14, జూన్ 2012, గురువారం

సమస్యాపూరణం - 735 (పాలిమ్మని సుతుని)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. మాస్టారూ,
    ఈ రోజు సమస్య చూస్తే నా చిన్ననాట జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. నిజంగానే ఒకరోజు మా పక్కింటి మొగుడూ పెళ్ళాలు వాదులాడుకొని, ఆ రాత్రి చిన్నపిల్ల "అమ్మా, పాలుకావాలని" అడిగితే, "అది కూడా మీ నాన్నే ఇస్తాడు పో" అన్నది. అది చెప్పుకొని మేము చాలా కాలం నవ్వుకొనే వాళ్ళం. ఇప్పుడు ఆ చిన్నపిల్లే అమ్ముమ్మ కూడా అయిందట.

    రిప్లయితొలగించండి
  2. ఆలుమగ లలిగె, యాకలి
    కాలిన బిడ్డ యడిగెనట కాసిని పాలన్
    తాలిమి లేక తలి కసిరె
    “పాలిమ్మని” సుతుని భర్త పాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  3. కాలస్తులైన పెద్దల
    మూలైశ్వర్యంబులోని మూడవవంతే
    చాలని సంధినొసగి తగు
    పాలిమ్మని సుతుని భర్తపాలికి బంపెన్

    రిప్లయితొలగించండి
  4. కాలము పరకాంతలతో
    జాల గడుపుయెడ భరింప జాలక పతినిన్
    చాలిక నాస్తిని నా సగ
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  5. కాలము పరకాంతలతో
    జాల గడుపుయెడ భరింప జాలక పతినిన్
    చాలిక నాస్తినిఁ దన సగ
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  6. ఫాలాక్షుని యభిషేకపు
    పాలను సేవించునెడ సుఫలమిడు ననుచున్
    మేలైన తలపుతో సతి
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్

    రిప్లయితొలగించండి
  7. పాలను బోయగ పుట్టను
    మాలక్కతొ బోవు చుంటి మనవాడికిదో
    పాలను హార్లిక్స్ కలుపుచు
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  8. బాలుడు నేడువ సాగెను
    పాలిమ్మని , సుతుని భర్త పాలికి బంపెన్
    బాలకు సొమ్ములు దెమ్మని
    మాలతి దా జెప్పె నపుడు పరుగున రారా .

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పూరణ....

    బాలకులు పాఠశాలకు
    గోలలు సేయుచునుఁ బోవ గొబ్బునఁ దానున్
    దోలఁగ మఱి పలకా బల
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  10. మేలగు బడిలో( జేర్చిన
    కాలానుగుణంపు పోటి( గానక( దిరుగన్
    కూలీ బ్రతుకే సరి,గున
    పాలిమ్మని సుతుని భర్త పాలికి( బంపెన్!

    రిప్లయితొలగించండి
  11. నా పూరణలో మొదటి పాదానికి సవరణ:

    మేలిమి బడిలో జేర్చిన,

    రిప్లయితొలగించండి
  12. చాలించుము పరిహాసము
    స్త్రీలందరు పురుషు లవగ చిం తేమి టిలన్ !
    లాలన పోషణ మీదిక
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్ !

    రిప్లయితొలగించండి
  13. చాలును మీ పరిహాసము
    స్త్రీలే యిక పురుషులవగ చింతే మిటికన్ !
    లాలన పోషణ మీదిక
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్ !

    క్షమించాలి మొదటి పద్యానికి " ప్రాస సరిగా లేదేమో " అని మళ్ళీ వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  14. కాలము దైవ స్వరూపము
    చాలదు పూజించి తరించ జన్మాంతమునన్ !
    వీలైన పున్నెమం దున సగ
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్ !

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా!
    ఈనాటి పూరణలలో కొంత కొంత వైవిధ్యము కనిపించుచున్నది. అందరికీ అభినందనలు.
    (1) శ్రీ చంద్రశేఖర్ గారు: మీదే ప్రథమ తాంబూలము. అలిగిన ఆ ఆలికి ఇవ్వండి ఆ తాంబూలము. చాల బాగున్నది మీ పూరణ. పద్యము ఉత్తమముగా నున్నది.
    (2) శ్రీ చంద్రమౌళి గారు: బాగున్నది మీ పూరణ. 3వ వంతు ఆస్తికై భర్తకు ఆలి పంపిన రాయబారము. భావము ప్రశంసనీయముగా నున్నది.
    (3) శ్రీమతి లక్ష్మీదేవి గారు: మీ పూరణ చాల బాగున్నది. పరస్త్రీ లోలుడైన భర్తనుండి ఆస్తిలో సగపాలిమ్మనిది భార్య. ఉత్తమముగా నున్నది.
    (4) శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: పుట్టలో పాలు పోయడానికి వెళ్తూ భర్తకి పని అప్ప చెప్పినది భార్య. చాలా బాగున్నది. ప్రశంసనీయము అయిన భావము.
    (5) శ్రీ గుండు మధుసూదన్ గారు: పిల్లడికి బడికి వెళ్ళడానికి పలక బలపాలిమ్మన్నది ఆ ఇల్లాలు. సొగసైన భావము.
    (6) శ్రీ సహదేవుడు గారు: మీ పూరణ కూడా ప్రశంసనీయము గా నున్నది. బడిలో పిల్లలను చేర్చుటలో పోటీలు - కూలీల పాట్లు వర్ణించేరు.
    (7) శ్రీమతి రాజేశ్వరి గారి 2 పూరణలు చాల బాగున్నాయి. 2వ పద్యములో 2, 3 పాదములలో గణభంగము జరిగినది. ఇలా సవరించాలి:
    --2వ పాదములో చాలదు పూజించి కి బదులుగా -- "చాలదు పూజయు" అందాము.
    --3వ పాదములో: వీలైన పున్నెమందున కి బదులుగా : "వీలైన పున్నమున సగ" అని అందాము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇంకా నా ఆరోగ్యం కుదుట పడలేదు. అందువల్ల పద్యరచన శీర్షికను కొససాగించలేక పోతున్నాను. మీ పూరణలను విశ్లేషించలేకపోతున్నాను.
    *
    పండిత నేమాని వారూ,
    నా అశక్తతను గమనించి మిత్రుల పూరణలను విశ్లేషించినందుకు అనేక వందనాలు. మీ తోడ్పాటు నాకు మనోధైర్యాన్ని ఇస్తున్నది. ధన్యవాదాలు.
    అభిషేకక్షీరం కోస కొడుకును భర్త దగ్గరికి పంపిన భార్యను గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    నేమాని వారినుండి ప్రథమతాంబూలం అందుకున్న అదృష్టం మీది! అభినందనలు.
    మొదటి పాదాన్ని ‘ఆలుమగ లలుగ నాకలి’ అంటే బాగుంటుందేమో?
    మూడవ పాదం కొద్దిగా కుంటుతున్నట్లు అనిపించింది. దానిని ‘తాలిమి సెడి తల్లి కసిరె’ అంటే ఎలా ఉంటుంది?
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘కాలస్తులు’ అంటే అర్థం కాలేదు. ‘సంధి నొసగి’ అన్నచోట ‘సంధి పొసగ’ అంటే ఇంకా బాగుంటుందని నా సూచన.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఆస్తిలో సగపాలిమ్మన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘గడుపు యెడ’ అన్నచోట ‘గడుపు నెడ’ అని ఉండాలి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘తొ’ ప్రయోగం చేసారు. అక్కడ ‘మాలతితో బోవుచుంటి’ అంటే సరి!
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    చివరి పాదంలో యతి తప్పింది. ‘మాలతి దా జెప్పె నపుడు మసలక రారా’ అందాం.
    *
    గుండు మధుసూదన గారూ,
    బలపాలిమ్మన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘ప్రాస’ తప్పలేదు కదా! ఎందుకు మార్చారు?
    రెండవ పూరణ గణదోషాల గురించి నేమాని వారి సూచనలను గమనించారు కదా!

    రిప్లయితొలగించండి
  17. నాలుక పెదవులు పూచెను
    మేలైనది నాటు వైద్య మేనాడైనన్
    చాలిక తురుముట, కొబ్బరి
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్

    రిప్లయితొలగించండి