30, సెప్టెంబర్ 2014, మంగళవారం

దత్తపది - 46 (కాకి-కోయిల-బాతు-నెమలి)

కవిమిత్రులారా!
కాకి - కోయిల - బాతు - నెమలి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(నెమిలి సరియైన రూపం. శబ్దరత్నాకరం ‘నెమలియని వాడుచున్నారు గాని దానికిఁదగిన ప్రయోగము కనఁబడలేదు’ అని చెప్పింది. దత్తపదిలో ‘నెమలి’నే ప్రయోగించండి.)

పద్యరచన - 692

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 97


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      ఖలు మకరాక్షునిన్ (మడిపె గద్దఱియై కడుమాను వీఁక) వీ
రు లలర రాముఁడున్ (గురువరుండును శూరుఁడు ఘోరుఁ డౌచు) దా
య లెనయ భీతి వా(వి రటు నాదట గూల్చెను వీక శత్రు)లం
జెలగుచుఁ గీశులున్, (ద్రుపదసింహము సూర్యుసుతుండు చూడ)గన్. (౧౧౨)

భారతము-
గీ.         మడిపె గద్దఱియై కడుమాను వీఁక
గురువరుండును శూరుఁడు ఘోరుఁ డౌచు
విరటు నాదట గూల్చెను వీక శత్రు
ద్రుపదసింహము సూర్యుసుతుండు చూడ. (౧౧౨)

టీక- గురువరుండును = (రా) గొప్పశ్రేష్ఠుఁడు, (భా) ద్రోణుఁడు; (రా) వావిరి = అటున్; (భా) విరటు = విరాటరాజును; ద్రుపదసింహము - (రా) వానరశ్రేష్ఠుఁడు, (భా) ద్రుపదునిన్, సూర్యసుతుఁడు = (రా) సుగ్రీవుఁడు, (భా) కర్ణుఁడు; మాను = ఒప్పు; దాయలు = శత్రువులు.

29, సెప్టెంబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం – 1525 (బ్రహ్మ కడిగిన పాదమున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బ్రహ్మ కడిగిన పాదమున్ బట్టరాదు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 691

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 96


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.        మించి రాముని నా య(మిత్రు ధృతిని మూసి
మీఱెను హరిచక్ర) మారు రహిఁ గ
పుల నొంచె బ్రహ్మాస్త్ర(మునఁ బరువడి మోద
మెనయ సంధ)వథి కేభభటులు;
ఘననాదుఁ డేగె, బావని దెచ్చె ద్రోణాద్రి;
మొన మంచె; దానిస్థలి నగ ముంచె;
దనుజులు రేఁగులఁ దంగేళ్లుగాఁ ద్రొక్కఁ
గపులు గాలిచె లంక; గంపనుఁడు మె
గీ.         ఱయఁ జదిపె వాలిభ(వుఁడు విజయుఁడు వానిఁ;
గెడపె వైరి ఘటోత్క)చిత్తుఁడగు కుంభు
బేరజంబును నీ(చున్ రవిజుఁ; డడంచె
జోక శక్తి) నికుంభుఁడన్ సోకు హనుమ. (౧౧౧)

భారతము-
ఆ.        మిత్రు ధృతిని మూసి మీఱెను హరిచక్ర
మునఁ బరువడి మోద మెనయ సైంధ
వుఁడు; విజయుఁడు వానిఁ గెడపె; వైరి ఘటోత్క
చున్ రవిజుఁ డడంచె జోక శక్తి. (౧౧౧)

టీక- (రా) అమిత్రు = విరోధియొక్క, (భా) మిత్రున్ = సూర్యుని; హరిచక్రము = కపులగుంపు, (భా) హరి = కృష్ణుఁడు, చక్రమున = సుదర్శనచక్రమున; వాలిభవుఁడు = (రా) అంగదుఁడు; విజయుఁడు= (రా) జయశీలుఁడు, (రా) వైరి = శత్రువుల, ఘట = గుంపునందు, ఉత్క = ఉత్సాహముగల, చిత్తుఁడు = మనస్సుగలవాఁడు; (భా) వైరిన్, ఘటోత్కచున్; శక్తిన్ = (రా) బలముచేత, (భా) శక్తియను నాయుధముచేత, ఆరురహి = ఒప్పుచున్న ప్రీతితో, బేరజము = కుత్సితుఁడు, జోక = ఉత్సాహము, సోకు = రాక్షసుని, సైంధవ = (రా) గుఱ్ఱము.

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

న్యస్తాక్షరి - 7

అంశం- దుర్గాదేవీస్తుతి.
ఛందస్సు- తేటగీతి.
ప్రథమపాదం ద్వితీయగణాద్యక్షరం ‘దు’, 
ద్వితీయపాదం తృతీయగణాద్యక్షరం ‘ర్గ’,(కావాలనే హ్రస్వంగా ఇచ్చాను)
తృతీయపాదం చతుర్థగణాద్యక్షరం ‘దే’, 
చతుర్థపాదం పంచమగణాద్యక్షరం ‘వి’.

పద్యరచన - 690

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 95


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.         (కరము మిగిలి కారములను మిరియములను
నూఱె హితులు మెచ్చ గరిమనున్) బెనఁగఁగ
(హరులు దగఁ బూనఁ దోలె నరిరమణ దన
చేవ మెఱయ ఱేకును మడఁచెన్) మిగులను. (౧౧౦)

భారతము-
కం.       కరము మిగిలి కారములను
మిరియములను నూఱె హితులు మెచ్చ గరిమనున్
హరులు దగఁ బూనఁ దోలె న
రిరమణ దన చేవ మెఱయ ఱేకును మడఁచెన్. (౧౧౦)
టీక- హరులు = (రా) కపులు, (భా) గుఱ్ఱములు; తగన్ = (రా) తగినట్లు, దగ = (భా) దప్పిని; ఱేకుమడచుట = తగ్గించుట.

27, సెప్టెంబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1524 (వెంటఁబడి చంపువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వెంటఁబడి చంపువాఁడె పో ప్రియసఖుండు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 689

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 94


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
ఉ.        ఆరసి తండ్రినిన్ (శపథ మాపృథువీరుఁడు సల్పె సింధు)గం
భీరుని భూమిజా(విభుని భీమబలాఢ్యుని బిద్దఁజేయఁ) దా
ఘోరుఁడు భాజిత(ద్యుమణి గ్రుంకక యుగ్రతనొప్ప, దూఱ)రే
వైరినిఁ దా శర(స్ఫురితవహ్నిని జంపనిచో నటంచు)నున్. (౧౦౯)
భారతము-
గీ.         శపథ మాపృథువీరుఁడు సల్పె సింధు
విభుని భీమబలాఢ్యుని బిద్దఁజేయ
ద్యుమణి గ్రుంకక యుగ్రతనొప్ప, దూఱ
స్ఫురితవహ్నిని జంపనిచో నటంచు. (౧౦౯)
టీక- (రా) సింధు = సముద్రపు; భూమిజావిభుని = సీతమగనిన్; బిద్దఁజేయన్ = చంపుటకు; భా = కాంతివలన; జిత = గెలువబడిన; ద్యుమణి = సూర్యుఁడుగలవాఁడు; క్రుంకక = చావక; దూఱరే = తిట్టరా; (భా) సింధువిభుని = సైంధవుని; దూఱన్ = చొచ్చుటకు; పృథు = గొప్ప.

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 11

అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 688

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 93

రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.         (తనయుమరణంబునకు లలిగనుఁ బొగిలెఁ ద
నుఁ గడుఁ దేర్పగా స్వజనులునున్), ధృతిజిత
(ఘనబలితజిష్ణుఁ డెవ్వఁడు వనటనుఁ గలి
గించె వానిపై నెద నలిగెన్) మఱియును. (౧౦౮)

భారతము-
కం.       తనయుమరణంబునకు లలి
గనుఁ బొగిలెఁ దను గడుఁ దేర్పగా స్వజనులునున్
ఘనబలితజిష్ణుఁ డెవ్వఁడు
వనటనుఁ గలిగించె వానిపై నెద నలిగెన్. (౧౦౮)

టీక- జితఘనబలితజిష్ణుఁడు = (రా) గెలువబడిన గొప్పబలముగల దేవేంద్రుఁడు గలవాఁడు (ఇంద్రజిత్తు), (భా) జిష్ణుఁడు = అర్జునుఁడు; లలి = ఎక్కువ.

25, సెప్టెంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1523 (ఈతాకుల గుడిసెలోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 687

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 92


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.        హరులఁ జెవుల పట్టి యాడించె రవిజుచే
ముక్కు గోల్పడె; వచ్చి పోరెఁ బోలి
నిండుచెర్వుఁ గలంచు (దండిగజము, గూడి
కొండగతి భగద)క్షుండు మేటి
ఘోరశరీరుండు కుంభకర్ణుండు మ
(త్తుఁడు నరవరుచేతఁ బడె; బలుఁ డభి)
మానియు వీరుండు (మన్యుఁడు రిపులోక
మహితపద్మవ్యూహ)మదకరియయి
గీ.         తనరు దేవాంతకుని నరాంతకుని హనుమ
యును ఋషభుఁడు మహాపార్శ్వుని నడచి రతి
కాయుఁడు గురుయుద్ధ(ముననఁ గాల మొనరి
చెను బెనఁగుచు) లక్ష్మణుచేత; దనుజవిభుఁడు. (౧౦౭)

భారతము-
ఆ.        దండిగజముఁ గూడి కొండగతి భగద
త్తుఁడు నరవరుచేతఁ బడె, బలుఁ డభి
మన్యుఁడు రిపులోక మహిత పద్మవ్యూహ
ముననుఁ గాల మొనరిచెను బెనఁగుచు. (౧౦౭)

టీక- హరుల = (రా) కపులను; (రా) భగ = శక్తియందు; దక్షుండు = ప్రవీణుఁడు; నరవరుచేత = (రా) రామునిచేత, (భా) అర్జునునిచేత; మన్యుఁడు = (రా) కోపి; (రా) పద్మవ్యూహ = తామరగుంపునకు (రామాయణమున క్రింది పద్యమునకు కన్వయము)

24, సెప్టెంబర్ 2014, బుధవారం

దత్తపది - 45 (తల)

కవిమిత్రులారా!
‘తల’ను నాలుగుపాదాలలో ఉపయోగిస్తూ
పూలతోటను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 686

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 91


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.        అని యయ్యె వెండిఁ, బావనియు ధూమ్రాక్షు న
కంపనుఁ జంపె, నంగదుఁ డడఁచె మ
హాకాయుఁ, గెడపె బ్రహస్తు నీలుం, డంత
వినఁబోక మండోదరినుడు లక్షు
(గురుఁడు ప్రతినఁ బట్టెఁ బరఁగు యుధిష్ఠిరు)
శ్రీరాఘవునిఁ జంపి సీతఁ జెట్టఁ
(బట్టఁ, గుట్ట కొకఁడు చెట్టున కొకఁ డైరి
పరులు నారయ నడుప గురుసేన)
గీ.         దనుజబలము నాతఁడు, మించె హనుమ నీలు,
శక్తి లక్ష్మణు నొంప దాశరథ దోలె,
నిద్ర లేపఁగ బల్మియు నీతుల ఘట
(కర్ణుఁడు వెడలె ధృతిగనుఁ గలనికి) వెస. (౧౦౬)

భారతము-
ఆ.        గురుఁడు ప్రతినఁ బట్టెఁ బరఁగు యుధిష్ఠిరుఁ
బట్టఁ, గుట్ట కొకఁడు చెట్టున కొకఁ డైరి
పరులు నారయ నడుప గురుసేన
కర్ణుఁడు వెడలె ధృతిగనుఁ గలనికి.

టీక- అక్షుగురుఁడు = (రా) అక్షకుమారుని తండ్రి (రావణుఁడు), (భా) గురుఁడు = ద్రోణుఁడు; యుధిష్ఠిరు = (రా) యుద్ధమందు స్థిరమగువానిని, గురుసేన = (రా) గొప్పసేన, కురుసేన = (భా) కౌరవసేన; పరులు = విరోధులు; ఘటకర్ణుఁడు = కుంభకర్ణుఁడు; కలనికి = యుద్ధమునకు.

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1522 (అన్నము సున్నం బయె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అన్నము సున్నం బయె వదినమ్మలు వండన్.
ఈ సమస్యను సూచించిన ‘పరాక్రి’ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 685

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 90


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      నవ(రమ దోప వైరిజననాశముఁ జేయుచు శత్రు భీష్ము స
ద్బ్రవరు శిఖం)డిరౌతు సరి రాముని లక్షణుఁ గీశులన్ ఘనం
బు వ(డి మఱుంగుగా మహిని మోదముతోఁ బడ నేసి యేగెఁ దా
ను విజయుఁడున్) జితేంద్రుఁడును నొంచె ఖగేంద్రుఁడు పాపతూపులన్. (౧౦౫)

భారతము-
కం.       రమ దోప వైరిజననా
శముఁ జేయుచు శత్రు భీష్ము సద్బ్రవరు శిఖం
డి మఱుంగుగా మహిని మో
దముతోఁ బడ నేసి యేగెఁ దాను విజయుఁడున్. (౧౦౫)

టీక- (రా) శత్రుభీష్మ = శత్రువులకు భయంకరుని, (భా) శత్రున్ = విరోధియగు; భీష్ముని; (రా) శిఖండి = నెమలి, రౌతు = వాహనముగాఁ గలవానికి (కుమారస్వామికి); సరి = (రా) జయశీలుఁడు; జితేంద్రుఁడు = గెలువబడిన యింద్రుఁడు గలవాఁడు (ఇంద్రజిత్తు); పాపతూపులన్ = నాగబాణములను.

22, సెప్టెంబర్ 2014, సోమవారం

న్యస్తాక్షరి -6

అంశం- కాకిగోల
ఛందస్సు- కందము
నాలుగు పాదాల చివరి అక్షరాలుగా వరుసగా కా - కీ - కే - కై ఉండాలి.

పద్యరచన - 684

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము – 89



రావిపాటి లక్ష్మినారాయణ

సీ.         తనయున్కి గననీక తమములఁ గప్పి రా
క్షసుఁ డట్లు మించ, నగ్రజుని శత్రు
(భీష్ముకడకు నేగెఁ బ్రీతి యుధిష్ఠురుం)
డగు లక్ష్మణుఁ, డతని కాజితరిపుఁ
(డధికభక్తి నెఱఁగె, నడిగె దాను) విరోధి
పురమును బ్రహ్మాస్త్రము వలనను ద
హింప నాజ్ఞ నిడ, వాఁ డెందు నున్ననుఁ జెల్లు
నటులైన ననె, రాముఁ డంటివి కడు
తే.        సరిగ (జయము నొందుగతి, నిజమ, రణపు వె
రవు) సునీతి బాహ్య మొక యరాతికొఱకుఁ
గూల్ప సర్వస్వ, మిత్తెఱఁగు వల దెందు
ననుచు (న్యాయబుద్ధిఁ బలుక నతఁడు సనియె.) (౧౦౪)

భారతము-
ఆ.        భీష్ముకడకు నేగెఁ బ్రీతి యుధిష్ఠురుం
డధికభక్తి నెఱఁగె, నడిగె దాను
జయము నొందుగతి, నిజమ, రణపు వెరవు
న్యాయబుద్ధిఁ బలుక నతఁడు సనియె. (౧౦౪)

టీక- యుధిష్థిరుండు = (రా) యుద్ధమున స్థిరమగువాఁడు; ఎఱఁగె = నమస్కరించె; (రా) నిజమ; రణపువెరవు = యుద్ధమార్గము; (భా) నిజ = తనయొక్క; మరణపువెరపు = చావునకు దారి; తమము = చీకటి.

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1521 (తల్లికి ముక్కు కోసి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 683

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము – 88


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.   బిరుదగు నింద్రజిద్(బలుఁడు భీష్ముఁడు వైరుల వాసిరీతి)గా
మురువగునట్టి నా(గశరముల్ నిగుడించుచు గాసిపెట్టి) సం
గరమున వేడ్కతో (మురియఁగా, హరిచక్రము పూనె, జిష్ణు)జి
ద్వరకృతి దోల నా(కతనఁ దా మరలెన్ వృథగాగ పూన్కి)యున్. (౧౦౩)

భారతము-
గీ.      బలుఁడు భీష్ముఁడు వైరుల వాసిరీతి
గశరముల్ నిగుడించుచు గాసిపెట్టి
మురియఁగా హరిచక్రము పూనె, జిష్ణు
కతనఁ దా మరలెన్ వృథగాగ పూన్కి. (౧౦౪)

టీక- భీష్ముఁడు = (రా) ఘోరుఁడు; నాగశరముల్ = పాము బాణములను; హరిచక్రము = క్రోతులగుంపు; జిష్ణుజిత్ = ఇంద్రజిత్తు; (భా) హరి = కృష్ణుఁడు; చక్రము = సుదర్శనచక్రమును; మురువు = అందము; గాసి = బాధ; కతన = కారణమున.

20, సెప్టెంబర్ 2014, శనివారం

నిషిద్ధాక్షరి - 10

శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని గురించి 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 682 (నదీతీరము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“నదీతీరము”

నిర్వచన భారత గర్భ రామాయణము – 87


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.         (అని విజయరక్షకై హరుల నడపి పురు
షోత్తముఁడు చెలంగెఁ బెనఁగి రొప్పి నరవ
రుఁడు రణకృతిపావని దస్రరుహులు మిగులు
ద్రుపదముఖ్యులునున్) లక్ష్మణపృథుబలుఁడు. (౧౦౨)

భారతము-
కం.       అని విజయరక్షకై హరు
ల నడపి పురుషోత్తముఁడు చెలంగెఁ బెనఁగి రొ
ప్పి నరవరుఁడు రణకృతిపా
వని దస్రరుహులు మిగులు ద్రుపదముఖ్యులునున్. (౧౦౨)

టీక- అనిన్ = యుద్ధమందు; విజయరక్షకై = (రా) జయమును సాధించు నిమిత్తమై, (భా) అర్జునుని రక్షణకొఱకు; హరుల = (రా) కపులను, (భా) గుఱ్ఱములను; పురుషోత్తముఁడు =  (రా) రాముఁడు, (భా) కృష్ణుఁడు; రణకృతి = (రెంటికి) రణమందు నేర్పరియగు; పావని = (రా) హనుమంతుఁడు, (భా) భీముఁడు; దస్రరుహులు = అశ్వినుల కుమారులు (రా) మైందద్వివిదులు, (భా) నకులసహదేవులు; మిగులు = (రా) శేషించిన, (భా) హెచ్చయిన; ద్రుపదముఖ్యులు- (రా) ద్రు = వృక్షమును, పద = స్థానముగాఁ గలిగినవారిలో (కపులలో) ముఖ్యులు = శ్రేష్ఠులు, (భా) ద్రుపదుడు మొదలగువారు.

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1520 (గుడి కేగుట మేలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గుడి కేగుట మేలు కల్లు గొని భక్తులకున్.

పద్యరచన - 681 (ఓటమి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఓటమి”

నిర్వచన భారత గర్భ రామాయణము – 86


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.     (దురపుభువి, రక్తమె జలము, కరము శవము
లె లహరిఁ జను కట్టెలు, మెదడే) తెలియగు
(నురు, గెముకలె చేఁపలు, పొలె బురద, కచమె
నాచుగఁ, బొలుపుం గనె నదినాన్) మఱియును. (౧౦౧)

భారతము-
కం.   దురపుభువి, రక్తమె జలము,
కరము శవములె లహరిఁ జను కట్టెలు, మెదడే
నురు, గెముకలె చేఁపలు, పొలె
బురద, కచమె నాచుగఁ, బొలుపుం గనె నదినాన్.

టీక- (రెంటికి) లహరిన్ = ప్రవాహామందు; పొల = మాంసము; కచము = వెండ్రుకలు; దురపుభువి = యుద్ధభూమి.

18, సెప్టెంబర్ 2014, గురువారం

దత్తపది - 44 (అల-కల-తల-వల)

కవిమిత్రులారా!
అల - కల - తల - వల
పై పదాలను ఉపయోగిస్తూ
రావణుని చెరలో సీత మనోగతాన్ని తెలుపుతూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 680 (నలుపు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“నలుపు”

నిర్వచన భారత గర్భ రామాయణము – 85


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.      (చెడెఁ గరులు, గూలెఁ దేరులు, పడిరి భటులు,
సమసె భూరివాజులు, పెలుచన్ వడిఁ జనె
రక్తనదులునుం గడు భాసురగతి శిరము
లెగసె నభమునకున్,) జుగుప్సగనని మనె. (౧౦౦)

భారతము-
కం.    చెడెఁ గరులు, గూలెఁ దేరులు,
పడిరి భటులు, సమసె భూరివాజులు, పెలుచన్
వడిఁ జనె రక్తనదులునుం,
గడు భాసురగతి శిరము లెగసె నభమునకున్. (౧౦౦)

టీక- జుగుప్సగన్ = భీభత్సరసముతోన్; వాజులు = గుఱ్ఱములు.

17, సెప్టెంబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం – 1519 (వాణికిఁ దెలివి లేదని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె.

పద్యరచన - 679 (విమాన ప్రయాణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“విమాన ప్రయాణము”

నిర్వచన భారత గర్భ రామాయణము – 84


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
గీ.      (ధర బయలు నిండు టంకృతులరొద నడఁగు
హుంకృతుల్, చలంబు నెనయు యోధరథహ
యగజచయముఁ గప్పురజంబు, నతినిశితవిశి
ఖములతతి, చెలఁగెన్) భయంకరముగఁ గన. (౯౯)

భారతము-
కం.    ధర బయలు నిండు టంకృతు
లరొద నడఁగు హుంకృతుల్, చలంబు నెనయు యో
ధరథహయగజచయముఁ గ
ప్పురజంబు, నతినిశితవిశిఖములతతి చెలఁగెన్. (౯౯)

టీక- భయంకరముగన్ = భయానకరసముగాన్; బయలు = ఆకాసము; చలము = పట్టుదల; ఎనయు = కూడు; చయము = గుంపు; రజము = దుమ్ము; విశిఖములతతి = బాణసమూహము.

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

న్యస్తాక్షరి -5

అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.

పద్యరచన - 678 (అగ్గిపెట్టె)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“అగ్గిపెట్టె”

నిర్వచన భారత గర్భ రామాయణము – 83


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.      రవిజుండు కపులతోఁ జెవియొగ్గి వినుఁడు నా
ది శిలాక్షరము విరోధీబలమునకు
వెన్నుఁజూపకుడు చూపిన యమాలయమున
కతిథు లయ్యెద రనె; ననఁగ వారు
కాసువీసముగారు క్రవ్యాదులు, చిదిమి
పెట్టమె చిచ్చఱ పిడుగులమయి
రాయి గ్రుద్దెదము వారలతలలనుఁ దన్నె
దమని గంతులిడి రుత్సాహమునను;
గీ.       (ఘనగతిని దక్షిణోత్తరవనధు లలుక
గొనుచుఁ బెనగుభాతినిఁ గడుగొబ్బున నిరు
మొనలు గవిసి చేసెను యుద్ధమునుఁ బదహతు
ల క్షితియును వడఁకన్,) బో రలఘువు నయ్యె. (౯౮)

భారతము-
కం.     ఘనగతిని దక్షిణోత్తర
వనధు లలుక గొనుచుఁ బెనగుభాతినిఁ గడుగొ
బ్బున నిరుమొనలు గవిసి చే
సెను యుద్ధమునుఁ బదహతుల క్షితియును వడఁకన్. (౯౮)

టీక- ఉత్సాహమునను = వీరరసముతో; క్రవ్యాదులు = రాక్షసులు; గొబ్బున = త్వరగా; మొనలు = సైన్యములు.