29, సెప్టెంబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం – 1525 (బ్రహ్మ కడిగిన పాదమున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బ్రహ్మ కడిగిన పాదమున్ బట్టరాదు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. మూఢుడై మొండియై నీచ పూర్వ జన్మ
    వాసనలు వదలక దుష్ట వర్తనమున
    పాడు పనులను జేసిన పాప ఫలము
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట-రాదు!!

    రిప్లయితొలగించండి
  2. అఘము తొలగును బట్టిన నా మురారి
    బ్రహ్మ కడిగిన పాదమున్, బట్టరాదు
    నీతి నియమాలు లేనట్టి నీచ నరుల
    సకల పాపపంకిలమైన చరణములను

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    పాపాలన్నీ తొలగించే పాదం :

    01)
    _______________________________

    కాశ్యపేయులు మునులును - గారవించు
    పరమ పావనమైనట్టి - పాదమదియె
    సకల శక్తి ప్రదాయకా - సాద్యమదియె
    బ్రహ్మ కడిగిన పాదమున్ - బట్టరా ! దు
    రితము లన్నియు దొలగును - లిప్తలోన !
    _______________________________
    ఆసాద్యము = ప్రాప్యము, పొందదగినది.
    కాశ్యపేయుడు = దేవత
    గారవించు = పూజించు

    రిప్లయితొలగించండి
  4. మోక్షాన్నిచ్చే పాదం :

    02)
    _______________________________

    బ్రహ్మ కడిగిన పాదమున్ - బట్ట; రాదు
    ప్రేత్యభావ మఘము లవి - యత్యయ మగు !
    చేరి కీర్తించి పూజించ - స్థిరముగాను
    వృద్ధి జెందును ఙ్ఞానమ్ము - సిద్ధి గలుగు !
    _______________________________
    ప్రేత్యభావము = పునర్జన్మము
    అత్యయము = అంతము
    స్థిరము = నిశ్చలము
    సిద్ధి = మోక్షము

    రిప్లయితొలగించండి
  5. దసరా శుభాకాంక్షలు
    బ్లాగు మిత్రుల కిడుదును వంద నములు
    దసర పండుగ కతనన దండి గాను
    అందు కొను డార్య !మీరంద రందుకొనుడు
    నా శు భాకాంక్ష లీ యవి ,వేశ తములు

    రిప్లయితొలగించండి
  6. పట్టనర్హత గలుగునా ? పట్టమనకు
    బ్రహ్మ కడిగిన పాదమున్, బట్ట రాదు
    అడ్డ మైనవా రలకాళ్ళు హాస్య మునకు
    నైన నెపుడును నిజమిది యౌన ?కాద ?

    రిప్లయితొలగించండి
  7. వసంత మహోదయా! మంచి విరుపు విరిచి పూరించారుగా...

    రిప్లయితొలగించండి
  8. ముక్తి గలుగును పట్టిన ముదముతోడ
    బ్రహ్మ కడిగిన పాదమున్, బట్టరాదు
    కష్ట దుర్జను పదముల కలలనైన
    దొంగ స్వామి వలన ముక్తి దొరక దెప్డు

    రిప్లయితొలగించండి
  9. సొంత మాపాదములు బట్ట సుమనసులకు
    సొంత మాపాదములుబట్ట సోమ యాజి,
    నరులు దమలోని బలు దుర్గు ణాలు విడక
    బ్రహ్మ కడిగిన పాదముల్ బట్ట రాదు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో.............

    సకల భువనైకలోకముల్ సాగిలపడు
    నాదు పాదాములందు చిన్నారి వినుమ!
    మత్సుండవు ప్రహ్లాద! మానుమింక
    బ్రహ్మకడిగిన పాదమున్ బట్టరాదు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమ:
    పాదములు క్రింది విధముగా మార్పు చేస్తున్నాను.

    పూర్వ జన్మము నందలి పుణ్య ఫలమొ
    బ్రమ్హ కడిగిన పాదము బట్ట, రాదు
    నరక బాధలు కష్టముల్ నమ్మకముగ
    భక్తి విజ్ఞాన మారోగ్య భాగ్యమబ్బు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులు శ౦కరయ్యగారికి వందనములు
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట రాదు.
    యేలననతొలి హక్కుగ నిందిరకును
    పిదప బలికిని తరువాత వేల్పుపెద్ద
    వాయు పుత్రునికే చెల్లు వారసులుగ

    రిప్లయితొలగించండి
  13. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    చక్కని విరుపులతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ముందుగానే దసరా శుభాకాంక్షలు తెల్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    హిరణ్యకశిపుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రాదు + ఏలనన’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘రాదు/ హేతు విది తొలిహక్కుగ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  15. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    అచట శైవుడు వాగె మౌర్ఖ్య౦బు తోడ
    నలువ తలను మన హరుడు నరకి వైచె
    స్వామిశత్రువు మనకును శత్రువౌగ
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట-రాదు!

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు శ౦కరయ్యగారికి వందనములు
    సవరించిన పద్యం.మీసవరణకు ధన్యవాదములు
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట రాదు.
    హేతువిది తొలి హక్కుగ నిందిరకును
    పిదప బలికిని తరువాత వేల్పుపెద్ద
    వాయు పుత్రునికే చెల్లు వారసులుగ

    రిప్లయితొలగించండి
  17. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  18. కె.ఈశ్వరప్ప గారిపూరణ
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట-రాదు
    గాక నాస్తిక వాదమ్ము.సోక దెచట
    అన్నమయ్య కీర్తన లన్ని విన్నవారు
    వేంకటేశుని పాదాలు విడువ గలరె

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారి పూరణ....


    సకల పాపమ్ములనుఁ జేసి, సద్గురుఁడగు
    బ్రహ్మ కడిగిన పాదముం బట్ట, రాదు
    పుణ్య మిసుమంతయును, నితఃపూర్వమున్న
    పాప కర్మ ఫలమ్మంతఁ బడయకుండ!

    రిప్లయితొలగించండి
  20. బంధనము లన్ని త్రెంచెడి భాగ్యమదియె
    బ్రహ్మ మంతయు తానైన పాదమదియె
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్టరా!దు
    ర్లభమగు కార్యముండదు రసను జూడ!

    రిప్లయితొలగించండి
  21. పూజ్య గురుదేవులు శ౦కరయ్యగారికి వందనములు
    మరియొక పూరణ
    విష్ణు కొలువ౦గలేని జీవితము వ్యర్ధ
    మనుచు దెల్పెనన్నమయకీర్తనలు పాడి
    "బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట"-రాదు
    మహిని మరియొక పుట్టువు మానవులకు

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. మల్లెలవారి పూరణలు
    1.బ్రహ్మ కడిగిన పాదమున్ బట్టరాదు!
    ఎవరికైనను శ్రీదేవి యేను పట్ట
    పట్టినట్లైన సిరు లిచ్చు పాతు తగ్గ
    తనకు నాదేవి శ్రమ కొంత తగ్గగాను
    2. వేంకటేశుని దూరానె వీక్షణమ్ము
    శ్రమయవంగను,పదములు స్వయము పట్ట
    నెటుల వీలగు మనమున నెంచ చాలు
    బ్రహ్మ కడిగిన పాదమున్, బట్టరాదు
    3,కతము లన్నియు దీరంగ కలుగ ముక్తి
    పట్టవలయును వెంకన్న పావనంపు
    బ్రహ్మ కడిగిన పాదమున్. బట్టరాదు
    యితర వేల్పుల పాదాల నిది నిజమ్ము

    రిప్లయితొలగించండి
  24. మొన్నటి పూరణ:
    బయట కేగిన వీడక పలుకు లాడి
    కళ్లు తెరచిన కొంటెగా కలియ జూచి
    కళ్లు మూసిన వేళలో కలలఁ జేరి
    వెంటఁ బడిచంపు వాడెపో ప్రియసఖుండు!
    నిన్నటి న్యస్తాక్షరి:
    కనక దుర్గమ్మ కావుమా కరుణ జూపి
    సజ్జనులకు దుర్గమ్ముగ! సన్నుతింప
    తేజ మీయవే నిను దల్తు దేవి నీవు
    మహిని రక్షింప వినవమ్మ మాదు వినతి
    నేటి పూరణ:
    దైవ చింతన లేనట్టి జీవితమున
    పాహి పరమేశ యనినోట పలుక-రాదు!
    మారణాయుధమ్ములఁబట్టు మనుజు డెవడు
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట-రాదు!

    రిప్లయితొలగించండి
  25. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో...

    సమస్యను పూరించిన కవి పండితులకు పేరు పేరున పాదాభివందనములు.
    శ్రీ వసంత కిషోర్ గారు మంచి విరుపు విరిచి పూరించారు.
    శ్రీ శైలజ గారు "బ్రహ్మ కడిగిన పాదమున్ బట్టరా!దు ర్లభమగు " దు గురువై గణ దోషము వచ్చు చున్నది, సవరించ గలరు.

    రిప్లయితొలగించండి

  26. పాపపంకిల మున్నట్టి బాధ మనకు
    గంగ పుట్టిన్ పాదమున్ కడుగ - రాదు
    భవము బంధాల గొడవేది ప్రస్తుతించి
    బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట - రాదు.

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘రాదు + ఎవరికైనను’ అని విసంధిగా వ్రాశారు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    నిజమే. శైలజ గారి పూరణలోని గణదోషాన్ని గమనించికూడా వ్యాఖ్యానించే సమయంలో మరిచిపోయాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
    *
    శైలజ గారూ,
    ‘దుర్లభ’ అన్నప్పుడు దు గురువై గణదోషం. అక్కడ ‘దు/రితవిదూరుడై దయను వర్షించు నెపుడు’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గంగ పుట్టిన’ అనడానికి టైపాటు దొర్లింది.

    రిప్లయితొలగించండి