12, జూన్ 2012, మంగళవారం

చమత్కార (చాటు) పద్యాలు - 202

అల్లసాని వారి చాటుధార

          ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు బంగారుపళ్ళెంలో కవిగండపెండేరం తెప్పించి సభామంటపంలో పెట్టించి “సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగల్గిన వారే దానిని పొందడానికి అర్హులు” అని చెప్పినారట! సభలోని కవు లందరూ మిన్నకున్నారు. అప్పుడు రాయలు ఇలా అన్నారట...

ముద్దుగ గండ పెండియరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా
నొద్దిక నా కొసంగు మని యొక్కరుఁ గోరఁగలేరు, లేరొకో....

          వెంటనే అల్లసాని పెద్దన లేచి....
పెద్దన బోలు పండితులు పథ్విని లేరని నీ వెఱుంగవే
పెద్దన కీఁదలంచినను బేరిమి నా కిడు కృష్ణరాణ్ణృపా!

          అని పూరించి క్రింది ఉత్పలమాలికను చెప్పాడు....


పూఁత మెఱుంగులుం బసరుపూఁపబెడంగులుఁ జూపునట్టివా
కైతలు? జగ్గు నిగ్గు, నెనగావలెఁ గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని
ద్దాతరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోని పల్లటీ
కూఁత లనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టి జూచినన్
డాతొడ నున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవి గావలెఁ బంట నూదినన్
గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మే తెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ పొం
బూఁతల నున్న కాయసరి పోడిమి కిన్నెరమెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడగౌళవంతుకా
సాతతతానతానల పసన్ దివుటాడెడు గోటమీటు బల్
మ్రోఁతలునుం బలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
రీతిగ, సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా
శీతనగాత్మజా గిరిశశేఖర శీతమయూఖ రేఖికా
పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం
గాతతతేహిత త్తహితహాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
నూతన ఘల్ఘలాచరణనూపురఝూళఝుళీమరందసం
ఘాతవియద్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లనఁ జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్. 


          రాయలు సంతోషించి కవిగండ పెండేరాన్ని తానే స్వయంగా పెద్దన పాదానికి తొడిగి సత్కరించాడట!

(వాసిరెడ్డి కిరణ్ కుమార్ గారి కోరికపై ప్రకటింపబడింది)

- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి.

16 కామెంట్‌లు:

 1. పూతమెరుంగు దివ్య మణిభూషణమేయగు నాంధ్ర సాహితిన్
  ఖ్యాతచరిత్రుడై యలరినట్టి కవీశుడు పెద్దనార్యుడా
  కైతను వెల్వరించెను ముఖంబను నభ్రమునుండి స్వర్ణదీ
  పాతమువోలె నాశుగతి పండిత మండలి ప్రస్తుతింపగా
  చేతమచింత్య సంభ్రమ విశేషముతో నలరారుచుండ సం
  ప్రీతిగ కృష్ణరాయలు భళీ యని యాకవి నాదరించె బల్
  మ్రోతల జే నినాదములు ముచ్చట గూర్పగ సత్కరించె నా
  హా! తన చేతితో దొడిగి యాతని కాలికి పెండరమ్మునే

  రిప్లయితొలగించండి
 2. ఆతడు పెద్దనార్యు డతడాంధ్రకవిత్వ పితామహుండునై
  శ్రోతలు, పాఠకుల్, కవులు సుందరమంచు వచించునట్లుగా
  కైతలు సంస్కృతాంధ్రముల కమ్మగఁ జెప్పి కవీంద్రకోటికిన్
  రీతులు నేర్పె నా కవిధురీణుడు చూడగ రాయభూపతీ
  చేతము హర్షదీప్తముగఁ జేయ సుశబ్దసుమాల మాలతో
  నాతడు గండపెండెరము నన్నిట పెద్దవటంచు భక్తితో
  జోతలు చేసి పాదమున సుస్మితుడై తొడిగెన్, మహాత్ముడా
  తాతకు వందనంబులివె ధన్యుడు సార్థక నామధేయుడున్.

  రిప్లయితొలగించండి
 3. అయ్యా శ్రీ హరి....మూర్తి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము చాలా బాగుగా నున్నది. అక్కడక్కడ కొన్ని సవరణలను సూచించుచున్నాను.

  (1) 1వ పాదములో "ఆతడు" అని ప్రారంభించి మళ్ళీ "అతడు" అని వాడేరు - అతడు అనే పదము మారిస్తే బాగుంటుంది.
  (2) కవిధురీణుడు కి బదులుగా కవివరేణ్యుడు అనండి.
  (3) రాయభూపతీ కి బదులుగా "కృష్ణదేవ రాట్" అని మారిస్తే బాగుంటుంది.
  (4) 6వ పాదము ప్రారంభములో ఆతడు అనే పదమునకు బదులుగా మరొక పదము వేసి అన్వయము సరిపోయేలా చూడండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. ఆర్యా!
  నమస్కారములు.
  మీ పద్యాలను చూసిన తర్వాత ఉత్సాహంతో వ్రాశాను. వాత్సల్యంతో నిండిన చక్కని సూచనలకు, సవరణలకు ధన్యవాదశతములు. మీసూచనల ప్రకారం క్రింది విధంగా సవరించి వ్రాస్తున్నాను.

  ఆతడు పెద్దనార్యు డిక నాంధ్రకవిత్వ పితామహుండునై
  శ్రోతలు, పాఠకుల్, కవులు సుందరమంచు వచించునట్లుగా
  కైతలు సంస్కృతాంధ్రముల కమ్మగఁ జెప్పి కవీంద్రకోటికిన్
  రీతులు నేర్పె నాకవివరేణ్యుడు చూడగ కృష్ణదేవరా
  ట్చేతము హర్షదీప్తముగఁ జేయ సుశబ్దసుమాల మాలతోఁ
  బ్రీతిగ గండపెండెరము పెద్దవటంచు నృపాలు డంతటన్
  జోతలు చేసి పాదమున సుస్మితుడై తొడిగెన్, మహాత్ముడా
  తాతకు వందనంబులివె ధన్యుడు సార్థకనామధేయుడున్.
  నమస్కారములు,
  విధేయుడు,
  మూర్తి.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ సరస్వత్ర్యై నమః :
  మిత్రులారా!
  ఈనాటి ఈ ప్రత్యేక పద్య మాలికను అందించిన గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి నమస్సులు. దానికి స్పందిస్తూ నేను ఒక చిన్న మాలికను వ్రాసేను. శ్రీ హ.వి.స.నా.మూర్తి గారు కూడా బాగుగా స్పందించి వారి ఉత్సాహాన్ని కూడా ప్రకటించేరు. మొత్తానికి మంచి పద్య మాలికలు వచ్చేయి. శ్రీ మూర్తి గారికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. వాసిరెడ్డి కిరణ్ కుమార్మంగళవారం, జూన్ 12, 2012 11:02:00 PM

  నా అబ్యర్దనను మన్నించి నా కొరకు మరియు మీ బ్లాగ్ సందర్సికులకు కొరకు ఈ పద్యం ఇచ్చినందులకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అండి

  రిప్లయితొలగించండి
 7. ఘంటా శివ రాజేశ్ గారూ,
  బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. పూతమెరంగులు పద్యానికి అర్ధం వివరించగలరు పెద్దలు.

  రిప్లయితొలగించండి
 9. ఆచార్యా ప్రతిపదార్థం కూడా పంపితే పద్యం మాకు బాగా అర్థమవుతుందని మా విన్నపము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రతిపదార్థాలు ఇవ్వాలని నాకూ ఉంది. అందుకోసం కొంత సమయం కావాలి. పనుల ఒత్తిడి వల్ల ఇప్పట్లో వీలు కాదు. మన్నించండి.

   తొలగించండి
 10. ఈ పద్యమును అందించినందుకు శ్రీయుతులు కంది శంకరయ్య గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 11. పూతమెరుంగులు పదానికి అర్థము కోరుతున్నాను.

  రిప్లయితొలగించండి