8, జూన్ 2012, శుక్రవారం

చమత్కర పద్యాలు - 201

సంయుక్తాక్షర కందము  
త్యత్‌క్ష్మాభృద్ద్విట్స్తోత్రా
త్మ్యత్‌క్ష్మాభృద్ద్విడ్జహృత్క! ద్యౌత్రాస్థాన్యో
ద్యత్‌క్ష్మాశ్రీస్ఫూర్జన్నే
త్రోత్‌క్ష్మేన్ద్రాభ్యర్చ్యకృత్య! ద్యుమ్నస్తుత్యా!

ప్రతిపదార్థములు -

త్యత్ = ప్రసిద్ధిని పొందుచున్న, 
క్ష్మాభృత్ = పర్వతములకు
ద్విట్ = శత్రువైన ఇంద్రునియొక్క
స్తోత్రా = పొగడిక గలవాఁడా! 
(ఉపేంద్రుఁడ వయ్యు ప్రసిద్ధమైన ఇంద్రసూక్తముచే దేవేంద్రుని స్తోత్రముల నందుచున్న దేవా!)
ఆత్మ్యత్ = ఆత్మసాత్కృతుఁ డగుచున్న,  
క్ష్మాభృత్+ద్విట్+జ = దేవేంద్రుని వరప్రసాదమున జన్మించిన అర్జునుని, హృత్క = డెందమున నిలిచిన స్వామీ!
ద్యౌత్ర = జ్యోతిర్ద్రవ్యములకు
ఆస్థానీ = కొలువైన ప్రభూ
అ = శ్రీ వాసుదేవా!
ఉద్యత్ = వెలుఁగొందుచున్న,  
క్ష్మా = భూదేవియొక్క
శ్రీ = శ్రీదేవియొక్క ఉనికిచేత
స్ఫూర్జత్ = ప్రకాశమానములైన
నేత్రా = కన్నుల కాంతులు గలవాఁడా!
ఉత్ = మహనీయులైన (లేదా) మోక్షార్థులైన
క్ష్మా+ఇన్ద్ర = పృథు ప్రియవ్రత ప్రహ్లాద గయాది రాజేంద్రులచే
అభ్యర్చ్య = పూజింపఁదగిన
కృత్య = అవతారకార్యములు గలవాఁడా!
ద్యుమ్న = సమగ్రైశ్వర్య వీర్య యశః శ్రీ జ్ఞాన వైరాగ్య సృష్టిస్థితిసంహారాది మహాశక్తిసంపన్నతచే
స్తుత్యా = స్తోత్రపాత్రుఁడ వైన స్వామీ!  

ఏల్చూరి మురళీధర రావు
   

23 కామెంట్‌లు:

 1. ఈ సంయుక్తాక్షర పద్యం సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. ఈ కాలంలోనూ ఇంతటి ప్రతిభామూర్తులు ఉన్నారా? రచించిన ఏల్చూరి వారికి, ప్రకటించిన మీకూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. సంభ్రమాశ్చర్యాలలో ముంచిన ఈ పద్యం రచించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి ప్రణతులర్పించటం తప్ప ఇంకేమీ చేయలేని అల్పులం.
  ధన్యవాదాలు గురువుగారు,
  ఎందరో గొప్ప వారలను, వారల కృతులను నా వంటి అల్పులకు కూడా తెలిసేలా చేసేందుకు మీ బ్లాగ్ కేంద్రంగా మీరు చేస్తున్న సేవలకు మీకు ఋణపడి ఉంటాము గురువుగారు, ప్రణామములర్పిస్తూ
  లక్ష్మీదేవి.

  రిప్లయితొలగించండి
 3. చాలా అద్భుతంగా ఉంది.
  సర్వత్రాసంయుక్తాక్షరప్రయుక్తంగా సంస్కృతంలో కందం.
  అందులోనూ పరమదుష్కరమైన 'త్క్ష్మ' అనే ప్రాసాక్షరం!

  రిప్లయితొలగించండి
 4. Dear Muralidhara Rao Garu,
  I am just wonderstruck on reading your poem. Thank you for giving the 'pratipadardham'. Otherwise people like me can never understand such complex verses. Your 'Samasya puranam' using only 'Da' letter is also fantastic. I never could imagine that one single letter in literature can convey so many meanings. I hope you are preserving all your poems. They are worth publication. Considering myself as extremely fortunate to be your friend to deserve communication of your wonderful works and congratulating you on your unique genius,
  Santha Devi

  రిప్లయితొలగించండి
 5. తోట భరత్ గారికి, లక్ష్మీదేవి గారికి, శ్యామలరావు గారికి ధన్యవాదాలు.
  *
  ఉమాదేవి గారూ,
  ‘I am just wonderstruck on reading your poem.’అన్నారు. మీరే కాదు అందరమూ వారి ప్రతిభకు దిగ్భ్రమ చెందక తప్పదు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. మహాద్భుతం , ఏల్చూరి మురళీధరరావు గారి పాండిత్యానికి ప్రణామాలు. సంయుక్తాక్షర కందం అంటే ఏమిటి , కందంలో అన్ని అక్షరాలూ సంయుక్తాక్షరాలై ఉండవలెనా , మరలాగైతే హృ , భృ లాంటి అక్షరాలు సంయుక్తాక్షరాలు కాదు కదా , సందేహం తీర్చవలసిందిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 7. మురళీధరరావు గారూ!
  బాగు..బాగు..బాగు
  మీ కవనపు సొబగు
  అచ్చెరువే రేగు
  అద్భుతమీ బ్లాగు!!!
  - ముత్తేవి రవీంద్రనాథ్,
  డేటన్,న్యూజెర్సీ,యు.యస్.ఏ.నుంచి.

  రిప్లయితొలగించండి
 8. అమ్మా లక్ష్మీ దేవి గారూ , అది సర్వ గురు కందం కాదు కదా , సంయుక్తాక్షర కందం కదా

  రిప్లయితొలగించండి
 9. కందము సంయుక్తాక్షర
  సుందరమై సరసభావ శోభితమై యా
  నందదమై ఉన్నది యభి
  నందనలో కవివరేణ్య! జ్ఞాననిధానా!

  రిప్లయితొలగించండి
 10. పద్యం అద్భుతంగాఉన్నది.ఈ రోజుల్లో ఇలా వ్రాయగలిగే వారు చాలా అరుదు.అజ్ఞాతగారూ,హృ గృ సమ్యుక్తాక్షరాలు కావు. ఐనా మినహాయింపు ఇవ్వండి .ఏమంటారు?

  రిప్లయితొలగించండి
 11. నమస్కారములు.
  ఇం తచక్కని పద్యాలు ఉంటాయని ఊహా మాత్రంగా కుడా తెలియని నాబోటి వారికి చదవడమే కష్టం గా ఉంది. ఇక వ్రాయ గలగడం ! ఊహా తీతమే . అద్భుతం. " శంకరాభరణం " [ గురువు గారి బ్లాగులో ] ఎన్నో ఎన్నెన్నో తెలుసు కో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ధన్య వాదములు .

  రిప్లయితొలగించండి
 12. డాక్టర్ ఏల్చూరి మురళీధర రావు గారూ మీ ప్రతిభకు వందన సహస్రములు.

  రిప్లయితొలగించండి
 13. కారప్పూసల చుట్టలు
  కారముతో నోటిలోన కరకర మను నా
  కారము చూడగ కందము
  నోరూరగ చవులు బుట్టె నొడికారీ ! ఔ!

  రిప్లయితొలగించండి
 14. అజ్ఞాత గారూ,
  మీ సునిశిత పరిశీలనకు జోహార్లు!
  మీరు చెప్పింది వాస్తవమే. అయితే శ్రీ ఏల్చూరి వారు ఈ పద్యాన్ని పంపుతూ ‘ప్రసావన’గా కొంత వ్రాసారు. అది అవసరం లేదనుకొని నేను కేవలం పద్యాన్నీ, ప్రతిపదార్థాలను మాత్రమే ప్రకటించాను. మీ వ్యాఖ్య చూసిన తర్వాత ఆ ప్రస్తావన యొక్క ఆవశ్యకత తెలిసి వచ్చింది. అందువల్ల ఆ ప్రస్తావనలో ‘కొంతభాగాన్ని’ ఇప్పుడు ఇస్తున్నాను.....

  శ్రీ శంకరాభరణం బ్లాగుముఖంగా వర్ధమాన కవులకు, రచయితలకు -
  విశిష్య, నాకు - మీరు అందిస్తున్న అఖండమైన ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
  "చమత్కారపద్యములు" అన్న శీర్షికను చూశాక ఈ ఆలోచన వచ్చింది. ఇది సర్వసంయుక్తాక్షరకందం. బహుశః ఇటువంటి ప్రయోగం ఇంతకు మునుపు జరుగలేదనుకొంటాను. ఇందులో "హృ", "కృ" లు సంయుక్తాక్షరాలు కాకపోయినా, కంటికి అలా కనుపిస్తుండటం వల్ల, ఛందస్సులో లఘ్వావశ్యకత వల్ల వాటిని నివేశించటం జరిగింది.

  రిప్లయితొలగించండి
 15. అజ్ఞాత గారూ,
  సందేహనివృత్తి జరిగిందా? ఈ ప్రస్తావనను ముందే ప్రకటించక పోవడం అనే నా తప్పిదం వల్ల అపార్థాలకు తావిచ్చిన వాడినయ్యాను. అందరూ నన్ను మన్నించాలి!

  రిప్లయితొలగించండి
 16. రవీంద్రనాథ్ గారికి, పండిత నేమాని వారికి, ‘కమనీయం’ గారికి, నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి, మిస్సన్న గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి పక్షాన ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీపతిశాస్త్రిశనివారం, జూన్ 09, 2012 12:06:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  డాక్టర్ ఏల్చూరి మురళీధరరావుగారి పాండిత్యచంద్రికలో విరసిన కందమందార మకరంద మాధుర్యము అమోఘము,అత్యద్భుతము. వారి పాదారవిందములకు నా సాష్టంగనమస్కారములు. {ఈ పద్యమును చదవడానికే నాకు 20 నిమిషములు పట్టినది}

  రిప్లయితొలగించండి
 18. Samyukthaakshara kandam- poojya mitrulu sri elchuri muralidhara rao gaari rachana adbhutham gaa vundi.padya rachana- daani vivarana okadaanitho marokati prathibha lo potee paduthunnaaaayi. vaaariki- prachurinchina meeku shata koti vandanaalu. saadhaaranamgaa- 'kanda' koora nu jeerninchukovadam kasthamani antoo vuntaaru..mari eee kanda(m) koodaa anthe--vivarana ganuka icchi vundaka pothe daanini jeerninchukovadam nijam gaa kashtame!

  రిప్లయితొలగించండి
 19. మిత్రులారా!
  సంయుక్తాక్షర కందము:
  డా. ఏల్చూరి వారి ప్రయోగము అనుపమానము. వారి కందములో అన్ని అక్షరములు సంయుక్తాక్షరములు కావు కదా అనే అనుమానము వచ్చిన వారి కొరకు ఈ వివరణ. కంద పద్యము యొక్క లక్షణములు ప్రకారము 6వ గణము జగణము కానీ నల కానీ అయి ఉండవలెను. అందుచేత ఆయా ప్రదేశములలో మాత్రము సంయుక్తము కాని అక్షరములను వాడుట జరిగినది. ఈ విషయమును శ్రీ శంకరయ్య గారు వివరించినప్పటికినీ, నేను మరికొంచెము సులభ శైలిలో వివరించుటకు ప్రయత్నించేను. అందరికీ ఈ విషయము అవగాహన అయినది అనుకొనుచున్నాను. డా. ఏల్చూరి వారు నాకు ప్రత్యేకముగా ఫోనులో తెలిపేరు. వారి కంప్యూటరులో లోపము వలన వారే స్వయముగా వ్రాయలేకపోయేరని నాతో చెప్పేరు.
  ఆలాగుననే సర్వ లఘు కందమును కూడా ఉదహరించ వచ్చును. సర్వ లఘు కందము అని చెప్పినా అందులో 2, 4 పాదముల చివరలో గురువు ఉండక తప్పదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. ఒత్తులు ఒత్తుగానున్న ఈ ఒత్తులపొత్తు ఏల్చూరివారి భాషౌన్నత్యాన్ని ఒత్తి ఒత్తి చెప్తోంది. ఈ అధ్భుత ప్రయోగానికి ఏల్చూరివారికి నా శతకోటి నమస్సుమాంజలులు శంకరాభరణంద్వారా తెలుపుకుంటున్నాను.
  భాగవత గణనాధ్యాయి.

  రిప్లయితొలగించండి
 21. I am Madhu Thota.

  Sir, for me your poem is very difficult to read and understand to comment upon. But I can feel, by reading the responses of other readers, that it must be wonderful. All I could understand is you are praising THE GOD, who is above all these praises.

  With thanks to Mr. M.L.N. Murthy for forwarding this poem.

  With good wishes
  Madhu Thota

  రిప్లయితొలగించండి