9, సెప్టెంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1515 (దోమపై నెక్కి యూరేగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దోమపై నెక్కి యూరేగె సామజమ్ము.

24 కామెంట్‌లు:

  1. ఊబకాయాన లావుగనున్నయొకడు
    చిన్న సైకిలెక్కి షికారు చేయుచుండ
    చూచువారలకనిపించె చోద్యముగను
    దోమపై నెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి
  2. వాసికెక్కిన సర్కసు వచ్చె నొకటి
    ఉమ యనెడి పేరు గల యింతి యుండెనందు
    సర్కసు మొదలిడిన వేళ, సాహస బిరు
    దోమపై నెక్కి యూరేగె సామజమ్ము!!

    సాహస బిరుద + ఉమపై = సాహస బిరుదోమపై

    రిప్లయితొలగించండి
  3. సామజము వంటి నేతలు సైకిలెక్కి
    యోట్ల కోసమై సర్కసు ఫీట్లఁ జేయ
    నట్టినేతలఁ గనియొక్కడనియెనిటుల
    దోమపైనెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    వీధి వీధికో వినాయకుడిని చూస్తున్నప్పుడు :

    01)
    ________________________________

    వాడ వాడల వెల్గు - గణపతిన్ గాంచగ
    వీధి వీధులయందు - వెడలు చుండ

    నొకచోట చిన్నని - యొకచోట నెత్తైన
    విఘ్నరాజుల గంటి - వేడ్కగాను !

    ఒకవీధి నొకశిర - మ్మొకవీధి నైదుండ
    వింతగా జూచితి - న్వేడ్క హెచ్చ !

    ఒకవాడ నిరుబాహు - నొకవాడ దశబాహు
    గజముఖులను గంటి - గనులు మెరయ !

    నొకవంక పీఠిపై - నొకవంక నెలుకపై
    కూర్చొని యుండె నా - కొక్కురవుతు !

    మూషికము నెక్కి కూర్చున్న - మూర్తి జూచి
    చిన్ని సూచ్యాస్య మది యెట్లు - మిన్నయైన
    పుష్టికాంతుని మోయుటన్ - కష్ట పడునొ
    యనెడి యూహయె మదిజేర - నంటి నిటుల
    "దోమపై నెక్కి యూరేగె - సామజమ్ము "
    ________________________________

    రిప్లయితొలగించండి
  5. మాస్టరుగారూ ! మీకు అభినందనలు. తెలుగు వెలుగులో మనబ్లాగు వెలుగులీంబోతున్నందుకు మహదానందముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  6. తనదు యూరేగ మావటి తరలెనపుడు
    వీపుపైనెక్కి పోద్రోలె విసవిసగను
    గట్టితొండమ్ము గ్రుచ్చుచు కుట్టుచుండ
    దోమపై నెక్కి, యూరేగె సామజమ్ము.

    రిప్లయితొలగించండి
  7. దివ్యవిభవోన్నతుండైన తిరుమలేశుఁ
    డవనిఁ బ్రహ్మోత్సవముల సంస్తవనమందు
    పామరుల పీఠభుజముపైఁ బరగుచుండు
    దోమ పైనెక్కి యూరేగె సామజమ్ము.

    రిప్లయితొలగించండి
  8. మల్లెల వారి పూరణలు

    శరణు కోర, యయాతికి శరణమిచ్చి
    ఆంజనేయుండు నారాము కనియె నిట్లు
    "దోమ పైనెక్కి యూరేగె సామజమ్ము
    పగిది నున్నది భక్తుని భంజనంబు"

    అంగ రాజ్యంబు నందించి యతని మాట
    రాజ రాజటు లినుచును రాజ్యమేలె
    కనగ నావిధి నడచుట ఘనము నౌనె?
    దోమ పైనెక్కి యూరేగె సామజమ్ము

    నీతి మాలిన వానిని, నీతిమతియు
    నమ్మి, పాలన చేయుట నయముఁ గాదు
    చేటుఁ గూర్చును ప్రజలకు, చెడును తానె
    దోమ పైనెక్కి యూరేగె సామజమ్ము

    బిల్వ మంగళుండు చెలువు వీడి, సఖుడు
    నౌభవాని శంకరు మాట నయముఁ దప్పి
    వేశ్య వాటికిఁ జేరియు, విజ్ఞత విడె
    దోమ పైనెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి
  9. చిత్రకారుడు వేసెను చిత్రమందు
    పూతికను బట్టి నెగిరెడు మూషికమ్ము!
    చీమమోయుచు నుండెను చిలుక నచట !
    దోమపై నెక్కి యూరేగె సామజమ్ము !

    రిప్లయితొలగించండి
  10. నయనబాధనొక్కేనుఁగు నలుగ, కంటి
    కలక దీర్చెను మశకము, గజము మెచ్చ
    దేహములుమారె జన్మాలుదిప్పికొనగ
    దోమపైనెక్కియూరేగె సామజమ్ము

    ఒక ఏనుగు కంటికలక బాధను దోమ వారించింది ఇద్దరూ మిత్రులైరి. మరుజన్మలో ఆ ఏనుగుదోమై, దోమ ఏనుగై పుట్టనవి. ఆ సామజము (ఇప్పటిదోమ) ఆ దోమపై(ఇప్పటిఏనుగుపై) నెక్కి సరదాగా ఊరేగె.

    రిప్లయితొలగించండి
  11. అనుదిన మనిమేషన్లందు నల్లెదరివె
    చీమ పైనెక్కి కుల్కెడు చిరుత నిన్న
    పిల్ల వారల నలరింప విధిగ నేడు
    దోమ పైనెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మట్టి యేనుగు బొమ్మను పట్టి మార్గ
    మ౦దుగొంపోవుచుండగ మశక మొకటి
    హస్తి పదము క్రిందనుదూర ననిరి ప్రజలు
    దోమ పై నెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి


  13. మరియొక పూరణ
    కట్టి తెచ్చిన ద్రుపదుని గనిన ద్రోణు
    డిట్లనియె "నాడు నన్నొక మశక
    మట్లు జూచితి వీవొక హస్తి ననుచు
    తారుమారాయె నేడు నీ దైన సొబగు
    దోమ పై నెక్కి యూరేగె సామజమ్ము"

    రిప్లయితొలగించండి
  14. కె.ఎస్.గురుమూర్తి ఆచార్య గారి poorana
    కోట్ల ప్రాణుల జంపెడు ఘోర రోగ
    జీవులను మోయు మశకమ్ముసింధురమును
    హెలగా మోయు నబ్బుర మేల యుండు
    దోమపైనెక్కి యూరేగె సామజమ్ము .

    రిప్లయితొలగించండి
  15. కె.ఈస్వరప్పగారి పూరణ
    అష్టదిగ్గజమందున నార్యుడనుచు
    అల్లసానియె యేనుగు పల్లకెక్క
    దోమ,పైనెక్కి యూరేగె.సామజమ్ము
    రాయలాత్మగ దిరుగాడే సోయగాన

    రిప్లయితొలగించండి
  16. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.

    అల్పశకటాన ఘనవినాయకునిఁ బెట్టు
    కొని నిమజ్జనమునుఁ జేయఁగోరి వెడలి
    రిదియ కనుమోయి కవివర్య, యేమనందు?
    దోమపై నెక్కి యూరేగె సామజమ్ము!

    రిప్లయితొలగించండి
  17. శ్రీగురుభ్యోనం:

    తెలుగు వార్తలపత్రికల్ తీరు మారె
    వింత పదములు, దోషముల్ విస్తరించె
    దృష్టి సారింప నొకవార్త దెలియ జేసె
    దోమపైనెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి
  18. వానకాలపు ధాటికి వరదనిండ
    దోమపైనెక్కియూరేగె;సామజమ్ము,
    స్వామి తనపైన నిలబెట్టి సంతసించె
    దివ్య పూజల నందింప తేజమెసగి

    రిప్లయితొలగించండి
  19. లేని జాతిని పీడించు హీనబుద్ధి
    నొడలు పెంచిన యొక్కడు కడిమి నిలచి
    బక్క వృద్ధుని బండిని యెక్క, చూడ
    దోమపైనెక్కి యూరేగె సామజమ్ము

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు...

    వింత గొలిపెడి యాకార జంతువులను
    చిత్రకారుడు గీసిన చిత్రమందు
    మిడత యొకటినోట కరచి నుడత బట్టె!
    దోమపై నెక్కి యూరేగె సామజమ్ము!

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులు నమస్కృతులు.
    నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. రోజంతా ఎక్కడా బ్లాగు చూడడానికి అవకాశం దొరకలేదు. అందువల్ల నిన్నటి పూరణలను, పద్యాలను సమీక్షించడానికి అవకాశం దొరకలేదు. ఈనాటి పద్యరచన, న్యస్తాక్షరి శీర్షికలను షెడ్యూల్ చెయ్యడానికి వీలులేకపోయింది. ఇప్పుడు కూడా ఏదో ఇవ్వాలను మొక్కుబడిగా ఇచ్చినవే.
    నిన్నటి సమస్యకు పూరణ లందించిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    వసంత కిశోర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    కె.యస్. గురుమూర్తి ఆచార్య గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
    కుసుమ సుదర్శన్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి