3, జూన్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 724 (సురభికి జన్మించె ఖరము)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్?

ఈ సమస్యను సూచించిన

పోచిరాజు సుబ్బారావు గారికి

ధన్యవాదాలు

30 కామెంట్‌లు:

 1. వరచరితుడు మధువునకున్
  దురితాత్ముడు క్రూరుడగు సుతుండు లవణుడే
  పరగు నుదాహరణమ్ముగ
  సురభికి జన్మించె ఖరము చోద్యమెటులగున్

  (వివరణ: శ్రీమద్రామాయణము ఉత్తరకాండలోనిది లవణాసుర వృత్తాంతము. మధువు అను నైష్ఠిక బ్రాహ్మణుడు మధురానగరాధిపతిగా నుండెను. వాని కుమారుడు (రావణునికి మేనల్లుడందురు) లవణుడు క్రూరాత్ముడు, సాధు హింసకుడు, మునులను బాధించు చుండెడివాడు. శ్రీరాముని ఆశీస్సులను బొంది శత్రుఘ్నుడు ఆ లవణుని వధించి మధురా నగరమును ఆక్రమించుకొని రాజ్యము చేసెను.) స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. సురభీ సూరీ ఖరములు
  సూరయ్యే పెంచినాడు చూడగ పెద్దై
  మరియొక్క నాడు 'కనగా'
  'సురభికి' జన్మించె ఖరము చోద్య మెటులగున్?

  రిప్లయితొలగించండి
 3. దరిజేరి వందనమిడుదు;
  ఖరము కడుపుపండి నేడు ; కఠినమయినదీ
  చిఱుపూరణమే; చోద్యము!
  సురభికి; జన్మించె ఖరము; చోద్యమెటులగున్?

  రిప్లయితొలగించండి
 4. మరమనుషుల కలియుగమట
  పురుషులు స్త్రీలవగ వింత ముచ్చట గాదే ?
  వెఱగుపడి సురలు గాంచగ
  సురభికి జన్మిం చె ఖరము చోద్య మెటులగున్ !

  రిప్లయితొలగించండి
 5. మురియుచు వరాల బిడ్డను
  సురభి పిలిచె ‘గాడిద’ యని, చూచి నగువునన్
  మరి తాతయు రెట్టించెను
  ‘సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్?’

  రిప్లయితొలగించండి
 6. సురభులు ఖరములు నొకచో
  పెరుగుచు మఱి యొకటి కొకటి ప్రేమ తొ గలవన్
  ఇరువురి ప్రేమకు ఫలితము
  సురభికి జన్మించె ఖరము చోద్య మెటు లగున్ ?

  రిప్లయితొలగించండి
 7. వరములగొనె కైకసి తా
  హరుని గొలిచి భక్తి భావ హర్మ్యములందున్,
  హరిసతిని పట్టె రావణు,
  సురభికి జన్మించె ఖరము చోద్యమెటులగున్?

  ( భూకైలాస్ చిత్రము ఆధారంగా )

  రిప్లయితొలగించండి
 8. ధరణీ దేవతకున్ శ్రీ
  వరాహమూర్తికిని మున్ను ప్రభవించె కదా
  నరకాసురుడే సుతుడై
  సురభికి జన్మించె ఖరము చోద్యమెటు లగున్

  రిప్లయితొలగించండి
 9. మిత్రులారా!
  "సురభులకు బుట్టుచుండెను ఖరము లకట" అనే పద్యపాదము నా శ్రీమదధ్యాత్మ రామాయణము (పద్యకావ్యము) యుద్ధకాండలోనిదే. సీతను అపహరించి రావణుడు లంకకు గొనిపోయిన తరువాత లంకలో విపరీతమైన దుశ్శకునములు గోచరిస్తాయి. అప్పుడు సుమాలి (రావణుని మాతామహుడు) రావణునికి చేసిన బోధలో భాగము ఇది.
  ఈ పాదమును యథా తథముగ పూర్వము ఒక మారు మన బ్లాగులోనే శ్రీ సుబ్బారావు గారి సూచన మేరకు సమస్యగా ఇచ్చుట కూడా జరిగినది.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  ధరణికి విష్ణువరమ్మున
  నరకుఁడు జన్మించి స్త్రీల నయదూరుండై
  తరువిడె నఁట చోద్యముగా!
  సురభికి జన్మించె ఖరము చోద్య మెటు లగున్?

  (తరువిడు = నిర్బంధించు)

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
  మీ భావము బాగున్నది కాని పద్యము 3వ పాదము బాగులేదు. హరి సతిని బట్టె రావణు అంటే సరికాదు. సరియైన రీతిగా మార్చండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని వారికి నమస్కృతులు.
  ‘సురభులకు బుట్టుచుండెను ఖరము లకట!’ ఇది 14-2-2012 నాడు సమస్యా పూరణ - 621 గా ప్రకటింపబడినది. అప్పుడు దానిని సుబ్బారావు గారే సూచించారు. మళ్ళీ నిన్న అదే సమస్యను సూచించారు. గతంలో ఇచ్చిన విషయం మరిచిపోయాను. ఎందుకో దాని ఛందం మార్చాలనిపించి కందపాదంగా మార్చి ఇచ్చాను. అదీ విషయం.

  రిప్లయితొలగించండి
 13. గురువులు శ్రీ పండిత నేమానివారికి,

  నమస్కారములు. హరి సతిని బట్టె రావణు అనేది సరికాదన్నారు. హరి సతి అంటే లక్ష్మిదేవి అని వస్తుందని అలా అంటున్నారనుకొంటాను.
  లేక రావణు అనే పదప్రయోగమే తప్పుగా వున్నదా??

  "చెఱనిడె సీతను రావణు" అంటె సరిపోతుందా??

  రిప్లయితొలగించండి
 14. శ్రీ మిస్సన్న గారికి,

  పద్యము చాలా బాగున్నది. కానీ, రెండవ పాదములో యతి కుదరడము లేదు. అలాగే నాల్గవ గణము కూడా తప్పుపడినది.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
  "రావణుడు" అంటేనె కాని సంపూర్ణమైన పదము కాదు. రావణు అనుట సరియైన ప్రయోగము కాదని నా భావము. అందుచేత మరొక ప్రయత్నము చేస్తే బాగుంటుంది. రావణు అని వదలివేస్తే రావణునియొక్క అనే అర్థము వస్తుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ సంపత్కుమార శాస్త్రి గారి bhaavamunaku సరియగు పద్యము:

  హరు గొలిచి పొందె కైకసి
  వరముల, నామెకు సుతుండు పంక్తిముఖుడు తా
  చెరపట్టె జనక పుత్రిని
  సురభికి జన్మించె ఖరము చోద్యమెటులగున్?

  రిప్లయితొలగించండి
 17. శ్రీ నేమాని గురువర్యులకు నమస్కారములు.

  రావణు అనే పదప్రయోగములోనే లోపమున్నదని తెలుసుకొన్నాను.

  నా భావానికి మీ పద్యము అద్భుతంగా ఉందండీ. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 18. హరిలాలుని గన్న గాంధి
  మరణాంతక బాధలోందె పుత్రుడు ధర్మాం
  తరుడై వ్యతిరేకింపగ
  సురభికి జన్మించె ఖరము చోద్యమెటులగున్?

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్నగారు,
  మీ కాఫీ స్తుతి చమత్కారంగా ఉన్నది. కొంచెం ఎక్కువే తీసుకున్నారేమో...:) మీరు సవరించిన పద్యంలో రెందవ పాదము లో నాల్గవ గణము మొదటి అక్షరము బదులు ఐదవ గణము మొదటి అక్షరమును యతిగా వేశారు.
  గమనించగలరు.

  రిప్లయితొలగించండి
 20. లక్ష్మీదేవి గారూ ధన్యవాద శాతము.
  నిజానికి నాకు కాఫీ అంటే పడదు మొన్న మొన్నటి దాకా.
  ఈ మధ్యనే మా ఆవిడ నాకు అలవాటు చేసింది. ఏం చెప్పమంటారు? ఇలా అయిపోయాను.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ ధన్యవాదాలు. తప్పును దిద్దుకొన్నాను.

  నిఘంటువులో సురభి అంటే వసంతకాలము అనిన్నీ ఖరము అంటే వేడి అనిన్నీ కూడా అర్థాలు కనుపించాయి అందుకనీ...........

  అరయగ చైత్రమునందున
  కరమై తాపమ్ము నేల కాగెను కనుడీ
  సరి మారుచుండె కాలము
  సురభికి జన్మించె ఖరము చోద్య మెటు లగున్?

  రిప్లయితొలగించండి
 21. కరవీర సుమము శుభమట
  గిరితనయకు పూజసేయ; క్షేమంబగునే
  మరి కాయలు? కా నేఱవు,
  సురభికి జన్మించె ఖరము, చోద్యమెటులగున్?

  రిప్లయితొలగించండి
 22. శ్రీ సరస్వత్యై నమః :
  మిత్రులారా! ఈ నాటి పూరణలను ముచ్చటిద్దాము.
  అందరకీ శుభాభినందనలు.

  1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు మంచి మూడులో ఉన్నట్టు లేదు. హడావుడిగా ఏదో నింపేసేరు. ఎక్కడికక్కడే సంతోషము.

  2. శ్రీమతి లక్ష్మీ దేవిగారు నిజంగా చోద్యమనే రీతిగనే పూరించేరు. బాగున్నది.

  3. శ్రీమతి రాజేశ్వరి గారు రోబోలను తీసుకొని వచ్చేరు - అమెరికాలో ఫ్రీగా దొరకుతాయేమో. బాగున్నది.

  4. శ్రీ చంద్రశేఖర్ గారు మంచి చమత్కారమును నింపేరు. సెహబాస్.

  5. శ్రీ సుబ్బా రావు గారు సమస్యను సూచించినంత ఉత్సాహాముతో నింపలేదు. జంతు సాంకర్యము కొంచెము కటువుగా ఉన్నది.

  6. శ్రీ మధుసూదన్ గారు భాగవత కథను ఉటంకించేరు. బాగున్నది.

  7. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి భావము బాగున్నది.

  8. శ్రీ చంద్రమౌళి గారు సమకాలీన వృత్తాంతమును ప్రస్తావించేరు. బాగున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. ఖర సురభీ జన్యువులే
  సరి క్లోనింగుమిలితాన జన్యత నొందన్
  ధరణీతలంబునందున్
  సురభికిజన్మించెఖరముచోద్యమెటులగున్
  (జన్యుశాస్త్రవిజయాన్ని 'జన్యత' అన్నాను తప్పొప్పులనిర్ణయం బుధజనులదే. స్వస్తి)

  రిప్లయితొలగించండి
 24. శ్రీ పండిత నేమాని గురువులకు ధన్య వాదములు.
  హమ్మయ్య ! రాత్రి నిద్ర వస్తున్నా గబగబా వ్రాసేశాను గానీ ఒకటే భయం . ఎన్ని తప్పులున్నాయో అని ! ఇక అమెరికా " రోబోలు " ? ? ?
  అమ్మో ! నన్నందరు తిడతారు .

  రిప్లయితొలగించండి
 25. పండిత నేమాని వారూ,
  సమస్యపాదాన్ని చక్కగా సమర్థిస్తూ రెండు మంచి పూరణలు చెప్పారు. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘గాడిద’కు అంత చక్కని పేరా? చమత్కార భరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  క్రమాలంకారంలో మీ మొదటి పూరణ అద్భుతంగా ఉంది.
  రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  కాల మహిమ! వింతలకేం లోటు లేదు. చక్కని పూరణ. అభినందనలు.
  *
  ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  ఆడిన మాటలు దప్పిన
  గాడిదకొడు కంచుఁ దిట్టఁగా విని “యయ్యో!
  వీఁడా నాకొక కొడు”కని
  గాడిద యేడ్చెం గదన్న ఘనసంపన్నా!
  అన్న పద్యాన్ని గుర్తుకు తెచ్చింది మీ పూరణ. ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ క్రాస్‌బ్రీడ్ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో ‘తొ’ హ్రస్వంగా ప్రయోగించారు. ‘ప్రేమతొ’ను ‘ప్రేమను’ అని మార్చండి.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభనందనలు.
  మూడవ పాదాన్ని ‘పరసతిని బట్టె నాతడు’ అందాం.
  పండిత నేమాని వారి సవరణ చాలా బాగుంది. దీనిని నేను తరువాత చూడడం జరిగింది.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  చక్కని ధారతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  చక్కని ఉదాహరణతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. బేసి గణంగా జగణం ఉండరాదు కదా! రెండవ పాదంలో ‘కన్నడక్కు యతి ఇల్లె’ అని మీకు అలవాటైన పద్ధతిలో యతిని పాటించలేదు. నా సవరణ.....
  హరిలాలుని గని గాంధీ
  పొరిపొరి కడు బాధలందె పుత్రుడు ధర్మాం.....
  *
  మిస్సన్న గారూ,
  పదాలకున్న విశేషార్థాలను స్వీకరించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ ‘సైంటిఫిక్’ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘జన్యత నొందెన్’ ను ‘జననం బందెన్’ అందాం.

  రిప్లయితొలగించండి
 26. అరయగ భారత మాతలు
  సరియగు నిందిర జవహరు సంతతి నొందన్
  మురిపెమ్ముగ నేడిటలీ
  సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్?

  రిప్లయితొలగించండి
 27. స్మృతి ఉవాచ:

  కరములు మోడ్చుచు క్రీస్తుకు
  నిరతము ప్రార్థించకుండ నీలగ్రీవున్
  వరపుత్రు నడుగ రోమను
  సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్?

  రిప్లయితొలగించండి