింప నొడవు దద్దయు సుఖముల్!

    రిప్లయితొలగించండి
  11. పై పద్యమును యిలాసరిచేయడమైనది:
    అనవరతము హరి కీర్తన
    సునిసితపునడత,పలుకునసూనృతవచనమ్
    దొణికించియు కరుణాభరి
    త నయను సేవింప నొదవుఁదద్దయుసుఖముల్!

    రిప్లయితొలగించండి
  12. తన ప్రభువు యొక్క నామము
    వినినంతనె కన్నులవియె వేగమె తడియౌ
    ననగా, హనుమను, జలభరి
    త నయను; సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    వినయము గల్గిన గుణవతి
    తన మనమందున నిలువగ తామసమేలా,
    చని, మగువను, మీ మామకు
    తనయను; సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    రిప్లయితొలగించండి
  13. తనువిలను వీడుటకుమొద
    లనఘుని సత్చిత్సుఖాంతరంగుని కృష్ణున్
    ఘనతత్త్వార్థుని కంజా
    త నయను; సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘క్షీరాంబుధి తనయ’ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వినయముతో పఠన జేసి’ని ‘వినయముతోడను పఠించి’ అంటే బాగుంటుందేమో!
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘గిరితనయ’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    వైవిధ్యంగా ‘వనజాత నయను’ సంబోధించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    నిజానికి మీ వ్యాఖ్య చూసేంతవరకూ నాకూ ఆ ఆలోచన రాలేదు. ధన్యవాదాలు.
    *
    జిలేబీ గారూ,
    చక్కని భావాన్ని చెప్పేరు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘కృపాభరిత నయను’డైన శివుని సంబోధించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీరు విష్ణువును ‘కరుణాభరిత నయను’ణ్ణి చేసారు. బాగుంది. అభినందనలు.
    సునిసిత... సునిశిత అనాలనుకుంటాను.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పూరణలు దేనికదే బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ చంద్రమౌళి గారూ! శుభాభినందనలు. మీ పూరణ చాలా బాగుగ నున్నది. సత్ + చిత్ = సచ్చిత్ అవుతుంది. ఆలాగున మారుద్దాము మీ పద్యము 2వ పాదములో. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ పండిత నేమానివారికి, శంకరార్యులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. ధనమే జగతికి మూలము
    కనకపు సింహాసనమున గాంచగ సుఖముల్ !
    తనరుచు క్షీర సాగర
    తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్ 1

    రిప్లయితొలగించండి
  18. విను రామా నే జనకుని
    తనయను! సేవింప నొదవు తద్దయు సుఖముల్,
    ఘన యశము తరుణి కిద్ధర
    ననయము పతినంటి యుండి, నని వినియుంటిన్.

    రిప్లయితొలగించండి
  19. శ్రీగురుభ్యోనమః
    ఆర్యా,ఇంగ్లీషులోటైపు జేయటంవల్లదొర్లిన తప్పు.మీసవరణ సరి.ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    ‘క్షీరసాగర తనయను’ సేవింపుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘తనరుచును’ అంటే గణాలు సరిపోతాయి.
    *
    మిస్సన్న గారూ,
    ఎవ్వరికీ రాని ఆలోచనలు మీకు వస్తుంటాయి. ఈరోజు మీకంటే ముందు సమస్య విరుపుతో పూరణ చేసినవారు లేరు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. వనజనయను ప్రాణేశ్వరి,
    వనజాసన,వనజహస్త, వనమాలియెదన్,
    అనయము నెలకొను,వననిధి
    తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్

    రిప్లయితొలగించండి
  22. ధన్య వాదములు తమ్ముడూ !
    మూడవ పాదం వెలితిగా ఉంది అనుకున్నాను గానీ తట్టలేదు. సవరించినందుకు మరొక సారి ధన్య వాదములు . ఆరోగ్యం జాగ్రత్త మరి

    రిప్లయితొలగించండి
  23. కమనీయం గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. కనుగొని నిజామబాదున
    వినయముతో ధనముతోను విజ్ఞాపనతో
    ఘనముగ తెరాస శేఖర
    తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్

    రిప్లయితొలగించండి
  25. మినుముల బెల్లపు నుండలు
    తినుటకు వాగీశ్వరిడదు తెలగాణమునన్
    వినయముతో పాల కడలి
    తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్

    రిప్లయితొలగించండి