9, జూన్ 2012, శనివారం

సమస్యాపూరణం - 730 (కాకినిఁ జంపి కౌరవులు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.


ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. లోకము నింద వేసినను లోపము లేదని దుష్ట బుద్ధితో
  మేకను బట్టి కౄరముగ మేసెడు నక్కల గుంపు కైవడిన్
  మైకము క్రమ్మ గొట్టి రభిమన్యుని వ్యూహమునందు చూడ నే
  కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.

  రిప్లయితొలగించండి
 2. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము చాల బాగున్నది. కౄరము అనే ప్రయోగమును సరి దిద్దుకొనండి "క్రూరము" అని. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు..పొరపాటుని సవరించుచున్నాను...

  లోకము నింద వేసినను లోపము లేదని దుష్ట బుద్ధితో
  మేకను బట్టి క్రూరముగ మేసెడు నక్కల గుంపు కైవడిన్
  మైకము క్రమ్మ గొట్టి రభిమన్యుని వ్యూహమునందు చూడ నే
  కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.

  రిప్లయితొలగించండి
 4. భీకరమైనయుద్ధమున భీతిలజెందిరి కౌరవాదులున్
  ఆ కురుసేనలంతమయెనాయభిమన్యుపరాక్రమాగ్నిచే
  నేకముగాజెలంగిరియనేకులునొక్కని చుట్టుముట్టిరే
  కాకిని జంపికౌరవులు గర్జన జేసిరి సంతసమ్మునన్.

  రిప్లయితొలగించండి
 5. హనుమఛ్ఛాస్త్రి గారూ!
  మీ పద్యము చాల బాగున్నది

  నాకు నిరాశ గల్గె, వినినంతనె భారత యుద్ధసీమలో,
  నాకము నేలు యింద్రునికి నచ్చిన పౌత్రుని, నుత్తరాపతిన్
  లోకులు ఛీత్కరించు విధి లుప్తముఁ జేయగ నెంచి, నాఁడు నే
  కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.

  రిప్లయితొలగించండి
 6. మూకలకొద్దిసైన్యమునబోలెడువీరులునిండియుండగన్
  రాక జయంబునెట్లుఁజను రాజ్యమువీరులభోజ్యమంచుపెన్
  గేకలుపిక్కటిల్లగనె,గెల్చెడునూహలు'కావు' 'కావ'నన్
  గాకినిఁజంపికౌరవులుగర్జనసేసిరిసంతసమ్ముగన్!

  రిప్లయితొలగించండి
 7. శ్రీపతిశాస్త్రిశనివారం, జూన్ 09, 2012 10:22:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  భీకరమైన పోరు గని భీతిని పొంది సుయోధనుండు చీ
  కాకున బిక్కుబిక్కనుచు కర్ణుని గాంచుచు గోరె కూల్చగా
  చీకటివేళ భీమసుతు జీల్చిరి కర్ణ సుయోధనాదు, లే
  కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్

  రిప్లయితొలగించండి
 8. గురువుగారికి , నేమాని వారికి నమస్కారములతో
  --------
  కేకలు వేయు కౌరవులు, కీర్తిని బొందిన పాండుపుత్రులన్
  భీకర యుద్దమందుగని భీతిని బొందిరి, భీమ పేరునన్
  కాకిని జంపి కౌరవులు గర్జన జేసిరి సంతసమ్మునన్
  మైకము నందునన్ మునిగి,మాగుడు కాలము ముందునిల్వగన్

  రిప్లయితొలగించండి
 9. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  ఆ కురుభూమియందు ఘనుఁ డర్జునపుత్త్రుఁడు ద్రోణముఖ్య నూ
  త్నైక విచిత్ర పద్మరచనమ్మును భేదనఁ జేసి పోరఁగాఁ
  గాకలుదీరు వీరతనుఁ గష్టముతోడుత యుక్తిఁ బన్ని, యే
  కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసంబునన్.

  రిప్లయితొలగించండి
 10. ఓ కురునాథ! ఒక్కవడి కూల్చగ జాలితివేని అల్లదే
  కాకిని నీవె యుద్ధమున క్రన్నన గెల్చెదు పాండుసూనులన్
  చేకొను మీ శరమ్మనిన శీఘ్రమె వేసె సుయోధనాఖ్యుడా
  కాకిని జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్

  రిప్లయితొలగించండి
 11. శ్రీ సరస్వత్యై నమః :
  మిత్రులారా! మన హితైషి శ్రీ శంకరయ్య గారు తీవ్రమైన జ్వరముతో బాధపడు చున్నారు. వారికి తొందరగా స్వస్థత చేకూరాలి అని అందరము ఆకాంక్షించుదాము.
  ఈ నాటి సమస్యకు పూరణలు వైవిధ్యముగా వచ్చే అవకాశము లేదు. కౌరవులు అభిమన్యుని, ఘటోత్కచుని ఏకాకులగా చేసి చంపినట్లుగనే ఎక్కువ పూరణలు వచ్చినవి. పూరించిన వారందరికి శుభాభినందనలు.

  1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పూరణ - తొలుతగా అభిమన్యుని వధ గూర్చి చాలా ఉత్తమమైన శైలిలో నున్నది.
  2. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి పూరణ కూడా మంచి ధారతో ప్రశంసనీయముగా నున్నది.
  3. శ్రీమతి లక్ష్మీ దేవి గారు చాలా బాగుగా వ్రాసేరు - ఉత్తమముగా నున్నది.
  4. శ్రీ సహదేవుడు గారి పూరణ చాలా బాగున్నది. కౌరవులకున్న అధికమైన సేనతో గెలుస్తారనే ఊహలు నిజము కావు కావు అని అరచిన ఒక కాకిని వారు చంపినట్లు అర్థమగుచున్నది. భావ వైవిధ్యము - చాల బాగున్నది.
  5. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు ఘటోత్కచ వధను వర్ణించేరు . ప్రశంసనీయముగా నున్నది.
  6. శ్రీ వర ప్రసాద్ గారు వినోదకరమైన రీతిలో ఒక పూరణ చేసేరు - గెలుపు రాదు అనే భయముతోనున్న కౌరవులు "భీముడు" అనే పేరుపెట్టి ఒక కాకిని చంపినట్లు. ఉత్తమముగా నున్నది.
  7. శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యము చాల బాగున్నది - భావము ఎంతో బాగున్నది - చక్కని పూరణ.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని వారికి, మందాకిని గారికి ధన్యవాదములు.
  శ్రీ శంకరార్యులకు త్వరగా స్వస్థత చేకురాలని ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 13. కోకిల వోలి కూయుచును గొప్పగు మోడిని దుయ్యబట్టుచున్
  కాకిని బోలి కూలగను కమ్మని కంఠము మూతబెట్టుచున్
  శోకము నందు క్రుంకులిడు శూరుని కోర్టుకు లాగిరే యథా:
  కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్

  రిప్లయితొలగించండి