6, జూన్ 2012, బుధవారం

విశేష వృత్తము - 24 (పృథ్వి)

మిత్రులారా!
          మీ అందరి ఉత్సాహముతో ప్రతి దినము ఒక విశేష వృత్తము గురించి ముచ్చటించు కొనుట జరుగు చున్నది. ఇప్పటికే అనేక వృత్తములను గురించి ప్రస్తావించుట జరిగినది.  చిన్న చిన్న పాదములతో ఉండే వృత్తములనే ఇంతవరకు చెప్పుకొనినాము.  ఇకపై కొంచెము పెద్ద వృత్తములు కాబట్టి వారమునకు ఒక సారి చెప్పుకొనినచో చాలును అని నా భావము.  అందుచేత ఈరోజు పృథ్వీ వృత్తము గురించి చెప్పుకొనిన తరువాత ఈ శీర్షిక పునర్దర్శనము మళ్ళీ వారమే.

ఈనాటి విశేష వృత్తము - పృథ్వి.
లక్షణము -
గణములు - జ స జ స య వ 
యతి - 9వ అక్షరము అని కొందరు / 12వ అక్షరము అని కొందరు చెప్పిరి 
ప్రాస నియమము కలదు.

ఉదా:-
సరోరుహ వరాననా! నిగమ శాస్త్ర సద్వందితా!
సురప్రముఖ సంస్తుతా! వరద! చూడుమా నన్ గృపన్
మొరన్ వినుము దుర్భరంబగుట మూర్ఖ దుష్కృత్యముల్
బిరాన నను బ్రోవవే యనుచు పృథ్వి ప్రార్థింపగా 

మీరూ ప్రయత్నించండి.  స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3 కామెంట్‌లు:

  1. విశేష స్పందన కొరవడిన సందర్భంలో వారమునకు ఒక్క సారి మాత్రమే సమస్య ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. కొంచెము ఖేదకరమైన వార్త.

    నమో గణపతీ! విశుద్ధమగు నా మనమ్మున్ సదా
    సుమమ్ముగను నేనొసంగ నది శోభిలున్ సర్వదా
    క్షమించమని సాగిలంబడెద సందియమ్మెందుకే?
    యుమాసుతుడవీవు, నమ్మకమునుంచి నన్నేలవే!

    రిప్లయితొలగించండి
  2. ధరాధర సుతా ! శివా! లలిత! దైత్య వినాశనీ !
    పురారితనుతాపహారిణి ! విమోహ వినాశనీ !
    పరాకు తగునా మొరల్వినగ పాప వినాశనీ !
    మరేది గతి నిన్వినా కనవె మాలిమి నేలవే !

    రిప్లయితొలగించండి
  3. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి