సమస్యాపూరణంలో ‘ఏకాక్షరి’
30-5-2012 తేదీన సమస్యాపూరణం - 720 లో క్రింది సమస్యను ఇచ్చి పూరించమని మిత్రులను కోరడం జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొని చక్కని పూరణ లిచ్చారు. ప్రత్యేకంగా పేర్కొన దగింది శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు సమస్యపాదాన్ని విశ్లేషించి, అద్భుతమైన పూరణ చేయడం. అది ‘ఏకాక్షరి’ కావడం సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అవధానాలలో కాని, సరదాగా చేసే సమస్యా పూరణాల్లో కాని ఇటువంటి ప్రయత్నం ఇదే ప్రథమం.
సమస్య - “డండడ డడ డండ డండ డండడ డండమ్”
శ్రీ ఏల్చూరి మురుళీధర రావు గారి పూరణ.....
డండడ డేడిడ డైడా
డండా డోడౌడ డాడడాడా డాడై
డండూడిడౌడడడడా
డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!
అర్థాలు -
డం = డమరుకము యొక్క,
డ = శివంకరమైన నాదమునందు;
డ = ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా!
డే = దాంపత్యధర్మమును అనుసరించి,
డి = గౌరీదేవిని,
డ = మేని సగభాగమున తాల్చిన దేవా!
డై = వృషభము,
డా = విజయధ్వజముగా కలవాఁడా!
డం = తృతీయనేత్రమందు,
డా = అగ్నిని తాల్చిన విభూ!
డో = దుష్టుల,
డౌ = సంహారమునందు,
డ = రక్తివహించిన ప్రభూ!
డా = శ్రీదేవిని,
డ = వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే,
డా = జయోక్తులతో,
డా = సన్నుతింపబడిన దేవా!
డా = వెన్నెల వంటి,
డై = నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి,
డం = పాల వంటి,
డూ = ఆదిశేషుని వంటి,
డి = గౌరీదేవి వంటి,
డౌ = కామధేనువు వంటి,
డ = శంఖము వంటి,
డ = చంద్రుని వంటి,
డ = అమృతము వంటి, డా=తెల్లని దరహాసము గల ఱేఁడా!
డం = గాయనుల యొక్క,
డ = స్తోత్రములచే,
డ = ప్రసన్నుఁడ వగు,
డ = సర్వేశ్వరుఁడవైన,
డ = పరమేశ్వరా!
డం = దుర్మతులకు,
డ = త్రాసమును కలిగించు,
డం = డమరువు యొక్క,
డ = భీషణమైన ధ్వని కలవాఁడా!
డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం.
విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.
ఈ చిత్రపూరణసదవకాశాన్ని కల్పించిన పెద్దలకు మీకు ధన్యవాదాలు.
ఏల్చూరి మురళీధరరావు
శ్రీయుత ఏల్చూరీ తమ
రిప్లయితొలగించండిధీయుత పాండిత్య గరిమ తెలిసెను సుకవీ
వేయి ప్రణుతులు గొనుడీ
శ్రేయంబిడు వాణి మీకు చిర కాలమ్మున్.
మిత్రులారా!
రిప్లయితొలగించండిడా. ఏల్చూరి మురళీధర రావు గారు మంచి ప్రజ్ఞాశాలి. ఏకాక్షర నిఘంటువులు మొదలైన పరికరములు వారికి కరతలామలకములై ఉన్నవి. ఎప్పటికప్పుడు క్లిష్టతరమైన సమస్యలు వచ్చినప్పుడు వారు మంచి స్ఫూర్తితో పూరించుట మనకు తెలిసినదే. సంస్కృత ఆంధ్ర సాహిత్య పరిజ్ఞానము, సాంప్రదాయక పౌరాణిక వైదిక జ్ఞానము పుష్కలముగా ఉన్నవి. అనేక సందర్భములలో వారు వెలువరించిన వ్యాసములు అద్భుతములు. వారిని గురించి ప్రశంసించుచో ఎంత చెప్పినా కొంచెమే అవుతుంది. వారి జ్ఞానము ఇతోధికముగా అభివృద్ధి చెందాలనీ, వారు అంచెలంచెలుగా ఉన్నతోన్నత పదవుల నలంకరించాలని మా శుభాశీస్సులు. శుభం భూయాత్. స్వస్తి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఏల్చూరి వారిపై చక్కని మీ పద్యానికి ధన్యవాదాలు.
‘వేయి ప్రణతులు’ అన్నప్పుడు ‘యి’ గురువు కాదు. గణదోషం. అక్కడ ‘వేయి ప్రణతులను’ అంటే సరి!
*
నేమాని వారూ,
ఏల్చూరి వారి పరిచయ భాగ్యంతో మన బ్లాగు ధన్యమయింది. ధన్యవాదాలు.
ఏల్చూరివారి సాహిత్య సౌరభములు ఆస్వాదించే అదృష్టం మాకు తరచూ కలిగించవలసినదిగా మా కొరిక.
రిప్లయితొలగించండిఏల్చూరి వారి పూరణ
దల్చినచో హాయి గొల్పు, తల్లీ! వాణీ!
నిల్చితివి వారి నాల్కను
కొల్చెదమే! మమ్ము జూడ గోరంతైనా!
గురువుగారూ ధన్యవాదాలు. కొంచెం తర్జన భర్జన పడ్డాను.
రిప్లయితొలగించండివేయి ప్రణుతులు అన్నప్పుదు ద్విగు సమాసమై యి గురువు కాదా అని నా సందేహం.
కాస్త తీర్చండి.
హనుమచ్ఛాస్త్రి గారూ మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! ధన్యవాదములు. నా పద్యమునకు స్ఫూర్తి మీ పద్యమే...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినిజం! మీరన్నట్లు వారి నాల్కపై వాగ్దేవి నిలిచింది. మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
అది ద్విగువే. కాని పూర్వపదం ఆచ్ఛికం. ఉత్తరపదం సంస్కృతం. రెండు సంస్కృత పదాలు సమసించినప్పుడే ఆ ఊనిక సిద్ధిస్తుంది. ‘సహస్రప్రణతులు’ అన్నప్పుడు... ‘ముగ్గురు ద్రోహులు, ఏడు ద్వీపములు’ అన్నప్పుడు ‘రు,డు’ గురువులు కాదు కదా! అలాగే ఇదీనూ...
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారూ నా సందేహం తీరింది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సవరణ చాలా బాగుంది.
మాన్య విద్వత్సహృదయసార్వభౌములు శ్రీ కంది శంకరయ్య గారికి,
రిప్లయితొలగించండిపూజ్యాంధ్ర సకలసత్కవిపర్యాయమూర్తి శ్రీ నేమాని గురుదేవులకు,
సారస్వత సాంయాత్రికులందరికీ కృతజ్ఞతాపురస్సరనమోవాకములు!
ఒక వివిదిషుకృతమైన సమస్యాపూరణ నిమిత్తపద్యానికి ఔదార్యపూర్ణహృదయంతో సుస్థితిని కల్పించి, సచేతోవిమర్శరూపాశీర్వృష్టిని కురిపించిన మీ అందఱి సౌజన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు! దీనిని “చమత్కార శ్చిత్తవిస్తారరూపో విస్మయాపరపర్యాయః” అన్న విశ్వనాథుని నిర్వచనానికి నిజంగా నిదర్శకం కాకపోయినా, “చమత్కార పద్యము” అన్న శీర్షికతో ధన్యధన్యం చేసిన శ్రీ శంకరయ్య గారికి సర్వాత్మనా కృతజ్ఞుడిని.
వేలాదిమంది రసజ్ఞపాఠకుల గుండెలలో పద్యసరస్వతికి కందిపోని బంగారు గుడి కట్టిన సుకవితాకంధి – కమ్రాపద్యమాకంది - మా కంది శంకరయ్య గారు!
శ్రీ మిస్సన్న గారి ఆశీర్మయవాణికి తలవంచి, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను – ఎల్లవేళల నన్ను దయచూడాలని!
శ్రీయుత గోలి హనుమచ్ఛాస్త్రి గారు నిండుమనస్సుతో పోసిన దీవెనలను శిరసా వహిస్తున్నప్పుడు – శ్రీ ఆరుద్ర గారు 1975 ప్రాంతాల మా తండ్రిగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారిపై చెప్పిన సుప్రసిద్ధమైన చాటువు – అదే ప్రాసతో ఉండటం వల్ల జ్ఞాపకానికి వచ్చి – మేను గగుర్పొడిచింది:
ఏల్చూరి సుబ్రమణ్యం
తొల్చూలు నయాగరాసుతుడు; తానెపుడూ
పల్చన కొప్పడు; ‘అరసం’
కేల్చూపిన కవుల దిట్ట కేరాలక్ష్మీ!
అని! వారు నాకు ప్రసాదించిన పద్యాన్ని యావజ్జీవం పదిలంగా దాచుకొంటాను!
శ్రీ గురువుల అమృతవాణికి నేనెల్లపుడు ఋణగ్రస్తుడనే! వారి దయామృతవృష్టి మూలకంగానే నేను ఎన్నడో మఱచిపోయిన పద్యరచనకు మళ్ళీ మెఱుగులు దిద్దుకోవటం సాధ్యమవుతున్నది! వారికి మాటలతో ఋణాపనోదనం సాధ్యమవుతుందా!
అందఱికీ – పునస్తే నమస్తే !!!
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
very interesting. only one letter having so many meanings.
రిప్లయితొలగించండిచాలా బాగుంది. చాలా గొప్పగా ఉంది. చమత్కార పద్యానికి తగిన ఉదాహరణలా ఉంది.
రిప్లయితొలగించండిమీ విద్వత్తుకి శతకోటి నమస్కార సుమాలు.
భాగవత గణనాధ్యాయి
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిసాంబశివరావు గారూ,
ధన్యవాదాలు.
ఏకాక్షరంలో ఎంత నిఘూడ తత్వాని తెలిపిన మీకు ధన్యవాదము.హృదయపూర్వక నమస్కారములు
రిప్లయితొలగించండి