24, జూన్ 2012, ఆదివారం

శ్రీహనుమద్వైభవము


శ్రీహనుమద్వైభవము

శ్రీమదంజనా హృదబ్ధి శీతలాంశు శోభితా!
రామభక్త శేఖరా! విరాజమాన విక్రమా!
ధీమతాం వరేణ్య! మాన్య! ధీవికాసకారకా!
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


హేమశైల సన్నిభా! మహేశ్వరాంశ సంభవా!
కామరూప! రాక్షసాంతకా! మహాబలాన్వితా!
క్షేమదాయకా! కపీశ! చిన్మయా! బలప్రదా!
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


భీమరూప! సర్వవైరి వీరలోక భీకరా!
భూమిజాప్రశస్త వాగ్విభూషణా! యశోధనా!
శ్రీమదంబుజాత మిత్ర శిష్య! వేదవిత్తమా!
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


హేమభూధరాభ ధీర! హీరగాత్రవైభవా!
రామచంద్ర కార్యతత్పరా! సుమిత్రజాస్తుతా!
కామితార్థదా! దశాస్య గర్వ సర్వనాశకా!
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


కామితాఖిలార్థదాయకా! సమాదరాన నీ
నామ మంత్ర ముచ్చరింప నాశమౌ భయమ్ము సం
గ్రామ భీమ! వీరవర్య! రాక్షస ప్రణాశకా!
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


నీ మహత్వమున్ దలంచి నెమ్మనమ్మునందు నీ
నామమున్ జపించినంత నాశమౌను రోగముల్
లేములెల్ల చెల్లు నీదు లీలలన్ పఠించుచో
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


నీ మహత్వ మద్భుతమ్ము నిన్ స్తుతించినంత జే
రామ! యంచు వేగ సాగరమ్ము నే తరించి తీ
వో మహాత్మ! చెల్లు జాడ్య మొప్పుగా మదాత్మలో
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా!


మోమునందు వేద శాస్త్రముల్ సమస్త మొప్పు ను
ద్దామవైభవా! వచోనిధాన! వాక్పటుత్వమున్
మా మనమ్ములందు నింపుమా యటంచు వేడుదున్
స్వామి భక్తచందనా! ప్రసన్న! వాయునందనా! 

రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

2 కామెంట్‌లు:

  1. ఆర్యా!
    నమస్కారములు.

    హనుమద్వైభవమును మీ
    రనుపమగతి బల్కినార, లానందముగా
    ప్రణతిశతం బొనరింతును
    ఘనచరితా! పండితార్య! గైకొనుడు కృపన్.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు.
    వైభవో పేతమైన " హనుమంతుని వైభవమును " కన్నుల విందొన రించు చిత్ర పటమును మా కందించిన శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు.

    రిప్లయితొలగించండి