14, సెప్టెంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 676 (మా యూరు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“మా యూరు”

16 కామెంట్‌లు:

  1. అందరికి వసంతకిశోరు - వందనమ్ము !
    అందమైనట్టి పద్యాల - నిందు గనిన
    నెందరెందరొ మిత్రు, ల - నింద్యముగను
    నాంధ్ర మాతకు నాభర - ణమ్ము లనగ
    నంద జేతురు నిత్య మా - నంద మెగయ !

    మా యూరు :

    01)
    _______________________________

    మట్టిదారియె మాయూరి - పట్టు జేర
    మట్టి లోనున్న మాణిక్య - మనగ జెలగు
    మారుమూలను యెత్తైన - మలల నడుమ
    మనెడి మాయూరి నెన్నడు - మరువలేను !

    మలయమారుత వీవనల్ - మదిని మీటు !
    మధుర భావన మనసెల్ల - మసలు చుండు !
    మాటకారులె మాయూరి - మనుషులంత !
    మంచితన మందు మాయూరె - మహిని మేలు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  2. మా యూరు తలతు నెప్పుడు
    హాయిగ నాటి బడి చదువులందున నేనున్
    మాయని యుల్లాసముతో
    వ్రాయంగలదాననౌట ప్రమదమునిచ్చున్.

    రిప్లయితొలగించండి
  3. మాగ్రామము పేరు ఆత్మకూరు. అది మంగళగిరి తో కలిసి వుంటుంది.
    తొండలట గుడ్లిడునటంచు తూలనాడి
    యిప్పుడెగబడు చుండిరి యిరవు కొరకు
    మంగళప్రధమయ్యె మా మంగళగిరి
    యాత్మ బంధువుగామారె నాత్మకూరు

    రిప్లయితొలగించండి
  4. పేరిడె ప్రతాప రుద్రుడు
    కారణమదె 'రుద్రవరము' గర్వించ దగన్
    తూరుపు నలమల కొండల
    పారుచు నా తెలుగు గంగ పంటల కందున్

    మారిన కాలానుగుణపు
    తీరులు తా నందు కొనుచు తేజము నందెన్
    కారుణ్యము జూపెడు మా
    యూరి జనులఁ బొగడఁ దరమె నుర్వీ పతికిన్

    జంకుచు నే వ్రాయగఁగని
    వేంకటపతి పంతులిచ్చె పెను ధైర్యమునే
    వంకల వాసవి పద్యము
    శంకలఁ దీర్చి సరిజేసె సాయము జేసెన్

    రిప్లయితొలగించండి
  5. మాయూరి వాడె గురువై
    సాయమ్మిడె పద్య విద్య సమకూరునటుల్
    కాయము కాలెడు వరకును
    మాయడు నా మానసమున మహనీయుండై!

    రిప్లయితొలగించండి
  6. ఏయూరు లోయున్న యీనాటికీ నాకు - మాయూరి స్మృతులెల్ల మధుర మగును
    మాయూరి దేవత మమ్ము నెపుడు గాయు - పుట్టలమ్మదలపు మొదటవచ్చు
    పంట పొలములలో వరిపైరు కంకులు - తాటిచెట్లన మేటి తాటిపండ్లు
    గుడి ప్రాంగణములోన కోతి కొమ్మచులాట - యేడు పెంకుల తోటి యాడుయాట
    చిన్న తనమునందు చేసిన యల్లరి
    మిత్రులంద రెపుడు మెదులుచుండు
    కన్నతల్లి కన్న కన్నబిడ్డలకన్న
    మిన్న యగును మనకు కన్నభూమి

    రిప్లయితొలగించండి
  7. మాయూరు దొడ్డవర మయ
    మాయూరును మించి యూరు మరి యెట లేదే
    మాయూ రిలొ నెటు జూసిన
    పాయనివౌ పంట చేలు వరుసగ నుండున్

    రిప్లయితొలగించండి
  8. * మిత్రులందఱకుఁ దెలియఁజేయునదేమన...

    శ్రీ కంది శంకరయ్యగారు నేఁడు వారి మిత్రుఁడొకరు పరమపదించినందున గ్రామాంతరమునకు వెడలియుంటినని, కర్మకాండలు ముగియనంతవరకు బ్లాగునకు నందుఁబాటులోనుండలేనని దూరభాషణమునఁ దెలిపినారు. గమనించఁగలరు.

    * వసంత కిశోర్‍గారూ, మంచితనమునకు పేరెన్నికఁగన్న మీయూరినిఁగూర్చిన పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    * సోదరి లక్ష్మీదేవిగారూ, మీకెంతయుఁ బ్రమోదముం గలిగించు మీయూరినిఁ గూర్చిన కందపద్యము చాల బాగుగనున్నది. అభినందనలు.

    * అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ, ఆత్మబందువైన యాత్మకూరుఁగూర్చిన మీ పద్యము చాల బాగున్నది. అభినందనలు.

    * నాగరాజు రవీందర్‍గారూ, తెలంగాణముననున్న యెలగందుల గ్రామమునుఁ గూర్చి మీరు వ్రాసిన నాలుఁగు పద్యములు చాల బాగుగనున్నవి. అభినందనలు. చిన్న సవరణము: నాల్గవపద్యమున "ఇళ్ళన్ని"యని వ్యావహారికముగ వ్రాసితిరి. దీనిని "ఇండ్లన్ని"యని మార్చిన సరిపోవును.

    * గుండా వేంకట సుబ్బ సహదేవుఁడుగారూ, రుద్రవరముంగూర్చి మీరు వ్రాసిన మూఁడు కందములు చాల బాగున్నవి. అభినందనలు.

    చిన్న సవరణము...రెండవకందము నాల్గవపాదమున "తరమె నుర్వీపతికిన్" అన్నారు. దీనిని "తరమె యుర్వీపతికిన్"అనిన సాధువగును.

    * చంద్రమౌళి సూర్యనారాయణగారూ మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. కాని కొన్ని సవరణములు చేయుట యవసరము. చిన్న చిన్న సవరణములు చేసిన మీ పద్య మీ దిగువనిచ్చుచుంటిని. గమనించఁగలరు.

    ఏయూరిలోనున్న నీ నాటికిని నాకు - మాయూరి స్మృతులెల్ల మధుర మగును
    మాయూరి దేవత మమ్ము నెపుడు గాయు - పుట్టలమ్మతలపు మొదటవచ్చు
    పంట పొలములలో వరిపైరు కంకులు - తాటిచెట్లను మేటి తాటిపండ్లు
    గుడి ప్రాంగణములోన కోతి కొమ్మచ్చులు - నేడు పెంకులతోడ నాడు నాట
    చిన్నతనమునందు చేసిన యల్లరి
    మిత్రులంద రెపుడు మెదులుచుండ్రు
    కన్నతల్లి కన్న కన్నబిడ్డలకన్న
    మిన్నయగును మనకు కన్నభూమి

    * సుబ్బారావుగారూ, మీ యూరినిఁగూర్చిన పద్యము చాలా బాగున్నది. అభినందనలు. "మాయూరును మించి..." యనుచోట, "మాయూరిని మించి..."యనిన బాగుగనుండును.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందఱకు నమస్కారములు. మా యూరి నోరుగంటినిఁ దలఁచినకొలఁది మది పులకించును.

    ||సీ||
    కాకతీయుల యోరుగల్లున గతవైభ
    ....వపుఁ జిహ్నములు నిల్పు భావనలును;
    అట స్వయంభూదేవు నాలయమందున
    ....దీపించు శివలింగ దీధితులును;
    దొడరి వేస్తంభాల గుడిలోన వెలసిన
    ....పరమేశ్వరకృపా ప్రభాతములును;
    గుట్టపైఁ బద్మాక్షి గురుతరాశీఃప్రద
    ....వీక్షణమ్ములొసంగు ప్రేరణలును;
    ||గీ||
    భద్రకాళియొసఁగు పావనాశీఃపూత
    మౌ సరోవరజల మాధురులును;
    పరమ పదముఁ జేర్చు వరద గోవిందుని
    యభయముద్ర యిచ్చు నందఱకును!!

    రిప్లయితొలగించండి
  10. ఏయూ రు వాడవైనను
    మాయూరికి రమ్ము సామి !మమ్మలరింపన్
    మాయూరి యంద మరయగ
    నే యూరికి నుండ బోదు నిదియ నిజంబున్

    రిప్లయితొలగించండి
  11. ఏరులు చుట్టిన కతమున
    పేరందెను యేరులూరు పిమ్మట నదియే
    మారెను నేలూరు తుదకు
    చేరిక మాయూరితోడ చిత్రం బిదియే!

    మాయూరు "ఏలూరు"

    రిప్లయితొలగించండి
  12. * సుబ్బారావుగారూ, మీయూరినిఁ గూర్చిన మఱొక పద్యము బాగుగనున్నది. అభినందనలు.

    * రెండుచింతల రామకృష్ణమూర్తిగారూ, ఏరులూ రేలూరుగ మాఱిన విషయము మీ పద్యద్వారమున హృద్యముగఁ జెప్పితిరి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారికి ఓపికతో చేసిన సవరణలకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కృతులు.
    ‘మా యూరు’ శీర్షికకు పద్యాలను పంపిన మిత్రులందరికీ అభినందనలు.
    పద్యాల గుణదోషాలను తెలిపి సవరణలు సూచించిన మిత్రులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    మారిన కాలానుగుణపు
    తీరులు తా నందు కొనుచు తేజము నందెన్
    కారుణ్యము జూపెడు మా
    యూరి జనులఁ బొగడఁ దరమె యుర్వీ పతికిన్

    రిప్లయితొలగించండి