5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 667 (బడిపంతులు)

కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచనకు అంశము...
“బడిపంతులు”

22 కామెంట్‌లు:

 1. గురుపూజోత్సవ శుభాకాంక్షలు :-
  బడిపంతులు మతిమంతుడు
  గుడిలోనుండు భగవంతుఁ గుర్తుకు తెచ్చున్
  నడవడి తప్పిన శిష్యుల
  కిడుచు కఠినశిక్ష దారికిన్ గొనితెచ్చున్

  గురువే ధరణిని నరులకు
  సరియగు తెఱకువనుగొలిపి సద్బుద్ధినిడున్
  గురువేకరువైన యిలను
  దురితంబులుపెరిగి బ్రతుకు దుర్భర మగునొయ్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  పూర్వంగురుకులాభ్యాసము చేసేవారికి :

  01)
  ___________________________

  గురుడే తల్లియు దండ్రియు
  గురుడే మరి సోదరుండు - గురుడే సఖుడౌ
  గురుడే దైవము సర్వము
  గురుడే మరి తోడు నీడ - గురికుదిరినచో !
  ___________________________

  రిప్లయితొలగించండి
 3. పూర్వంగురుకులాభ్యాసము చేసేవారికి :

  02)
  ___________________________

  గురువె తల్లి దండ్రి ♦ గురువె సర్వస్వము
  గురువె సోదరుండు ♦ గురువె సఖుడు
  గురువె తోడు నీడ ♦ గురువె దైవ సముడు
  గురువు కెవరు సాటి ♦ గురువు గురువె !
  ___________________________

  రిప్లయితొలగించండి
 4. పూర్వంగురుకులాభ్యాసము చేసేవారికి :

  03)
  ___________________________

  గురువె తల్లి దండ్రి మరియు ♦ గురువె దైవ సముడురా
  గురువె సోదరుండు మరియు ♦ గురువె ముఖ్య సఖుడురా
  గురువె తోడు నీడ మరియు ♦ గురువె సర్వ మిడునురా
  గురువు కెవరు సాటి లేరు ♦ గురువు సాటి గురువెరా !
  ___________________________

  రిప్లయితొలగించండి
 5. పూర్వంగురుకులాభ్యాసము చేసేవారికి :

  04)
  ___________________________

  గురువె తల్లియు దండ్రియు ♦ గురువె సఖుడు
  గురువె తోడును నీడయు ♦ గురువె భ్రాత
  గురువె దైవ సమానుడు ♦ గురువె నిజము
  గురువు కన్నను గొప్పది ♦ గురువె గనిన
  ___________________________

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యంలో ‘కరువైన నిలను’ అనండి.
  *
  వసంత కిశోర్ గారూ,
  దాదాపుగా ఒకే భావాన్ని వివిధచ్ఛందాలలో వివరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. గురువర్యులకు నమస్కారములు...గురుపూజోత్సవ శుభాభినందనలు.

  బడియే విద్యార్థులకిల
  గుడియగు నట బోధ సేయు గురుడే దైవం
  బడిపంతులు తనకే కన
  బడినంతనె మంత్రియైన వందనమిడుగా !

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘దైవం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘గురుదైవమ్మే’ అందామా?

  రిప్లయితొలగించండి
 9. పూజ్యగురుదేవులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలతో..

  గురువే బ్రహ్మయు విష్ణువు
  గురువేగద నీశ్వరుండు గురుదైవమ్మే
  గురువే సర్వము నిలలో
  గురువులకివె వందనములు కువలయమందున్!

  బడియే తొలిగుడి జనులకు
  బడిలో దైవమ్మె గురువు బ్రహ్మము తానే
  బడిపంతులె సర్వులకును
  నడవడికను నేర్పుగాదె నయముగ నెపుడున్!

  రిప్లయితొలగించండి
 10. గురుభ్యో నమః


  గురుపూజోత్సవమనుచును
  గురువులకును వందనంబు కూర్మి సలిపెదన్
  పరమాణువునై గురువుల
  కరుణను పొందెడు దినమునకై తపియింతున్

  గురువు పేరు నిల్ప కోరుకొందు, సతత
  మందె శ్రద్ధఁ జూపి యాచరింతు
  గురువు మాటలన్ని కొఱతయె లేకుండ
  నిల్పి నడచుకొందు నేర్పుతోడ.

  చరణములనమ్మి భక్తితో సాధువర్త
  నమ్ముతో నిల్తు, గుర్వాజ్ఞ నమ్మి యెపుడు
  పాలనము సేయచుందు సభాసదనపు
  నియమముల నాచరింతును నేర్పుతోడ.

  గురువులనమ్మి విద్యలను గొప్పగ నేర్చినఁజాలు సోదరా!
  సరియగు జీవనమ్ములిల చక్కగ నౌనిక నెల్ల కార్యముల్.
  నిరతము శిష్య రేణువుల నేర్పునుఁ బెంచెడు దక్షులై సదా
  పరిణతిఁ జూపు వారలను పక్వత తోడనుఁ గొల్వ భాగ్యమౌ.

  భూమిని దైవరూపముగ పూజల నందెడు వేళ నేడిదే
  నేమముఁ దప్పకుండ కడు నిర్మల మానసినై పదేపదే
  నా మనమందు నెల్లరను నా గురు వర్యుల నాదరమ్ముతో
  క్షేమవిచారణల్ సలిపి శ్రీ శుభ మంగళమందు వారికై.

  నిత్యనిర్మలులౌ మనస్కులు నిష్ఠతో చరియించుచున్
  సత్యసంధత వీడకుందురు; శ్రద్ధఁ జూపుచు శిష్యులం
  దత్యధీకపు ప్రేమ నుండ-తదైక దీక్షనుఁ జూపుచున్
  భృత్యులై గురుసేవఁ జేసిన ప్రీతి పొందుదుమెందునున్.

  నమస్కరింతు భక్తితోడ నమ్మి యుందు నెప్పుడున్
  సమస్తజ్ఞానమార్జనమ్ము సాధనమ్ము తోడుగా
  నమేయమౌ గురుండు నేర్ప నద్భుతమ్మగున్ కదా!
  ప్రమోదమందగా ననేక ప్రాంజలిన్ ఘటింతు నేన్.

  దయతో నేర్పుడు విద్యలన్ సభను తాదాత్మ్యమ్ముతో నేర్తు; నే
  భయమున్ వీడుదు జీవనమ్మునిక సాఫల్యమ్ము సాధింతు; నే
  హయసాపత్యముఁ బొందుచున్ పరుగు లందన్నింట ముందౌదు; నే
  స్వయమైనట్టి సమర్థతన్ పెరిగి నిస్స్వార్థమ్ము నేర్తున్ సదా!

  రిప్లయితొలగించండి
 11. గురువుగారు,
  సిస్టమ్ పని చేయకపోవడం వల్ల వ్రాయలేదు. ఈరోజే మొదటగా గురువందనము.

  రిప్లయితొలగించండి
 12. బుజ్జగించి చెప్పి బుద్ధుల నేర్పించి
  బాధ్యతలను మప్పి భావి భరత
  పౌర వితతి నెల్ల గౌరవమ్ముగ మల్చు
  నొజ్జలను నుతింతు నుచిత రీతి.

  పలుకుబడుల నేర్పి వ్రాతల సరిదిద్ది
  మాతృభాష పట్ల మమత బెంచి
  విద్య నిచ్చి తగు వివేకము దయజేయు
  గురువు కన్న ధాత్రి గొప్ప యెవరు?

  గురువు పాత్ర పరిధి గురుతరమ్మని తెల్సి
  గురువు నడత నెపుడు గురుతెరింగి
  పరువు మాపు పనుల నిరసించి యెదిరించు
  గురువులకు నొనర్తు కోటి నతులు.

  రిప్లయితొలగించండి
 13. లక్ష్మీ దేవిగారు కలాన్ని ఝళిపించారు. గురువులను మురిపించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. గురుపూజోత్సవ శుభాకాంక్షలు :-
  దిద్ద లేని చేత దిద్దించి నేర్పించి
  బుద్ధి గలుగు పలుకు బోధ చేసి
  బ్రతుకు విధముఁ జెప్పి గతిఁ జూపు దేవుడు
  గురువు కాక నెవరు ధరణి పైన?

  గురువూ, దైవము యెదురుగ
  దరిశన మీయంగ నేను తలదాల్చెద నా
  గురు పాదమ్ములె ముందుగ!
  హరి యెవరో చెప్పి నట్టి యాప్తుడు గనుకన్!
  గుడి చెంతకు దారులివని
  బడి పంతులు జెప్పినంత భక్తి ప్రపత్తుల్
  కడవరకు నలవడునవే
  మిడిమిడి జ్ఞానము వదలును మేదిని యందున్!

  రిప్లయితొలగించండి
 15. గురువేదైవంబిలలో
  కఱపును విద్యలు సతతము కరమగు నిష్టన్
  నెఱవును జూపినగురువుల
  మఱిమఱి తలతురు మనుజులు మాన్యత తోడన్

  రిప్లయితొలగించండి
 16. పూజ్యగురుదేవులకు.... గురువులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 17. మాస్టరుగారూ ! సవరణకు ధన్యవాదములు.
  సవరణతో...

  బడియే విద్యార్థులకిల
  గుడియగునట బోధకుండె కుల దైవమ్మే
  బడిపంతులు తనకే కన
  బడినంతనె దైవమైన వందనమిడుగా !

  బుడిబుడి నడకలనుండే
  నడవడి తడబడక చేయి నందుచు నేర్పున్
  వడివడి చేతల నాడును
  యొడిజేర్చుచు దారిజూపనోపును గురువే .

  రిప్లయితొలగించండి
 18. శ్రీగురుభ్యోనమ:

  గురువుగారికి, కవిమిత్రులకు ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

  వందనమ్ములిడుదు బడిపంతులకునేను
  బ్రహ్మ విష్ణు శివులె పంతులనగ
  బ్రతుక నేర్పువాడు వాత్సల్యములతోడ
  పలుకు పలుకులోన నిలచి తాను

  ముజ్జగములు మురియంగా
  గజ్జును మర్ధించి మనిషి గౌరవమందన్
  సజ్జనులను సమకూర్చగ
  నొజ్జల సృష్టించె బ్రహ్మనోరిమితోడన్

  గజ్జు = గర్వము

  రిప్లయితొలగించండి
 19. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కృతులు.
  ముందుగా నిన్న శుభాకాంక్షలు తెల్పిన అందరికీ ధన్యవాదాలు.
  నిన్న గ్రామాంతరం వెళ్ళి ఉదయమే తిరిగి వచ్చాను. అందువల్ల నిన్నటి పూరణల, పద్యాల సమీక్ష చేయలేకపోయాను. మన్నించండి. వీలైతే ఈ సాయంత్రం లోగా చేస్తాను.
  నిన్నటి శీర్షికకు చక్కని పద్యాలను వ్రాసిన మిత్రులు....
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  శైలజ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  మిస్సన్న గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  శ్రీపతి శాస్త్రి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి