7, జూన్ 2012, గురువారం

సమస్యాపూరణం - 728 (ఎండను నిద్రించ)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. మండెడు వడ గాడ్పులకున్
  మండగ తనువెల్ల పగలు మరి గ్రీష్మమున-
  న్నుండగ లేకిండ్లను రే-
  యెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.

  రిప్లయితొలగించండి
 2. మండుచునున్నవి గనుమా
  యెండలు భీకరముగ మఱి యిపుడిక మీఱల్
  రండిక నఱుగుల పై నీ
  రెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.

  రిప్లయితొలగించండి
 3. ఎండయగు భవము, మార్చుచు
  నుండును వెన్నెలగ భార్య యుడుపతి కరణిన్
  పండువు వలె మారిన యా
  యెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్

  రిప్లయితొలగించండి
 4. మెండుగ పంటలు బండుచు
  నుండినపొలమునకు కావలుండునెపమునన్
  పండుగసంక్రాంతిన నీ
  రెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.

  కావలి + ఉండు = కావలుండు
  సంక్రాంతి పండుగ దినములలో చలి తీవ్రత ఎక్కువకదా.

  రిప్లయితొలగించండి
 5. కొండలప్రేల్చెడుయెండలు
  మండగ, వడగాలులబడి బ్రతుకులుమాడన్
  నిండైన నీడన,విడచి
  ఎండనునిద్రించ సుఖమునిచ్చునుమిగులన్

  రిప్లయితొలగించండి
 6. నిదుర రాలేదని ఫోము బెడ్డు మీద
  దొరలు దొరలారా నిదురకు కావలసినది
  కాయ కష్టమే, కూసింత కష్టపడి
  ఎండనునిద్రించ సుఖమునిచ్చునుమిగులన్

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 7. మెండుగ కందును ముఖములు
  నెం డను నిద్రించ , సుఖము నిచ్చును మిగులన్
  నెండల బారిన బడి నీ
  రెండను బోవా మనుజుని నెడదమ్మునకున్.

  రిప్లయితొలగించండి
 8. గుండక్కఁబోలుగయ్యా
  లుండినఁబతికెట్లునిద్రలుండును పోరన్
  మెండగునీడన,వీడియు
  నెండను,నిద్రించసుఖమునిచ్చునుమిగులన్!

  రిప్లయితొలగించండి
 9. శ్రీపతిశాస్త్రిగురువారం, జూన్ 07, 2012 2:14:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  మెండుగ కురిసె తుషార మ
  ఖండముగా నెగసె చలియు కార్తీకమునన్
  బండలపై పవళించుచు
  ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్

  రిప్లయితొలగించండి
 10. మెండగు శీతల మందున
  నిండుగ లేపనము లలది నీటగు దొరలే !
  పండెదరు సైకతమ్మున
  ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్ !

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరక్కయ్యగారి పూరణకి ఊతంగా:
  పండిన వెన్నెల పడదట
  బండగ తినునట్టి సీమ పందుల కేలా
  మెండగు పన్నీరందుల
  కెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్

  రిప్లయితొలగించండి
 12. మస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  చంద్రునిలా వెన్నెలలు కురిపించే భార్యలు దొరకడం అదృష్టమే! చక్కని పూరణ. అభినందనలు.
  నాకేమో నిప్పులు కురిపించే ‘సూర్యకాంత’మే దొరికింది :-(
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కావలి + ఉండు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
  *
  సహదేవుడు గారూ,
  మీ మొదటి పూరణ చాలా బాగుంది.
  మీ రెండవ పూరణ చమత్కారభరితమై అలరిస్తున్నది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావాన్ని యథాతథంగా కాకున్నా కొద్దివరకు పద్యరూపాన్నిచ్చాను....

  నిండుగ నిద్దుర లేదని
  మెండగు ఫోంబెడ్డు మీద మేన్వాలిచి తా
  నుండగ, గది బయటనె విడి
  యెండను; నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.
  *
  సుబ్బారావు గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  చివరిపాదాన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో.... ‘నీ/రెండనుబోవంగ మనుజు నెడదమ్మునకున్.’
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరక్కయ్యా,
  మీరు ఇంతకాలం చేసిన పూరణలలో నా దృష్టిలో ఇది ఉత్తమమైన పూరణ. ఎంత బాగుంది! సంతోషం! అభినందనలు.
  *
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పండిన చేలను గోయుచు
  నిండుగ బ్రవహించు నేట నీదిన పిదపన్
  దండిగ కష్టించిన వా
  రెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్ .

  రిప్లయితొలగించండి
 14. తప్ప కుండా మరదలికి చెప్పెయ్యాలి . " సూ రే కాంతం " అంటున్నారని .
  అయినా....... సూరే కాంతం ఛాలా మంచిది . పైగా .....జడ్జీ గారమ్మాయి .

  రిప్లయితొలగించండి
 15. బండెడు బట్టల నుతికితి
  మెండుగ నీరసము వచ్చె మీనా! సీతా!
  రండిటు బట్టల వేయుద
  మెండను, నిద్రించ సుఖము నిచ్చును మిగులన్!

  రిప్లయితొలగించండి
 16. రాజేశ్వరి అక్కయ్యా,
  నిజజీవితంలో సూర్యకాంతం ఎంతటి సౌమ్యురాలో బాగా తెలుసు. ఏదో హాస్యానికి అన్న మాట అది!
  *
  గోలి హనుమచ్చాస్త్రి గారూ,
  మీ లేటెస్ట్ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పండంటి నులక మంచము
  నిండుగ చీమలు బిరబిర నెలకొని ప్రాకన్
  దండిగ బాదగ దానిని
  ఎండను; నిద్రించ సుఖము నిచ్చును మిగులన్

  రిప్లయితొలగించండి
 18. కొండొక నెల్లూరి సతికి
  మెండుగ సంక్రాంతి నాడు మెక్కెడు యరిసెల్
  పండుగ మబ్బుల దాగెడి
  యెండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్

  రిప్లయితొలగించండి