18, సెప్టెంబర్ 2014, గురువారం

దత్తపది - 44 (అల-కల-తల-వల)

కవిమిత్రులారా!
అల - కల - తల - వల
పై పదాలను ఉపయోగిస్తూ
రావణుని చెరలో సీత మనోగతాన్ని తెలుపుతూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

31 కామెంట్‌లు:

 1. తలపు లన్నియు వలపులౌ కలను గంటి
  రామ !వేవేగ మఱి యల ,రావణున్ని
  సంహ రించియు గొనిపొమ్ము సామి !నన్ను
  నిటుల యనుకొనె దనలోన నింతి సీ త

  రిప్లయితొలగించండి
 2. అలరుల్ పొంగెడి రామమూర్తి యెద శయ్యా సౌఖ్యమున్ బాసి యీ
  కలతల్ నిండిన దుర్దశన్ బడసితిన్ కర్మంబు నేమందు నా
  తలపంతా సతతమ్ము నీ యెడనె కాదా నాథ! వేవేగ రా
  వలదా? రావణు ద్రుంచి నీ యబలఁ గావం జాలవా! నేరవా!

  రిప్లయితొలగించండి
 3. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రావణున్ని’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘రావణాఖ్యు’ అనండి. ‘ఇటుల ననుకొనె’ అనండి.
  *
  మిస్సన్న గారూ,
  చక్కని మత్తేభంలో పూరణ అందించి అలరింపజేశారు. అభినందనలు.
  ‘తలపంతా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘తలపెల్లన్’ అంటే సరి.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారూ! అవును ఎల్లన్ అన్న పదం నాకు స్ఫురించ లేదు. మంచి సవరణ. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. సవరించిన పద్యం:

  అలరుల్ పొంగెడి రామమూర్తి యెద శయ్యా సౌఖ్యమున్ బాసి యీ
  కలతల్ నిండిన దుర్దశన్ బడసితిన్ కర్మంబు నేమందు నా
  తలపెల్లన్ సతతమ్ము నీ యెడనె కాదా నాథ! వేవేగ రా
  వలదా? రావణు ద్రుంచి నీ యబలఁ గావం జాలవా! నేరవా!

  రిప్లయితొలగించండి
 6. అలసితి రావణు చెరలో
  తలచుచు నిను వేచియంటి దాశరధీ! నీ
  వలపు కు దూరంబగు నా
  కలత ను తొలగించ వేగ కావగరావే!

  రిప్లయితొలగించండి
 7. అలరులఁ బూజసేసితినొ యందితివీవిల నాకు భర్తవై
  కలవరమంది నేఁడిచట కందితిఁదీర్పవె నాదు కష్టమున్,
  తలచితి నీదు నామమును, దారి నెఱింగి ననుంగృపంగనన్
  వలదిక తామసమ్ము లవి; ప్రాణసఖుండ! నివేదనమ్మిదే.

  రిప్లయితొలగించండి
 8. మల్లెల వారి పూరణలు

  వలవలని యేడ్చు సీతయు, పావనముగ
  అల నశోకవనంబున నతుల మతియ
  తలపునందున, రాముడే తనను కాచు
  కలనుఁ గాంచిన త్రిజటను, గారవించె

  అలలు రేగెను పలుగతి యవని జాత
  తలపులందున- రాముడు ధార్మిక గతి
  కలక దీర్పగ, రావణు కావరమతి
  వలనఁ గావగ రణమున వానిఁజంపు

  కలనుఁ గాంచిన త్రిజటతా కలత దీర్ప,
  అల హనుమయే, తనకిడగా నంగుళి నటు,
  వలవలాడెడి మదికొంత బాధ తీర
  తలయె తెగు రావణునికంచు, తలచె సీత

  వలపుఁ జూపెడు రావణు వదరు తనము
  తలచి యెంతయు బాధతో ధరణి జాత
  అలనయోధ్య, రాముడు, నని నణచు ననుచు
  కలను గనుచును విలపించి గడిపె సీత

  కలను నైనను రాముని ఘనునినెపుడు
  తలపులందున వీడక, ధర్మ గతిని
  వలపుఁ జూపుచు బాధించు పాపి, దిట్టె.
  "అలనని నినీవు కూలెదు నదియె నిజము"

  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. తలచి తలచి శ్రీరాముని ధరణి జాత
  కలవరించుచు తనయొక్క కాంతు గూర్చి
  వలవలమని శోకించుచు వనమునందు
  నలసి సొలసి తాను పడియె నవనిపైన

  రిప్లయితొలగించండి
 11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. అలసిన కనులను మూసెను
  కలచినమదితోడ సీత కలవరపడుచున్
  తలపుల రఘురామునితో
  వలపుల క్షణములు మెదలుచు వగపునుపెంచెన్

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  1. అల రావణు చెర కలతల
  నిలసుత తలపోసె వలచి నేణము పొందన్
  కలగించితి రాముని యి౦
  తులబుద్ధిప్రళయ మనగ తోచెను మదిలో
  2.ఖలుడగు పదితలలసురుడు
  వలరాజుకుదాసుడగుచు బంధించెను నే
  నల రాము దక్క నొరులను
  కలనైనా దలప ననుచు గానగ లేడే

  రిప్లయితొలగించండి
 14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘తలల + అసురుడు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘ఖలుడు పదితలల యసురుడు’ అనండి. ‘కలనైనా’ అన్నదాన్ని ‘కలనైనను’ అని సవరించండి.

  రిప్లయితొలగించండి
 15. కె,ఈశ్వరప్ప గారి పూరణ
  అలకలతల వలనందున
  కలవరమున్ రామనామ గానము విధిగా
  తలపుల్ నిండగ సీతకు
  వలగాదు నశోక వనము వాత్సల్య నిధే

  రిప్లయితొలగించండి
 16. అలసత్వంబిసుమంతలేక జవసత్వాహీన దోర్దండుడై
  కలవాణీప్రియ శస్త్రధారుడయి సంగ్రామంబునన్ దైత్యుకున్
  తలలున్ ద్రుంచి జయంబునంది ప్రియసీతారక్షణారూఢుడై
  వలపున్ బ్రేమనొసంగుమయ్య కరుణావ్యాపార లీలాస్పదా.

  కలవాణీ ప్రియ = బ్రహ్మ

  రిప్లయితొలగించండి
 17. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
  అలతిగనెంచుచున్ దశరథాత్మజువిక్రమ మెవ్విధమ్మునన్
  వలపు తలంపుమైకమున వాగుట మేలగునే దురాత్ముడా
  కలన భవ న్ముఖమ్ములను ఖండన జేయుటతథ్యమౌటచే మలగుమటంచు తా తెలిపె మైథిలి త్రిప్పితృణమ్ము చేతితో

  రిప్లయితొలగించండి
 18. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింపుచున్నవి !

  ఉరి వేసుకోబోయే ముందు సీతాంతరంగము :

  01)
  _______________________________

  అలత సహింప లేనిక - నిలువ లేను
  కలకబాఱెను మనసంత - నిలక లేమి
  తలపు లన్నియు శ్రీరామ - నిలయ మగుట
  వలదు వలకాని చెరలోన - నిలుగు మనువు !
  _______________________________
  అలఁత = దుఃఖము , బాధ.
  నిలుచు = జీవించు
  కలఁకఁబాఱు = కలఁతపడు , క్షోభించు
  నిలక = స్థైర్యము.
  వలకాఁడు = కాముకుఁడు.
  చెర = నిర్భంధము
  నిలుగు = అంతరించు
  మనువు = బ్రతుకు

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దైత్యునకున్’ అనాలి కదా.. అక్కడ ‘దైత్యు పెం/ దలలం ద్రుంచి..’ అంటే ఎలా ఉంటుంది?
  *
  కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ఉరి వేసుకోబోయే ముందు సీతాంతరంగము (స్వార్థంతో) :

  02)
  _______________________________

  అలల దాటించి యీ లంక - నిలిపి నాడు
  కలలు కల్లలుగా మారె - జలలు కనుల !
  తలలు పదియైన రాక్షస - నిలయమందు
  వలను జిక్కిన బ్రతుకింక - వలదు వలదు !
  _______________________________
  అలలు = కెరటములు(సముద్రము)
  జల = ఏటిలోను, బావిలోను ఊరే నీరు

  రిప్లయితొలగించండి
 21. శ్రీగురుభ్యోనమ:

  అలమటించుచు నాస్వామి యలసెనేమొ
  కాననములందు వెదకుచున్ గలత చెంది
  తరలి రారేల రావణు దలలు దృంచ
  వలకు జిక్కిన మీనమై వగచుచుంటి
  ననుచు జింతించె జానకి యాత్మలోన

  రిప్లయితొలగించండి
 22. అలనాడు జింకకై మది
  కలలేల గనె? ప్రభు నేలఁ గదిపితి వనికిన్?
  తలపుల లక్ష్మణుఁ గినిసితి?
  వలపన్నగ రావణుండు పాలిటఁ బడితిన్!

  రిప్లయితొలగించండి
 23. మిత్రులందఱకు నమోవాకములు.

  (అశోకవనమున రాక్షసస్త్రీల నడుమఁ జెఱలోనుండి శ్రీరామునిఁ దలఁచుకొనుచు సీత విలపించు సందర్భము)

  ॥సీ॥
  అలరారు నడలతో ♦ నలరు బంగరు జింకఁ
  ....గోరఁగఁ, దేఁ జన, ♦ నలవికాని
  సకల మాయలఁ గ్రమ్మి, ♦ సరగున నిఁక లంక
  ....కునుఁ దెచ్చి, బంధించెఁ ♦ గూటవృత్తుఁ
  డగు పదితలల దుం ♦ డగుఁడు దుర్మార్గుండు
  ....వంతల నిడె నాకు ♦ బలిమితోడఁ;
  జావవలచియుంటి ♦ సత్వర మ్మీవిట
  ....కడుగిడకున్న, రా ♦ క్షసులవలన!

  ॥గీ॥
  నలవి కానట్టి చెఱను నే ♦ ననుభవించు
  చుంటి; వికలమాయెను హృది; ♦ శోభ తలఁగెఁ;
  దలఁపులో నిన్ను నిలిపితి; ♦ దనుజుఁ జంపి,
  త్వరితగతిఁ జెఱనుండి యీ ♦ వలకుఁ దెమ్ము!!

  రిప్లయితొలగించండి
 24. వసంత కిశోర్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవడు గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరి పాదాన్ని ‘వలపన్నిన రావణఖలు పాలిన బడితిన్’ అంటే ఇంకా బాగుంటుందేమో?
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ ప్రతి పూరణలోను ఏదో ప్రత్యేకత చూపడం మీ విశిష్టత. అలాగే ఈనాటి పూరణలో దత్తపదాలను నాలుగేసి సార్లు ప్రయోగించి మీ సర్వతోముఖప్రజ్ఞను ప్రకటించి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
  రెండవ పాదం ఉత్తరార్ధంలో ‘లంక/కును దెచ్చి కలగించెఁ గూటవృత్తుఁ/ డగు...’ అంటే లెక్క సరిపోతుందనుకుంటున్నాను. ఏమంటారు?

  రిప్లయితొలగించండి
 25. అలలంకానగరంబునందుననశోకాఖ్యాటవీసీమలో
  కలతన్ పొందుచు నున్న భూమిసుత శోకాక్రాంత చిత్తంబులో
  తలచెన్ రాముడు రావణున్ తనదు పాదాలన్ పడన్జేసి కే
  వల మర్త్యుం వలె నాధునెంచు దితిజున్ ప్రాణంబులన్ దీయగాన్

  రిప్లయితొలగించండి
 26. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ మత్తేభ పూరణం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  ‘మర్త్యుం బలె’ అనండి. (ఎందుకో గుర్తు రావడం లేదు కాని నేను చెప్పిందే సరియైనది).

  రిప్లయితొలగించండి
 27. మిత్రులు కంది శంకరయ్యగారికి,

  నా పద్యము మీ యభినందనల నందినందుల కెంతయునానందముగా నున్నది.ధన్యవాదములు.

  రెండవపాదమునఁ దమరు సూచించిన సవరణమత్యంత రమణీయముగనున్నది. దానిని మఱికొన్ని సవరణములతో నీ క్రింది విధముగఁ బ్రకటించితిని. పరికింపుఁడు.

  ॥సీ॥
  అలరారు నడలతో ♦ నలరు బంగరు జింకఁ
  ....గోరఁగ, నీ వేగ, ♦ నలవికాని
  సకల మాయలఁ గ్రమ్మి, ♦ సరగున నిఁక లంక
  ....కునుఁ దెచ్చి, కలఁగించెఁ ♦ గూటవృత్తుఁ
  డగు పదితలల దుం ♦ డగుఁడు, దుశ్చింతల
  ....వంతల నిడె నాకు ♦ బలిమితోడఁ;
  జావవలచియుంటి ♦ సత్వర మ్మీవిట
  ....నడుగిడకున్న, దా ♦ నవల వలన!

  ॥గీ॥
  నలవి కానట్టి చెఱను నే ♦ ననుభవించు
  చుంటి; వికలమాయెను హృది; ♦ శోభ తలఁగెఁ;
  దలఁపులో నిన్ను నిలిపితి; ♦ దనుజుఁ జంపి,
  త్వరగ ననుఁ జెఱనుండి యీ ♦ వలకుఁ దెమ్ము!!

  రిప్లయితొలగించండి
 28. గురుదేవులకు ధన్యవాదాలు. తమరి సూచన మేరకు సవరించిస పద్యం :
  అలనాడు జింకకై మది
  కలలేల గనె? ప్రభు నేలఁ గదిపితి వనికిన్?
  తలపుల లక్ష్మణుఁ గినిసితి?
  వలపన్నిన రావణఖలు పాలిన బడితిన్!

  రిప్లయితొలగించండి
 29. అల లంకను రాక్షస వని
  తలచుట్టుననున్న సీత తలపులలోనన్
  కలవరమందక రాముని
  వలపులనే తలచుచుండె వచ్చెడి వరకున్.

  రిప్లయితొలగించండి
 30. గుండు మధుసూదన్ గారూ,
  మీ సవరించిన పూరణ చాలా బాగున్నది. సంతోషం!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి