1, జూన్ 2012, శుక్రవారం

విశేష వృత్తము - 19

వంశస్థము -
ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1382వ వృత్తము.

లక్షణములు:
గణములు - జ త జ ర 
యతి స్థానము - 8వ అక్షరము 
ప్రాస నియమము కలదు.

ఉదా:
సరస్వతీ! భారతి! సద్గతిప్రదా!
సరోజపాణీ! విలసత్ కళామయీ!
విరించి జిహ్వాలయ! వేద సంస్తుతా!
స్మరింతు నీ తత్త్వము జ్ఞానరూపిణీ!

గమనించారా ... ఇంద్రవంశలోని తొలి గురువును లఘువుగా మార్చితే వంశస్థ మగును.  దీనినీ ప్రయత్నించండి.  శుభం భూయాత్.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

8 కామెంట్‌లు:

 1. మా బండింకా ఆలస్యంగానే నడుస్తోంది.


  ఇంద్రవ్రజ
  శ్రీ మాత రా వేగమె శ్రీల నీవే
  కామారి ధర్మాంగన గౌరి నీవే
  మేమెల్ల నీ భక్తులమే భవానీ
  సేమంబుగా నేలను చింత యేమీ.

  ఉపేంద్రవ్రజ
  సురాసురారాధిత శూల పాణీ
  సురాపగా సోమ సుశోభితాంగా
  పురారి భోగీంద్ర విభూష శంభూ
  మురారి బ్రహ్మార్చిత పుణ్య పాదా

  ఇంద్రవంశ
  వందారు బృందారక వంద్య పాహిమాం
  నందాత్మజా దైత్య వినాశ పాహిమాం
  ఇందుస్మితాస్యా ధరణీశ పాహిమాం
  వందే ముకుందా నరపాల పాహిమాం
  .

  రిప్లయితొలగించండి
 2. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యాలు చాలా ధార శుద్ధితో నున్నవి. సంతోషము. అభినందనలు. పద్యాలకు పేరులు తప్పు వ్రాసేరు చూడ,డి.

  (1) ఇంద్రవజ్ర (ఒప్పు) .. ఇంద్రవ్రజ కాదు
  (2) ఉపేంద్ర వజ్ర (ఒప్పు) .. ఉపేంద్ర వ్రజ కాదు

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. పరోపకారంబున భాగ్యసంతతుల్
  చిరాయురారోగ్యపు సిద్ధులెల్లెడన్
  మరిన్ని సౌఖ్యంబులు మాన్యదీప్తులున్
  నిరంతరం బందుట నిక్క మీ భువిన్. 1.

  జలంబులం గూర్చును సర్వదా నదుల్
  ఫలంబులందించును భవ్యవృక్షముల్
  చలించకన్ గోవులు సాధు దుగ్ధముల్
  నిలింపులై యిచ్చును నిత్య మీ భువిన్. 2.

  శరీరమందించుట, శక్తియుక్తులన్
  పరాత్పరుం డా భగవానుడిచ్చుటల్
  పరోపకారార్థమె, స్వార్థదూరులై
  కరంబు దీనార్తులఁ గావగా వలెన్. 3.

  రిప్లయితొలగించండి
 4. కలమ్ము చేఁబట్టిన గాథ వెల్వడున్
  హలమ్ము చేఁబట్టిన నన్నమున్, సదా
  బలమ్ము విశ్వాసము, భక్తియున్ మనో
  బలమ్మొసంగున్, నిరపాయరీతులన్.

  సత్యనారాయణమూర్తిగారు,
  పరోపకారం గురించి చక్కగా చెప్పారు.
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. నేమాని పండితార్యా ధన్యవాదములు. పేర్లు తప్పుగా వ్రాసినందుకు క్షమించండి.

  రిప్లయితొలగించండి
 6. నరుండ నే బద్ధుడ నాదు కర్మలన్
  దురూహలై ధర్మము తోపకుండుటన్
  సరైన మార్గమ్మున సాగకుంటినే
  ధరా ధరేంద్రాత్మజ దారి జూపవే

  రిప్లయితొలగించండి
 7. శ్రీ సరస్వత్యై నమః :
  అందరికీ శుభాభినందనలు.
  ఈనాటి అభ్యాసము చాల బాగున్నది.

  1. శ్రీ మిస్సన్న గారు 4 పద్యములను విరచించేరు. 3వ పద్యమును సంస్కృతములో ప్రయత్నించేరు. శ్రీమాత మీద 2, శివుని మీద ఒకటి, ముకుందుని మీద ఒకటి - చాల చక్కటి భావములతో బాగున్నవి. ప్రశంసించదగినవి.

  2. శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు : 3 పద్యాలను మంచి నీతులతో ముంచెత్తేరు. ఉత్తమముగా నున్నవి.

  3. శ్రీమతి లక్ష్మీదేవి గారు : కలము, బలము, మనోబలములతో చాలా అద్భుతముగా వ్రాసేరు.

  అందరికీ మరొకమారు అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి