12, జూన్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 733 (భోగరక్తుఁ డగు ముముక్షువు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

భోగరక్తుఁ డగు ముముక్షు వెపుడు.

17 కామెంట్‌లు:

  1. జ్ఞానశూన్యుడైన మానవుడెల్లెడ
    భోగరక్తుడగు, ముముక్షు వెపుడు
    సంగయుక్తుడయ్యు సర్వకాలములందు
    చిత్త మెల్ల జేర్చు శివుని యందు.

    రిప్లయితొలగించండి
  2. యోగరక్తుడగుచు నొప్పు ముముక్షువు
    పుడమి ననుచు వ్రాయబూని యొకడు
    వ్రాసె తొందరపడి బాపురే! కనుడిదే
    భోగరక్తుడగు ముముక్షువెపుడు

    రిప్లయితొలగించండి
  3. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    ఇహముకన్న పరము నేజీవునకునైనఁ
    గోరఁదగిన దనుచుఁ జేరఁ బిలిచి
    గురుఁడు బోధ సేయఁ, గోరును, బరలోక
    భోగరక్తుఁడగు ముముక్షు వెపుడు.

    రిప్లయితొలగించండి
  4. ప్రకృతి యిచ్చు ఫలము ప్రభువు కన్ననుమిన్న
    యనుచుఁ దలచుచున్న నతఁడు నిరత
    భోగ రక్తుఁడగు; ముముక్షువెపుడు దాను
    బ్రహ్మ కిచ్చుచుండు ప్రాథమికత.

    దేహమందు నరుఁడు తీరని కాంక్షతో
    భోగరక్తుడగు; ముముక్షువెపుడు
    తత్త్వబోధఁ జేసి ధర్మమెఱుగఁజేయు
    చుండు నాత్మ యొక్క చోద్యమరయ.

    రిప్లయితొలగించండి
  5. సాన బట్టఁ భోగి చక్కని యోగియ
    గునని అన్నమయ్య గుట్టు విప్పి
    నట్లు భోగరక్తుఁ డగు ముముక్షు వెపుడా
    జ్ఞాన శూల దగుల నగును యోగి
    మనవి: శూల=వేశ్య, మరియొక అర్థము యోగము

    రిప్లయితొలగించండి
  6. ఆత్మ యనగ తానె, యాత్మయే సర్వమ్మ
    టంచు నాత్మదృష్టి యలరుచుండ
    సంగరహితుడును బ్రశాంతచిత్తుడు వీత
    భోగరక్తుడగు ముముక్షు వెపుడు

    రిప్లయితొలగించండి
  7. భోగ భాగ్యముల్గల యట్టి భువన విభుడు
    భోగ రక్తుడగు , ముముక్షు వెపుడు
    దైవ చింతన , భజనల ధ్యాస తప్ప
    అన్య మెరుగడు రానీయ డాడ గాలి.

    రిప్లయితొలగించండి
  8. జపము తపము లంచు జగతిలో నిత్యంబు
    దీప్తు లందు చుండు దీక్షితుండు
    మోక్ష మంద లేడు మునివరుండైనను
    భోగరక్తుడగు ముముక్షు వెపుడు.

    రిప్లయితొలగించండి
  9. తొలుత నిహసుఖముల,దోగాడి యజ్ఞుడై
    భోగరక్తుడగు;ముముక్షు వెపుడు
    పిదప జ్ఞాన రోచి వెలుగును జూపింప
    చక్కనైన దారి సాగిపోవు.

    రిప్లయితొలగించండి
  10. భౌతిక సుఖ ధుఖ బాట భ్రాంతి యనుచు
    శాశ్వతమగు సంత సంబు వెదకి
    తరగి పోని సచ్చిదానంద మొసగెడు
    భోగ రక్తుడగు ముముక్షు వెపుడు

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి , నేమాని గారికి ధన్యవాదములు తెలుపుతూ
    ----------
    పరమ సుఖము నొంద పరుగులిడు యువత
    మేను పట్టు దప్పె మిగుల నేడు
    ముక్తి మార్గ మనుచు మునిగె విలువలిడి
    భోగ రక్తుడగు ముముక్షు వెపుడు
    ( ముముక్షువు = యువత, యువత పెడ దారి పట్టుతపై )

    రిప్లయితొలగించండి
  12. భక్తి పెరిగి నంత భగవంతుని యెడవి
    రక్తి కలుగ లేదు లక్ష్మి పైన
    జపము తపము జేసి జయించ లౌల్యమ్ము
    భోగ రక్తు డగు ముముక్షు వెపుడు !

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 12, 2012 9:01:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కోర్కెలన్ని యుడుగ కోపమును విడచి
    లోభ మోహ మదము లుప్తమౌగ
    మోక్ష పదముచేర మౌనియై ముక్తి వై
    భోగరక్తుఁ డగు ముముక్షు వెపుడు

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 12, 2012 9:13:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    3వ పాదంలో యతి సవరించి

    కోర్కెలన్ని యుడుగ కోపమును విడచి
    లోభ మోహ మదము లుప్తమౌగ
    మోక్ష పదముచేర మునియౌచు ముక్తి వై
    భోగరక్తుఁ డగు ముముక్షు వెపుడు

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా! అందరికీ శుభాభినందనలు.
    మీ పూరణలన్నీ అలరారు చున్నవి.

    (1) శ్రీ హ.వే.స.నా.మూర్తి గారు మంచి విరుపులనే ఎన్నుకొన్నారు 2 పద్యములు(1) శివునియందు చిత్తము చేర్చిన భక్తుడు, (2) జగతిలో మున్గిన వాని గతి -- చాల బాగున్నవి.
    (2) శ్రీ గుండు మధుసూదన్ గారు : గురుని బోధ వినిన పరలోక భోగ రక్తుని గురించి బాగుగా వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.
    (3) శ్రీమతి లక్ష్మీదేవి గారు : 2 పద్యములలో మంచి విరుపులను ఎంచుకొన్నారు. (1) బ్రహ్మ చింతనలో మున్గిన వాడు (2) తత్త్వబోధనా రతుని గూర్చి = ఉత్తమముగా ఉన్నవి.
    (4) శ్రీ చంద్రశేఖర్ గారు : "భోగి అయిన పిదప యోగి అగును" అనే సూక్తిని ఉటంకించేరు. ప్రశంసనీయముగా నున్నది.
    (5) శ్రీ సుబ్బా రావు గారు: 1పాదము ఆటవెలది 3పాదములు తేటగీతి వ్రాసేరు. మంచి విరుపు చేపట్టేరు. బాగున్నది.
    (6) డా. కమనీయం గారు: వీరి రచనా పాటవమును ఏమని వర్ణించ గలము - మార్గదర్శకులు వారు. నమస్సులు.
    (7) శ్రీ సహదేవుడు గారు: శాశ్వతమగు సంతోషమును వాంచించేరు. ప్రశస్తముగా నున్నది.
    (8) శ్రీ వరప్రసాద్ గారు: యువత దారి తప్పుటను చూచి జాలిగొనినారు. పిదప వారే మునులు కాగలరనే విశ్వాసమును వెలిబుచ్చేరు. ఉత్తమముగా నున్నది.
    (9) శ్రీమతి రాజేశ్వరి గారు మంచి భావమును వెలిబుచ్చు తుంటారు. 3వ పాదము గణభంగము అయినది. ఇలా మార్చుదాము:
    "జపము తపము జేసి శాంతింప లౌల్యమ్ము" అని. పద్యము బాగున్నది.
    (10)శ్రీ శ్రీపతి శాస్త్రి గారు : ముక్తి వైభోగరతుని తీరు వర్ణించేరు -- చక్కగా వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. గురువులకు ధన్య వాదములు.
    క్షమించాలి . మర్చి పోయాను . " [ జయించ " " జగణ " మనుకుంటాను ]

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 13, 2012 8:08:00 AM

    గురువర్యులు శ్రీ పండితనేమానిగారికి నమస్సులు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి