12, జూన్ 2012, మంగళవారం

పద్య రచన - 27


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. గంగా మహాదేవి క్ష్మాపాలు శంతను
  భార్యయై యలరుచు వసుధ పైని
  పుత్రుల గనుచుండి పుట్టిన వెంటనే
  గంగపాలొనరింప గాంచుచుండి
  సహనమ్మునున్ దాల్చి చాల వత్సరముల
  దనుక నష్టమపుత్రు గనిన వేళ
  వానిని గంగలో పడవేయ బూనగా
  వద్దంచు వారించె భర్త యంత
  నియమ భంగమటంచు నన్నెలత పతిని
  వీడి చనె నా సుతుడు మహావీరవరుడు
  ధీనిధానుండు నైనట్టి దేవవ్రతుడు
  ఖ్యాతి గాంచెను భీష్ముడై క్ష్మాతలమున

  రిప్లయితొలగించండి
 2. ఆర్యా!
  నమస్కారములు
  మొదట ఈ చిత్రాన్ని ఫలానా అని ఊహించలేక పోయాను. గురుతుల్యులు శ్రీ నేమానివారి పద్యాన్ని చూసిన తర్వాత అర్థమైంది. వారికి ధన్యవాదములు.

  సీ.
  కోరి దీక్షనుబూని యీరీతి పుత్రులన్
  గంగ కర్పింతువా క్రమముగాను?
  "మమతకు నిలయంబు మాతృమూర్తి" యటండ్రు
  కరుణ యొక్కింతైన కానరాదు
  "కలుషహారిణి" వండ్రు కన్నబిడ్డలనిట్లు
  హరియించు టుచితంబె యతివ నీకు?
  వీని నొక్కనినైన విమలాత్మవౌచును
  కాపాడవే తన్వి! కోపమేల?
  తే.గీ.
  అనుచు శంతను డీరీతి నమితదు:ఖ
  భరితుడై గంగతో బల్కి, కరుణఁ జూపు
  మంచు వారింప యత్నించ నప్పు డామె
  భర్త కనియెను వినుమింక ప్రాణనాథ!
  సీ.
  అలనాడె దెల్పితి నతివిస్తృతంబుగా
  సంతానమును గూర్చి చక్కగాను,
  వారింప వలదంచు కోరినానప్పుడే
  మగడ! యిట్టులు పల్కఁ దగదు నీకు
  నియమభంగము గాన నేనుండరాదింక
  నీతోడ నికపైన నృపతి! యిపుడె
  యేగుచుంటి నటంచు నాగంగ కొమరుని
  నిజనాథు కర్పించి నిలువకుండ
  తే.గీ.
  చనెను, శంతను డాపట్టి ననుపమగతి
  బెంచె, వీరాధివీరుడై పేరు గాంచె
  నతడు దేవవ్రతుడనంగ, ప్రతినబూని
  భీషణంబుగ మున్ముందు భీష్ముడయ్యె.

  రిప్లయితొలగించండి
 3. శంతన మహరాజు చక్కటి చుక్కను
  తరళాక్షి గంగనుఁ దానుఁ జూచె
  కాంక్షతో నావుడు కఠినమౌ నియమంబు
  లెల్లఁ దా నొప్పుచు, నింతి కొఱకు
  పుట్టిన శిశువుల పోగొట్టుకొనువేళ
  దుఃఖించుచుండెను. తుదకు నొక్క
  నాడడ్డె, వనితకనునయపురీతి తెలియ
  జెప్పెనిక దనదు చింతలన్ని

  గంగవీడెనాతని, బిడ్డ ఘనత తోడ
  చరిత నిలిపెను, తండ్రికి సత్యవతిని
  భార్య జేయగ భీష్మమౌ ప్రతిన జేసి
  మరణ సమయ నిర్ణయమను వరముఁ బొందె.

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శ్రీ హరి....మూర్తి గారూ! శుభాశీస్సులు. మీరు వ్రాసిన పద్యములు బాగున్నవి. గంగాదేవి కొంతకాలము వరకు భీష్ముని తనవద్దనే పెంచి పెద్దచేసిన పిదప శంతనునకు అప్పగించినది కదా. ఆ భావము మీ పద్యములో రాలేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగున్నది. కొన్ని సవరణలు అవసరము ఉన్నది.

  (1) మహరాజు : మహారాజు అనాలి కదా. భూపతి మొదలైన పదములు వేయవచ్చును.
  (2) నాడడ్డెతో మొదలైన పాదములో గణభంగము జరిగినది - అక్షరము ఎక్కువగ నున్నది దానితో బాటు యతి భంగము జరిగినది. సవరించండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. సవరించిన పద్యము.

  శంతనుడను రాజు చక్కటి చుక్కను
  తరళాక్షి గంగనుఁ దానుఁ జూచె
  కాంక్షతో నావుడు కఠినమౌ నియమంబు
  లెల్లఁ దా నొప్పుచు, నింతి కొఱకు
  పుట్టిన శిశువుల పోగొట్టుకొనువేళ
  దుఃఖించుచుండెను. తుదకు నొక్క
  నాడడ్డె, వనితకు నయపురీతి తెలియ
  జెప్పెనిక దనదు చింతలన్ని

  గంగవీడెనాతని, బిడ్డ ఘనత తోడ
  చరిత నిలిపెను, తండ్రికి సత్యవతిని
  భార్య జేయగ భీష్మమౌ ప్రతిన జేసి
  మరణ సమయ నిర్ణయమను వరముఁ బొందె.

  రిప్లయితొలగించండి
 7. కన్న బిడ్డల నీవు కఠినహృదయముతో
  పారవైచితె నీట పాడియగునె?
  మృదుకోమలంబగు సదమలమాతృమూ
  ర్తీమనస్తత్వంబదేమియయ్యె?
  ముద్దుమోములజూచి మురిపెంబు పొడసూప
  దఘమెంతజేసెనీయర్భకుండు?
  పసిబాలకులరక్ష బడయంగ జాలనే
  ప్రజలనేపగిదినేరక్షసేతు?

  సర్వసామంతులను గెల్చి యుర్వియందు
  యొక్కయబలకు బలియైతి నోవిధాత!
  కామమోహమ్ములకు పరాకాష్టమిదియె
  దారితెన్నులజూపించి ధైర్యమిడుము.

  రిప్లయితొలగించండి
 8. తనకు పుట్టిన బిడ్డను తానె గంగ
  నదిని వేయంగ వారించె నపుడు రాజు
  విడిచి వెళ్ళెను నియమము వీ డె నంచు
  శంతనుం డంత బ్రతిమాలె సత్య వతిని

  రిప్లయితొలగించండి
 9. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
  ఆర్యా!
  నమస్కారములు.
  పూర్వగాథాలహరిలో "భీష్ముడు గంగాశంతనుల యష్టమపుత్రుడు. వాని సోదరులవలె వానినిగూడ గంగాప్రవాహములో పడవేయకుండ శంతనుడు గంగను వారించి యామెను గూర్చి యప్రియంబులు పలికెను. గంగ యాపుత్రుని, భర్తను విడిచి వాని వృత్తాంతమును భర్తకెరింగించి చనియెను" అను వాక్యములను అనుసరించి ఈ విధముగా వ్రాసితిని. భారతం మూలం చదవక పోవటంతో జరిగిన పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదములు. క్షమించగలరు.

  రెండవ సీసంలో నాలుగవ పాదాన్ని ఈక్రింది విధంగా మార్చడంద్వారా జరిగిన పొరపాటును సవరించటానికి ప్రయత్నిస్తున్నాను.
  "ఏగుచుంటినటంచు నాగంగ యప్పుడే
  నిజనాథు ముందట నిలువకుండ
  చనెను".

  రిప్లయితొలగించండి
 10. అష్ట వసువుల శాపము నిష్ఠ గాను
  తొలగ జేయగ శిశువుల జలము నందు
  విడచి నంతనె శంతను డడ్డు పడగ
  అలిగి వెడలెను గంగమ్మ నాక మునకు !

  రిప్లయితొలగించండి
 11. శ్రీ సరస్వత్యై నమః :
  మిత్రులారా! అందరికీ శుభాభినందనలు.
  మీ పూరణలన్నీ అలరారు చున్నవి.
  (1) శ్రీ హ.వే.స.నా.మూర్తి గారు మంచి వర్ణనలతో రాణించుచున్న మీ ఖండిక అభినందనీయము.
  (2) శ్రీమతి లక్ష్మీదేవి గారు - మీ పద్యములు మంచి భావములతొ సరళ పదజాలముతో నుంటూ ప్రశంసనీయముగా నున్నవి.
  (3) శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: మీ రచన భావ పుష్టితో ఉత్తమముగా నున్నది.
  (4) శ్రీ సుబ్బా రావు గారు : మీ పద్యము బాగున్నది.
  (5) శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పద్యము బాగున్నది. కొద్ది మార్పులు అవసరము. 3, 4 పాదములను ఇలాగ సవరించుదాము:
  "విడుచు చుండగ వారించు విభుని వీడి
  యలిగి నాకమ్మునకు నేగె నమర గంగ"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి