సంయుక్తాక్షర కందము
మాన్యతములు శ్రీ కంది శంకరయ్య గారికి,
పూజ్యశ్రీ గురుదేవులకు,
అఖిల విద్వత్కవిబృందానికి,
సహృదయంతో స్పందించిన పెద్దలందఱికి
హృదయపూర్వక నమస్కారాలు.
శ్రీ అజ్ఞాతగారు దయతో వ్రాసిన అభిలేఖితం నేపథ్యంలో నా పద్యాన్ని ఈ విధంగా పునారచించాను. దీనివల్ల పద్యం సుపరిష్కృతం కావటమే గాక సులక్షణంగా సవరించుకోవటం సాధ్యమయింది. వారికి మఱొక్క పర్యాయం నా ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను.
పద్యపాఠం:
త్యత్ క్ష్మాధ్రద్విట్స్తోత్రా
త్మ్యత్ క్ష్మాధ్రద్విడ్జ! ద్యుత్ర! ద్యౌత్రాస్థాన్యో
ద్యత్ క్ష్మాశ్రీస్ఫూర్జన్నే
త్రోత్ క్ష్మేన్ద్రాభ్యర్చ్య! ద్వ్యన్య! ద్యుమ్నస్తుత్యా!
ప్రతిపదార్థములు -
త్యత్ = ప్రసిద్ధిని పొందుచున్న,
క్ష్మాధ్ర = పర్వతములకు,
ద్విట్ = శత్రువైన ఇంద్రునియొక్క,
స్తోత్రా = పొగడిక గలవాఁడా!
(ఉపేంద్రుఁడ వయ్యు ప్రసిద్ధమైన ఇంద్రసూక్తముచే దేవేంద్రుని స్తోత్రముల నందుచున్న దేవా!)
ఆత్మ్యత్ = ఆత్మసాత్కృతుఁ డగుచున్న,
క్ష్మాధ్ర+ద్విట్+జ = దేవేంద్రుని వరప్రసాదమున జన్మించిన అర్జునుని గల స్వామీ!
ద్యుత్ర = అగ్నిస్వరూపుఁడవై జగద్రక్షణము కావించుచున్న ప్రభూ!
ద్యౌత్ర = జ్యోతిర్ద్రవ్యములకు,
ఆస్థానీ = కొలువైన ప్రభూ,
అ = శ్రీ వాసుదేవా!
ఉద్యత్ = వెలుఁగొందుచున్న,
క్ష్మా = భూదేవియొక్క,
శ్రీ = శ్రీదేవియొక్క ఉనికిచేత,
స్ఫూర్జత్ = ప్రకాశమానములైన,
నేత్రా = కన్నుల కాంతులు గలవాఁడా!
ఉత్ = మహనీయులైన (లేదా) మోక్షార్థులైన,
క్ష్మా+ఇన్ద్ర = పృథు ప్రియవ్రత ప్రహ్లాద గయాది రాజేంద్రులచే,
అభ్యర్చ్య = పూజింపఁదగిన లోకేశ్వరా!
ద్వ్యన్య - ద్వి+అన్య = ద్వంద్వము లన్నింటికి అతీతుఁడవైన దేవదేవా!
ద్యుమ్న = సమగ్రైశ్వర్య వీర్య యశః శ్రీ జ్ఞాన వైరాగ్య సృష్టిస్థితిసంహారాది మహాశక్తిసంపన్నతచే,
స్తుత్యా = స్తోత్రపాత్రుఁడ వైన స్వామీ!
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
హృదయపూర్వక శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిపదములతో ప్రయోగములు బాగుగ చేసెడు మాన్య శాస్త్రకో
విద! బుధలోకవంద్య! బలె వెల్గుల నీనగ నీ యశమ్ము స
మ్ముదమున గూర్తు దీవెనలు పుణ్య గుణాకర! వాగ్విశేష సం
పదలు సమృద్ధిగా గలిగి భాసిలుమా మురళీధరా! సుధీ!
పరమాద్భుతం !!!
రిప్లయితొలగించండిపరిష్కృత పద్యాన్ని మరల ప్రకటించిన కవిగారి అసమానప్రతిభకు జోహార్లు.
రిప్లయితొలగించండిఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు,
ప్రయాణాల వల్ల వారంరోజులుగా ఇంటర్నెట్ కు దూరంగా ఉండవలసి వచ్చింది. ఈరోజే మళ్ళా శంకరాభరణం బ్లాగును సందర్శించే భాగ్యం కల్గింది. శ్రీ ఏల్చూరి వారి సంయుక్తాక్షరకందం అత్యద్భుతంగా, అనితరసాధ్యంగా ఉంది. వారి ప్రతిభకు నమస్సుమాంజలులు.
సలక్షణ మైన పద్యమును సులక్షణముగా అందుకొనుటకు విలక్షణముగా మలచిన ఏల్చూరి వారికి పునర్వీక్షణావకాశమునకు కారణమైన అఙ్ఞాత గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండి