10, జూన్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 731 (వార్ధిలో మున్గె భానుఁడు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.

కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో...

ಅಬ್ಧಿಯೊಳು ಮುಳುಗಿದನು ಭಾಸ್ಕರನುರಿವಬಿಸಿಲಿನೊಳ.

19 కామెంట్‌లు:

  1. గ్రహణ సమయమ్ము నందున కనగ వచ్చు
    నిట్టి వింతైన పగటిని హేలగాను;
    నేఁడు గ్రహణము గనుకనే నిలువలేక
    వార్ధిలో మున్గె భానుడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారి పూరణ.....

    అతుల భీకర భారతాహవమునందు
    నర్జునుని కోలతోఁ గూలె నర్కపుత్రుఁ
    డట్టి దుస్థితిఁ గాంచుచు నమిత శోక
    వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  3. రామచంద్రుండు సద్ధర్మరక్షకుండు
    దుష్టు రావణు వధియించి దురితమడచు
    టంత వినువీధి వీక్షించి యపుడు మోద
    వార్థిలో మున్గె భానుడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  4. అమృతమందదు తమకని యచట రాహు
    వమరపంక్తిని చేరగ హరియది విని
    శిరము ఖండించుటను గాంచి కరము మోద
    వార్థిలో మున్గె భానుడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  5. సంధ్య వేళయ యగుటన చందు రుండు
    వార్ధిలో మున్గె, భానుడు పగటి వేళ
    నుష్ణ కిరణాల గరిమచే నుగ్రు డగుచు
    మండు చుండెను భగ భగ మంట లెగయ

    రిప్లయితొలగించండి
  6. అర్యముఁడు తీవ్ర కరముల నవని నేర్చ
    జీవ రాశులు నీడకుఁ జేరసాగె
    నీడ దొఱకని తన నీడ నీట నుఱక
    వార్ధిలో మున్గె భానుడు పగటి వేళ !

    రిప్లయితొలగించండి
  7. శ్రీఆదిశంకరాచార్యులవారు చిన్నవయసులోనెఅస్తమించుటను అన్వయిస్తూ:

    కారె శంకరులాధ్యాత్మికాకశాన
    సూర్యభగవానుఁబోలినశుద్ధవెలుగు
    కాంతులిటకావలసియున్నకన్నుమూయ
    వార్ధిలోమున్గెభానుడుపగటివేళ!

    రిప్లయితొలగించండి
  8. చి. తమ్ముడు డా. నరసింహమూర్తి పూరణ ప్రశంసనీయముగా నున్నది. శుభాశీస్సులు.

    రిప్లయితొలగించండి
  9. అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారికి నమస్సులు, ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారి పూరణ......

    తనదు వరపుత్రకుండును దానగుణుఁడు
    స్నేహశీలుండు, కర్ణుండు నాహవమున
    నర్జునుని చేత హతమొందినపుడు శోక
    వార్ధిలో ముంగె భానుఁడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  11. చిట్టి కుంతిని చేపట్టి పట్టినీయ
    పట్ట లేకను తా పెట్టి పెట్టె లోన
    వదల నీటను వదలక కదలి శోక
    వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  12. ప్రాగ్దిశన్గల నొక కొన్ని ప్రాంతములకు
    నయ్యెనంట సాయంకాల మందువలన
    పాటాలాంశు మహాప్రభా భాసురుండు
    వార్ధిలో మున్గె భానుండు పగటి వేళ

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    గ్రహణకాలాన్ని ఆలంబనగా చేసికొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    సమస్యను విరిచి చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, చమత్కార జనకంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ఆదిశంకరులను సూర్యునితో పోల్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ వృత్త్యనుప్రాసతో శోభిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. భానుసూరిపదంబుల భావమొకటె
    పట్టిజూడ కనగ కాలపథమున నొక
    భానుడిన్కొక సూరినిఁ బట్ట రుధిర
    వార్ధిలో ముంగె భానుఁడు పగటివేళ.

    రిప్లయితొలగించండి
  15. వేడి కిరణాల రవి గాంచి వేగ లేక
    కలువ కన్నెలు కోరగ చలువ మిన్న
    సిగ్గు బడుచును తాపము తగ్గ లేక
    మబ్బు తునకల మాటున మాయ మగుచు
    వార్ధిలో మున్గె భానుడు పగటి వేళ !

    చలువ మిన్న = చంద్రుడు

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా!ధన్యవాదములు.
    చంద్రశేఖర్ గారూ!భాను, సూరి లతో చక్కని పూ'రణం ' చేసి రుధిర వార్ధిలో ముంచారు.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీయుత కంది శంకరయ్య గారికి,
    శ్రీ గురుదేవులకు ప్రణామపురస్సరంగా -

    ఈనాటి సమస్యను కన్నడ "పద్యపాన" నుంచి గ్రహించటం ఔచితీభరితంగా ఉన్నది. ఎందుకంటే - అది కన్నడంలో పంప మహాకవి రచనకు రూపాంతరితమే కాబట్టి !

    "కం. పెఱ"యిగె మడుగి రథమం
    నెఱ"వన నెసగల్కె సుతశోకద పొం
    పుఱి"యోళ్ మియ్యఱియదె నీ
    రఱి"దంతె దోలిఱి"ద నపరజళధిగె దినపం.

    అని కన్నడ విక్రమార్జున విజయం (12-220).

    అంతే కాదు. తిక్కన గారు ఈ సన్నివేశంలో మూలాన్ని అతిక్రమించి, పంప కవిని అనువదించి, ఈ విధంగా వ్రాశారు:

    క. నిడుఁగేలున్ బలు తొడలు
    న్వెడద యురమునై రణావనిం గర్ణు నొడల్
    పడియున్నఁ గని విషాదం
    బడరి తొలఁగు మాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్.

    గీ. నిర్గతప్రాణు రాధేయు నిజకరములఁ
    గరుణ పెంపున నంటుట కారణముగఁ
    బావనస్నాన మొనరింపఁ బోవునట్టు
    లపరజలనిధిలోనికి నరిగెనినుఁడు."

    అని కర్ణపర్వం (3 - 368,369). కన్నడాంధ్ర పరిశోధకులు గుర్తింపవలసిన విశేషం కాబట్టి, ఉభయ భాషా తులనాత్మకపరిశీలన కావించే అబిమానులకు ఆసక్తికరంగా ఉంటుందని - వివరంగా వ్రాశాను.

    శ్రీ గురుదేవుల పూరణ ఈ మార్గానుగామియై అలరారటం ఎంతో సొగసుగా ఉన్నది!

    నా అనుసరణం:

    గీ. తన వరంబునఁ బుట్టిన తనయుఁ గర్ణుఁ
    బొలికలను నందుఁ గూలుటఁ బొలయఁ గాంచి,
    శోకమూర్తియై జగములఁ జూడలేక
    వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. ధన్యవాదాలు శ్రీ హనుమచ్ఛాస్త్రి గారూ!

    రిప్లయితొలగించండి
  19. చి. డా. ఏల్చూరి వారికి శుభాశీస్సులు. మీ ఉభయ భాషా వివరణ చాల బాగున్నది. నేను సద్యస్ఫూర్తితో చెప్పేను గాని, ఆ పురాణ జ్ఞానము నాకు లేదు. మీ పద్యము మంచి సొగసైన పదజాలముతో అలరారుచున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి