24, జూన్ 2012, ఆదివారం

శ్రీ హనుమద్దండకము


శ్రీ హనుమద్దండకము

          శ్రీవాయుపుత్రా! ప్రభూ! ఆంజనేయా! మహద్దివ్యచారిత్ర! వీరాధివీరా! శుభాకార! శ్రీరామభక్తాగ్రగణ్యా! దశగ్రీవవంశాంతకా!లోక పూజ్యా! మహాత్మా! పరాకేలనయ్యా! మొరాలించవయ్యా! సమస్తాఘసంఘంబులంద్రుంచి శీఘ్రంబె కావంగ రావయ్య! నీయద్భుతంబైన చారిత్రమున్ భక్తితో బాడగా సర్వసౌభాగ్యముల్ గల్గు సందేహ మొక్కింత లేదయ్య! నిన్భక్తితో గొల్చు భాగ్యంబు గల్గించి రక్షించుచుం, దల్లివై ప్రేమనందించుచుం, దండ్రివై గాచుచున్, మిత్రరూపంబునం జేరి సన్మార్గముం జూపుచున్, భ్రాతవై ధైర్యముం బెంచి కాపాడవయ్యా! సదా నిన్ను ధ్యానింతు, పూజింతునయ్యా! కథాలాపముల్ జేతునయ్యా! మదీయాంతరంగంబు నందున్న దుర్బుద్ధులన్ ద్రుంచి, సద్భావసంపత్తులం జేర్చుమా, సాధుసంగంబులం గూర్చుమా, సర్వదా నీపదాబ్జాతముం దాకి యర్చించు సౌఖ్యంబు గల్పించి, నీయందు సద్భక్తి గల్గించవయ్యా! సదా సర్వదు:ఖాపహారీ! మహాకాయ! శ్రీరామభక్తాంజనేయా! నమస్తే నమస్తే నమస్తే నమ:| 

రచన -
హరి వేంకట సత్యనారాయణ మూర్తి 

3 కామెంట్‌లు:

 1. అయ్యా! శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ! శుభాభినందనలు. చాలా మంచి ప్రయత్నము. దండకము చాలా బాగుగా నున్నది. నేనొక కొన్ని పంక్తులు వ్రాసేను. చూడండి:

  "శ్రీరామ సంకీర్తనంబెందు సద్భక్తితో నొప్పునో యందు వేవేగమే జేరి యా భక్త బృందంబుతో గూడి యా సేవలో తన్మయత్వంబునున్ బొంది సంతోషముప్పొంగ కన్నీళులొల్కంగ దండంబుల వెట్టుచున్ మెండు ప్రోత్సాహమున్ గూర్చుచున్ భక్త బృందాల దీవించి యానందమున్ గూర్చు నో దేవదేవా! విశిష్ట ప్రభావా! నమో వాయుపుత్రా! నమో వజ్రగాత్రా! కృపాపూర్ణ నేత్రా! నమస్తే నమస్తే నమః "

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. అయ్యా! శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ! శుభాభినందనలు.

  ఒక చిన్న సవరణతో:

  "శ్రీరామ సంకీర్తనంబెందు సద్భక్తితో నొప్పునో యందు వేవేగమే జేరి యా భక్త బృందంబుతో గూడి యా సేవలో తన్మయత్వంబునున్ బొంది సంతోషముప్పొంగ కన్నీళులొల్కంగ దండంబులన్ వెట్టుచున్ మెండు ప్రోత్సాహమున్ గూర్చుచున్ భక్త బృందాల దీవించి యానందమున్ గూర్చు నో దేవదేవా! విశిష్ట ప్రభావా! నమో వాయుపుత్రా! నమో వజ్రగాత్రా! కృపాపూర్ణ నేత్రా! నమస్తే నమస్తే నమః "

  స్వస్తి.

  రిప్లయితొలగించండి