24, జూన్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 745 (కడు దరిద్రుఁడు రాజ)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కడు దరిద్రుఁడు రాజయోగమ్ము నందె.

ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

 1. అక్షర జ్ఞానమించుకయైన లేని
  వాడు మును భార్య బోధింప భగవతి కృప
  గాంచి యయ్యె మహాకవి కాళిదాసు
  కడు దరిద్రుడు రాజయోగమ్ము నొందె

  రిప్లయితొలగించండి
 2. జగతిఁ బ్రత్యక్షదైవంబు లగుచు నొప్పు
  జన్మదాతల కత్యంత శ్రద్ధతోడ
  సేవఁ జేయుచు నంకితభావమునను
  కడు దరిద్రుడు రాజయోగమ్మునందె.

  రిప్లయితొలగించండి
 3. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  అల కుచేలుండు లేమిలో నలమటించి,
  స్వాభిమానాన సఖునితోఁ బలుకకున్నఁ
  బృథుకములఁ దిని కృష్ణుండు పెన్నిధి నిడఁ
  గడు దరిద్రుఁడు రాజయోగమ్ము నందె.

  రిప్లయితొలగించండి
 4. విధియె వక్రింప నలుడయ్యె పేదవాడు,
  కడు దరిద్రుడు; రాజయోగమ్ము నందె
  కడకు నొకనాడు, సుఖమును, కష్టములును
  తప్పునె నరజన్మ నెత్తగ ధరణి పైన.

  కృష్ణ సఖుడౌ కుచేలుండు కృపను వేడి
  చేరి, కొలది యటుకులను చెలునికిచ్చె,
  నచ్చెరువు నొందు రీతిగ నప్పుడతడు,
  కడు దరిద్రుడు రాజయోగమ్మునందె.

  రిప్లయితొలగించండి
 5. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములు రెండునూ బాగుగనే యున్నవి. 1వ పద్యము 4వ పాదమును ఒక మారు చూడండి:
  "తప్పునె నరజన్మ నెత్తగ ధరణి పైని"
  మొదటి గణములో ఒక అక్షరము ఎక్కువగా నున్నది. కాస్త సవరించండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. భార్య పంపున కృష్ణుని వా డ కేగి
  యల కుచేలుండు దర్శించె నబ్జ భవుని
  బాల్య మిత్రుల బంధంబు వలన సుమ్ము
  క డు దరిద్రుడు రాజ యోగమ్ము నందె

  రిప్లయితొలగించండి
 7. విద్య కొలవుల నందించు వేల వేలు
  కొలువు లిచ్చెడు వాడిగ( గూడ (జేయు
  మైక్రొ సాఫ్టు బిల్ గేట్స ట్లు విక్రమించి
  కడు దరిద్రు(డు రాజయోగమ్ము నందె

  రిప్లయితొలగించండి
 8. సవరించిన పూరణ.

  విధియె వక్రింప నలుడయ్యె పేదవాడు,
  కడు దరిద్రుడు; రాజయోగమ్ము నందె
  కడకు నొకనాడు, తప్పునె కర్మల ఫలి
  తమ్ము, నరజన్మ నెత్తగ ధరణి పైని?

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాభినందనలు. మీ పద్యములో భావము వినూత్నముగా నున్నది. 3వ పాదములో యతి వేయలేదు. సరిజేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. విష్ణు విట్లని యోదార్చె వేల్పు రాజ్ఞి!
  విను శచీసతి! నహుషుడు చెనటి పాపి
  కడు దరిద్రుఁడు రాజయోగమ్ము నందె
  వాని పతనమగత్యము వలదు చింత.

  (శచీ దేవిని వేల్పు రాజ్ఞి అనవచ్చునా అన్న సందేహం పీడిస్తోంది)

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!శుభాశీస్సులు.
  మీ పద్యములో మీరు వేసిన ప్రాసయతిని నేను చూడలేదు. మీ పద్యము బాగుగనే యున్నది. నేనే తొందరపడితిని. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. 1.
  ఎన్నియో నిదర్శనముల నెంచి చూడ
  దీక్ష,వ్యాపార దక్షత ,దీర్ఘదృష్టి
  పేదయైనను కలిమిని పెంపుజేసి ,
  కడు దరిద్రుడు రాజయోగమ్ము నందె.
  2.
  కుటిలరాజకీయుల చెంత గొలువు జేరి
  వారి యండ దుష్కర్మల ,వంచనమ్ము
  తోడ ప్రజల ధనమ్మును దోచుకొనుచు
  కడు దరిద్రుడు రాజ యోగమ్ము నందె.

  పై రెండు విధాలా ధనవంతులైన వారున్నారు కదా !

  రిప్లయితొలగించండి
 13. తపము లొనరించి మెప్పించి దళితు డైన
  రామ చరితము రచియించె లాఘవ మున
  వరము లీయగ దైవము కొరత యేల ?
  కడు దరిద్రుఁడైన రాజ యోగమ్ము నందె !

  రిప్లయితొలగించండి
 14. ప్రజల పాలన యందున ప్రజల బాగు
  కొరకు పోరెడు వారికి కోరి ప్రజలు
  పదవి నిత్తురు జూడగ భరత భువిని
  కడు దరిద్రుడు రాజ యోగమ్మునందె.

  రిప్లయితొలగించండి
 15. విడువక తనదు పంతము జడుని పగిది
  అలయుచు నతిగా నొక కొడుకాయెను దొర
  కడు దరిద్రుఁడు; రాజయోగమ్ము నందె
  మరియొక కొడుకు పెద్దల మాటవినుచు
  వారల మరి కనిపెంచిన వారలొకటె
  చోద్యము కనరా కంజుని సూక్ష్మ సృజన!

  రిప్లయితొలగించండి
 16. కవితోత్సాహంతో, వైవిధ్యంగా, ఒకరిని మించి మరొకరుగా అద్భుతమైన పూరణలు చేసిన కవిమిత్రులు
  పండిత నేమాని వారికి,
  సత్యనారాయణ మూర్తి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  మిస్సన్న గారికి,
  కమనీయం గారికి,
  నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
  ................ అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  ‘అబ్జభవుడు’ అంటే బ్రహ్మ కదా! అక్కడ ‘యాదవేంద్రు’ అందాం.
  *
  సహదేవుడు గారూ,
  మీరు తెలుగు టైపు చేయడానికి ఏ లిపికను వాడుతున్నారు? అర్ధానుస్వారం (ఁ)) సరిగా టైపు చేయలేకపోతున్నారు. మీరు ఏది ఉపయోగిస్తున్నారో తెలిపితే అందులో అరసున్నా ఎలా టైపు చేయాలో వివరిస్తాను.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణలో ఐదవ పాదంలో గణదోషం ఉంది. ‘వారలను కని పెంచిన...’ అంటే సరి!

  రిప్లయితొలగించండి