18, జూన్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 739 (జాలమే యవరోధమ్ము)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

జాలమే యవరోధమ్ము సాధకులకు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. జాల మయినచో సుధయే విషమ్ము సుమ్ము
    జాలమై మాయ త్రోయు సంసారమందు
    కామ క్రోధాదు లనబడు నట్టి వైరి
    జాలమే యవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  2. మౌనధారణ జేయుచు మానితముగ
    ముక్తి గోరెడు జనులకు మునులకైన
    నవని నైహికసుఖముల యందు మోహ
    జాలమే యవరోధమ్ము సాధకులకు.

    రిప్లయితొలగించండి
  3. నా పద్యములో యతి తప్పును సరిదిద్దుతూ:

    జాలమయినచో సుధయే విషమ్ము సుమ్ము
    జాలమై మాయ త్రోయు సంసారమందు
    కామ క్రోధ లోభాది షట్కమను వైరి
    జాలమే యవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  4. బంధముల ద్రెంచి తపసుకై బదరి కేగ
    జ్ఞాపకంబులు మనసున జ్ఞప్తి కలుగ
    బంధు మిత్రుల పాలిట పరగు మోహ
    జాలమే యవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  5. నేర్పు విషయము లీ ' నెట్టు ' నేర్పుగాను
    చాల యువతకు ' కెరియరు ' సాధనమున
    చిట్టి నెట్టిది 'మిస్యూజు ' సేయ నిట్టి
    జాలమే యవరోధమ్ము సాధకులకు.

    రిప్లయితొలగించండి
  6. నిరతపద్యరచనఁ జేయు నేర్పు లేక
    గొప్పకావ్యము వ్రాయుచో, క్రొత్త భావ
    ప్రకటనలఁ జేయు వేళల, పరిమిత పద
    జాలమే యవరోధము సాధకులకు.

    రిప్లయితొలగించండి
  7. రాగ దోషంబొక్కటిపుట్ట – ’నాది’, ’నేను’
    ద్వేష భావమెతోడైన ’తేడ ’,’వేరు’
    తగుల రాగద్వేషాలన్న తంత్ర మింద్ర
    జాల మేయవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  8. మనసునిల్వక వృత్తులు మరలజొచ్చి
    భావ రంగాన చిత్రాల బలిమిపెరుగ
    ధ్యానమేలాగు కుదురును ధ్యాతృచిత్త
    జాలమే యవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  9. 1.సమస్య నం.738
    పరమ భాగవతుల,దీన భక్తజనుల,
    నెపుడు బ్రోచెడివాడును,నేవిధాన
    గొలువ తీర్చునా హరి యట్లె కోర్కెలు సత
    తమ్ము గొలిచిన యెడ స్వాంతమ్ము లలరు.

    2.సమస్య .నం 739
    ఎన్ని పూజలు యాత్రలు నేపుమీర,
    ఎంత తపము జేసినగాని యేమి ఫలము ?
    ఐహిక సుఖ భోగాదుల యందు మోహ
    జాలమే యవరోధమ్ము సాధకులకు.
    శంకరయ్యగారూ,పుట్టపర్తి సాయి బాబా హాస్పటల్లో అన్ని స్పెషాలిటీలు,సౌకర్యాలు,నిపుణులు ఉన్నారు.అక్కడ వైద్యం కూడా అందరికీ ఉచితం గా చేస్తారు .మీ వ్యాధికి అక్కడికి వెళ్ళితే మంచిదని నా సలహా.(మీకు medical insurance or reimbursement లేవు కాబట్టి)

    రిప్లయితొలగించండి
  10. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
    మీ భావము బాగున్నది. 2వ పాదములో కొన్ని మార్పులు చేస్తే అన్వయము బాగుంటుంది. ఇలా మారుద్దాము:
    "జ్ఞాపకంబులు మదిలోన కదలుచుండ"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ చంద్రమౌళి గారు:
    మీ మొదటి పద్యములో గణభంగము, యతిలేక పోవుట ఉన్నవి. దానిని మరల సవరించి వ్రాయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పూరణ....

    “ఈమె నాభార్య, నాసుతుం డితఁడు, నితఁడు
    నాదు మిత్రుండు, బంధువుల్ నాకు వీర”
    లనుచు నిహలోకమనఁ జిక్కునట్టి మోహ
    జాలమే యవరోధమ్ము సాధకులకు.

    రిప్లయితొలగించండి
  13. పండితులకు ధన్యవాదములు. ఇప్పుడు సరేనా..

    రాగ దోషంబులోబుట్టు – ’నాది’, ’నేను’
    ద్వేష భావమెతోడైన ’తేడ ’,’వేరు’
    తగుల రాగద్వేషాలన్న తంత్ర మింద్ర
    జాల మేయవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    కామాది వైరిజాలాన్ని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మిత్రుల పూరణల గుణదోషాలను పరామర్శిస్తూ వారికి తగు సలహాలనిస్తున్నందుకు ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ఐహిక మోహజాలన్ని గురించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బంధు మిత్రాది మోహజాలాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘అంతర్జాలం’ విషయంగా మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    కవిత్వ సాధకులకు పరిమితి పదజాలమెలా బాధకమౌతుందో వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    సవరించిన తర్వాత కూడా ఆ పద్యంలో మొదటిపాదంలో యతిదోషం, ‘రాగద్వేషాలన్న’ అన్నప్పుడు గణదోషం.
    *
    కమనీయం గారూ,
    రెండు సమస్యలపై మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    పుట్టపర్తి వైద్యశాల గురించి సలహా యిచ్చి నా కెంతో మేలు చేసారు. నేనిప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాను. ధన్యవాదాలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బంధుమిత్రాది మోహజాలాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. నాది నాదను బాధలు నరుల కెపుడు
    ఐహిక ములందు తమకమ్ము నైక్య మగుచు
    మదిని మరలించ లేనట్టి మత్తు విడక
    జాలమే యవరోధమ్ము సాధ కులకు !

    రిప్లయితొలగించండి
  16. నిజమే తమ్ముడూ ! పుట పర్తిలో వైద్యానికి ఐదు పైసలు తీసుకోరు. బయట ఉండేవారికి అంటె [ మనకోసం మనతో వచ్చిన మనవారికే ] కర్చు అవుతుంది. అదే వారు ఉండ డానికీ , భోజనాలకీ . పైగా " బాబా సన్నిధిలో కదా " అనే ధైర్యం మనకి బాగా ఉంటుంది. అందు వలన అక్కడే మంచిది . త్వరగా కోలుకోవాలని ఆశీర్వదిస్తూ అక్క

    రిప్లయితొలగించండి
  17. ఆత్మజ్ఞానమంతర్ముఖయాణమిచ్చు
    నిత్యధ్యానసాధనమున్ననేర్పుఁదెలియు
    భువినిపంచేంద్రియాసక్తభోగ,మోహ
    జాలమేయవరోధమ్ముసాధకులకు

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ నిర్దోషంగా చాలా బాగుంది. అభినందనలు.
    పుట్టపర్తికి ముందుగా అప్పాయింటుమెంటు తీసుకొని వెళ్తే బాగుంటుందని వాళ్ళ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకున్నాను. ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకోవచ్చునట! ఇప్పటి వరకు నేను చేయించుకున్న పరీక్షల రిపోర్టులు స్కానింగ్ చేసి పంపవలసి ఉంటుందట! ఆ ప్రయత్నంలో ఉన్నాను. ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    అద్భుతమైన భావాన్ని వెలిబుచ్చారు. అభినందనలు.
    కాని ‘ఆత్మజ్ఞాన, నిత్యధ్యాన’ అన్నప్పుడు ‘త్మ, త్య’లు గురువులై గణదోష ఏర్పడుతున్నది. సవరించండి.

    రిప్లయితొలగించండి
  19. శ్రిగురుభ్యోనమః
    ఆర్యా,
    ధన్యవాదములు. తమరిసూచన మేరకు సవరణ:

    ఆత్మ దెలియు నంతర్ముఖ యాణ మందు
    నిత్య తద్ధ్యాన సాధన నేర్పు నిచ్చు
    భువిని పంచేంద్రి యాసక్త భోగ, మోహ
    జాలమే యవరోధమ్ము సాధకులకు

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    ఇప్పుడు మీ పూరణ నిర్దోషంగా, అద్భుతంగా ఉంది. అభినందనలు.
    నా సూచన మన్నించి సవరణలు చేసినందుకు సంతోషం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి