8, జూన్ 2012, శుక్రవారం

పద్య రచన - 24

 కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

26 కామెంట్‌లు:

 1. గిరిజా తనయుడు వ్రాసిన
  పరమ పవిత్రమయినట్టి భారత కావ్యం
  బరయగ లోకపు రీతులు
  పఱిపఱి విధములు తెలియును పఠనము వలనన్.

  రిప్లయితొలగించండి
 2. లక్ష్మీదేవి గారూ,
  వెంటనే స్పందించి చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
  అయితే పద్యంలో ‘వ్యాసుని’ ప్రసక్తి లేదు. ‘భారత కావ్యం’... ‘వ్యాసుని కావ్యం...’ అయితే..?

  రిప్లయితొలగించండి
 3. వ్యాసుడు పలికిన గ్రంథము
  నాసక్తిగ వ్రాసినట్టి యద్భుత రీతిన్
  శాసించి తెలిపెదను నే
  నీసును విడచుచు పఠింపనెంచుదునికపై.

  రిప్లయితొలగించండి
 4. అందుకే గురువు గారు,
  రెండవ పూరణ చేశాను.
  ఇద్దరినీ స్మరిస్తూ ఇంకొక పూరణ చేస్తాను. అదే సరియైనది.
  మీ సవరణ చాలా బాగుంది.ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. రసనిర్భ రాశుధారా కవిత్వ ప్రవా
  హము వెల్వడుచు నుండ వ్యాసదేవు
  వక్త్రాంబుజము నుండి పంచమవేద సం
  భావ్యమౌ శ్రీమహాభారతమ్ము
  ఆశులేఖకునిగా నలరి సమర్థుడౌ
  కవిలోక మాన్యుండు గజముఖుండు
  తన దంతమును ఘంటమొనరించి చకచకా
  వ్రాసెనా కావ్యవర్యమ్ము నతుల
  శ్రద్ధతో పూర్తియయ్యె నా సంహితయును
  వేదవేదాంత విజ్ఞాన విలసితమ్ము
  సకల ధర్మ నిధానమై శాశ్వతముగ
  విశ్వవాఙ్మయ రాజమై వినుతికెక్కె

  రిప్లయితొలగించండి
 6. భారత గ్రంథమునిలలో
  ధారణ జేయింప నెంచి దయతో పలికెన్,
  ధీరతతోడను వ్యాసుడు;
  గౌరీ తనయుండు కూర్చ కావ్యము వెలిసెన్

  రిప్లయితొలగించండి
 7. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 08, 2012 7:53:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  పంచమవేదమున్ పలికె వ్యాసమహాముని తానె కృష్ణుడై
  కుంచము బట్టి వ్రాసె ఘనకోవిదుడైన గణేశ్వరుండు, ప్రా
  పంచిక భాషలందు కవి పండితులెల్లరు వ్యాప్తి జేయుచున్
  పంచిరి నీతి ధర్మములు పాయక లోకములందు వెల్గగాన్

  రిప్లయితొలగించండి
 8. గురువు గారికి
  వినయ మండిత నమస్కాములతో
  ----------
  పంచమ వేదము వ్యాసుడు
  కొంచెము తడవీయక బలుక,కూరిమితోడన్
  కుంచెను బట్టి గజానన
  బం చెను నీతిని జగతికి పాయసము వలెన్

  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీదేవి గారూ,
  ముందటి రెండు పద్యాలు, ఆ రెంటినీ సమన్వయిస్తూ మూడవపద్యం చాలా బాగున్నావి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ ‘గునుగు సీసపద్యం’ అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  చక్కని వృత్తం వ్రాసారు. అభినందనలు.
  ‘కుంచము’ అంటే తూములో నాల్గవభాగం. అక్కడ ‘కుంచియ’ అందాం (ఇదీ సరైన పదం కాకున్నా పరవాలేదు) లేక ఆ పాదాన్ని ఇలా సవరిద్దాం... ‘కొంచక గంటమూనె ఘనకోవిదుడైన...’
  *
  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. ‘కొంచెము తడ విడక’ అంటే సరి!
  మీరూ గంటాన్ని కుంచె అన్నారు...

  రిప్లయితొలగించండి
 10. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
  మీ ప్రశంసకు సంతోషము.

  విష్ణురూపుండు వ్యాసుండు వేగ జెప్ప
  విష్ణు నాముండు గణపతి వినుచు వ్రాసె
  కవి వరేణ్యులు భారత కావ్యమలర
  పరువుతీయదే ఘంటమ్ము సరసగతుల

  (లక్ష్యముగా ఇద్దరు కవివరేణ్యులు - వ్యాసుడు, గణపతి కనపడుచుండగా, వారిపై ఒక పద్యము చకచకా వ్రాయలేమా? స్వస్తి)

  రిప్లయితొలగించండి
 11. నా తేటగీతికి ఒక చిన్న సవరణ:

  గవయో రభేదః అనినచో పరువు = పరుగు అగును కానీ, పరువు తీయదే అన్నప్పుడు విపరీతార్థము వచ్చుచున్నది కాబట్టి, దానికి బదులుగా పరుగు తీయదే అని ఉపయోగించుటే సమంజసము. అలాగే పాదమును మార్చుదాము. పరుగు తీయదే ఘంటమ్ము సరసగతుల అని అందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకాన్ని విష్ణుస్తుతి అని వాదించేవారూ ఉన్నారు. ‘విష్ణు’ శబ్దానికి ‘సర్వవ్యాపకుడు’ అనే అర్థం ఉందీ, అందువల్ల గణేశునికీ వర్తిస్తుంది అంటే ఒప్పుకోరు.
  చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. పై బొమ్మ చూసినప్పుడల్లా నాకో అనుమానం వస్తుంది.పండితుల్ని ఎవరినైన అడిగినా చెప్పలేక పోయారు.వ్యాసుడు చెబుతూ వుంటే వినాయకుడు రాసేడని భారతంలో ఎక్కడా లేదు.తరవాత పుట్టిన కథ .అసలు రామాయణం, భారతంలో ఎక్కడా లేఖనం writing,and script ఉన్న దాఖలా లేదు.అవి మౌఖిక మైన కావ్యాలేనని చరిత్రకారులు అంటారు.తర్వాత ఎప్పుడో గ్రంథస్థం చేయబడినవి అంటారు.మన దేశంలో లిపి,వ్రాత ,ఎప్పుడు ప్రారంభమైనవి ?అశోకుడి శాసనాలముందు లిపి (ఆర్యులది)కనబడదు.సింధు నాగరకత లో కనిపించే లిపి అర్యేతర ( బహుశా ద్రావిడ లిపి )అంటారు.కాని దానిని ఇంతవరకు decipher చేయలేదు.ఈ గ్రూపులో పండితులు ఎవరైనా ఈ విషయం వివరిస్తారా ?

  రిప్లయితొలగించండి
 14. శ్రీ సరస్వత్యై నమః:
  అయ్యా! శ్రీ శంకరయ్యా గారూ! నమస్కారములు.
  శ్రీమహావిష్ణువు పీతాంబరధరుడు అని నీలవర్ణుడు అని వింటున్నాము. మరి శుక్లాంబరధరుడు, శశివర్ణుడు కదా ఈ శ్లోకములో చెప్పబడిన దేవుడు. ప్రయోజనము కూడా సర్వ విఘ్న ఉపశాంతి కొరకు కదా - అందుచేత ఇది విఘ్నేశ్వరునికే అన్నివిధాల వర్తిస్తుంది. ఏ దేవుని స్తోత్రము చేసినా "సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగఛ్ఛతి" అనే సూక్తి ఎలాగూ ఉన్నదే కదా!. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా డా. కమనీయం గారూ! నమస్కారములు.
  మీరు వెలువరించిన విషయములు బాగుగనే ఉన్నవి. నా ఉద్దేశములో పౌరాణిక విషయాలకు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు ముడి పెట్ట కూడదు అని. పౌరాణిక విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటి వాటి ప్రమాణాల ద్వారానే చర్చించాలి కదా. ఇంతకూ నాకు శ్రుత పాండిత్యమే కాని, లోతుగా ఏ విషయాలు తెలియవు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. గురువుగారూ మీరన్నట్లు " శుక్లాంబరధరం.......... " శ్లోకం విష్ణు స్తుతికి సరిపోయినా ప్రసన్నో మత్తవారణ: అని నిఘంటువులు చెపుతున్నాయి అందువల్ల అది వినాయక స్తుతి అవుతుంది అని విఙ్ఞులు చెప్పగా విన్నాను.

  రిప్లయితొలగించండి
 17. వేద వ్యాసుని నోట వెల్వడగ వాగ్వేదామృతాబ్ధీ మహా
  నాదంబంతట ఘంటమూని వడిగా నానార్థ ధర్మమ్ములన్
  మోదంబొప్పగ నింపి భారత మహా పుణ్యేతి హాసమ్ము నా
  మోదంబై చన నెల్ల వేళల నుమాపుత్రుండు కైసేయడే!

  రిప్లయితొలగించండి
 18. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయమే. అయితే 1,4 పాదాలలో గణదోషం, 2,4 పాదాల్లో యతిదోషం. జ్వరపీడితుడను.. సవరించే ఓపిక ప్రస్తుతానికి లేదు. రేపు ఉదయం సవరిస్తాను.
  *
  మిస్సన్న గారూ,
  అద్భుతమైన శార్దూలం చెప్పి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. అయ్యో ! అంత జ్వరంతో ఉండి ఇప్పుడు సవరణ చేయడం ఎందుకు ? విశ్రాంతి తీసుకో వచ్చును కదా !

  రిప్లయితొలగించండి
 20. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 08, 2012 11:35:00 PM

  గురువుగారూ మన్నింప ప్రార్థన.
  కుంచము అంటే కలము అని అనుకొని వ్రాసినాను. మీసవరణకు దన్యవాదములు.
  కొంచము మార్పుతో సవరించిన పద్యమును పరిశీలింప మనవి.

  పంచమవేదమున్ పలికె వ్యాసమహాముని తానె కృష్ణుడై
  గాంచగ వ్రాసె వేగముగ గౌరి కుమారుడు విఘ్నరాజు, ప్రా
  పంచిక భాషలందు కవి పండితులెల్లరు వ్యాప్తి జేయుచున్
  పంచిరి నీతి ధర్మములు పాయక లోకములందు వెల్గగాన్

  రిప్లయితొలగించండి
 21. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 08, 2012 11:47:00 PM

  గురువర్యులు శ్రీ పండిత నేమాని గారి పద్యములు, శ్రీ మిస్సన్న గారి పద్యములు ఆణిముత్యములై ప్రాకాశిస్తున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. భారత కావ్యా మృతమును
  వారణ ముఖుడగు గణపతి వ్యాసుడు కోరన్ !
  నేరుగ రచియించ దలచె
  నారద ముని ముఖ్యు లంత నాహా యనగా !

  రిప్లయితొలగించండి
 23. మిస్సన్న గారు,
  ఆహా! కైసేయడే! అని చెప్పి మనోహరమైన శార్దూలాన్ని అందించారు.

  రిప్లయితొలగించండి