1, సెప్టెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 664 (బాపు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...

“బాపు”

19 కామెంట్‌లు:

  1. అందచందాల తెలుగింటి ఆడపిల్ల
    వాలుజడతోటి యలరారు వామనయన
    యెచట గాంచిన యనిపించు నెవరికైన
    బాపు గీసిన బొమ్మలా బాగు యనుచు

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    చిత్రకారుడు బాపు - చింతలను మాపు
    దిగ్గజుండు బాపు - చిరంజీవి బాపు
    తెలుగు లోగిళ్ళ సతతంబు - వెలుగు బాపు :

    01)
    ______________________________

    బాపు లేడని చింతింప - వలదు ! వలదు !
    బాపు తెలుగింటి హృదయాల - పద్మరేఖ !
    బాపు తెలుగింటి హృదయాల - బంధరేఖ !
    బాపు తెలుగింటి హృదయాల - భాగవతుడు !
    బాపు తెలుగింటి హృదయాల - భాస్కరుండు !
    బాపు తెలుగింటి హృదయాల - బ్రతుకు సతము !
    భాను తేజము గప్పగా - బ్రహ్మ తరమె !
    ______________________________
    పద్మరేఖ = లక్ష్మీరేఖ(ధనరేఖ,శుభరేఖ)
    బంధ = కట్టు

    రిప్లయితొలగించండి
  3. మనసు భారమును బాపు ' బాపు '
    " చిత్ర " దర్శకులు శ్రీ బాపు గారికి నివాళి.
    కందము:
    చిత్రముగ నుండు రాతలు
    చిత్రముగా నుండు బాపు చిత్రపు కార్టూన్
    చిత్రము రేఖా చిత్రము
    చిత్రమునే దీయువిధము చిత్రంబటలే !

    కందము:
    బాపూ గీతలు తీతలు
    బాపునుగా మనసులోని భారంబంతన్
    మాపులు లేనివి, రేపులు
    మాపులు మన తెలుగువారి మనసున నిలుచున్.

    ఆటవెలది:
    భరత జాతి పుడమి బ్రతికుండు వరకును
    బాపు గాంధి నిలచు బాగుగాను
    తెలుగు వ్రాత గీత దీపించు వరకును
    ' బాపు' వెలుగు, మనల భాగ్యమదియె.

    రిప్లయితొలగించండి
  4. బాపు గీత రమణ రాత బాలు పాట
    కాంచు వారికి కలిగించె కరము ముదము
    రమణ పిలుపును తానంది, రయముగాను
    చనియె మన బాపు దివికి తా సంతసముగ

    రిప్లయితొలగించండి
  5. బొమ్మలబ్రహ్మకుంచె చినబోయినదే! కళతప్పి మూర్ఛిలెన్
    కొమ్మ తెలుంగుబాల!బుడుగూపిరివాసెను, కోతికొమ్మచుల్
    చెమ్మగిలెన్ కటా! రమణ చెంగట చేరగ బాపు బాపురే
    అమ్మహితాత్ముడాత్మకు ననంతశమంబొనగూరుగావుతన్!!

    రిప్లయితొలగించండి
  6. సీ. చతురాంగనల సేయు చతురాస్యు చతురతన్
    మీరు చాతురిగొన్న ధీరుడీవు
    దొమ్మి సేయగ మట్టిబొమ్మలంపినయట్టి
    శాలివాహనుకుర్వి సాటివీవు
    దశకంఠరిపుగాధ విశిదమౌ చిత్రాల
    మేలు మల్చిన వాల్మీకివీవు
    ఒల్లనల్ వెలితెరన్ మల్లడింపగసేయ
    పుడమిబుట్టిన కళాపూర్ణుడీవు

    బొమ్మలను సేయు విద్దె నీ సొమ్ముకాదొ
    గుమ్మ సొబగిమ్మడింప నీ బొమ్మకాదొ
    బొమ్మలకు దమ్ములూదేటి బెమ్మయేని
    దమ్ములిడనేర్వ నీవు నీ తమ్ముడవడొ

    బాపుగారు లేరు అన్న ఊహే కష్టం. మహామనిషి. వారితో పరిచయం కలగడం నిజంగా మహాభాగ్యం. నా మ్యూజిక్ ఆల్బంకు వారు కవర్ చిత్రించి ఇచ్చేరు.వారిచేతులతో నా ముఖం గీయించుకున్న అదృష్టం నాకు పట్టింది. అందుకు కృతజ్ఞత తెలుపుతూ వారికి నేనిచ్చిన పద్యం ఇది.ఎన్నాళ్ళ క్రితమో రాసినది. వారికి ఆత్మశాంతి కలుగుగాక

    రిప్లయితొలగించండి
  7. తెలుగింట జనియించి నలుదిక్కులందున
    ఖ్యాతిగాంచిన కళాజ్యోతి బాపు
    చేతి గీతలతోటి చిత్రలేఖనమందు
    నద్భుతంబుల చేసినట్టి బాపు
    చలనచిత్రములకు జక్కదనముదెచ్చి
    తనదైన శైలితో తనరె బాపు
    ముళ్ళపూడినిగూడి ముచ్చటౌ స్నేహంబు
    తుదివరకు నిలిపె మదిన బాపు

    మూడుకాలాలు ముత్యాల ముగ్గునిలుచు
    భానుడున్నంత కాలము బాపు బొమ్మ
    తెలుగువారి మనంబుల నిలుచునంట
    యాత్మశాంతినొసగు పరమాత్మ బాపు!

    రిప్లయితొలగించండి
  8. కార్టూనిష్టులకతనొక
    కార్టూన్ బ్రహ్మ సినిమాకి కలరద్దిన తా
    నార్టిస్టుల బ్రహ్మ తెలుగు
    నార్టూ హార్టూ రిటార్టు నాతడె బాపూ

    వంపుల సొంపుల పడతుల
    నింపుగ వాల్జెడను దీర్చి నింతకునింతౌ
    నింపును చేసిన కుంచెకు
    వంపొంపునకొక నమస్సు బాపూ నీకూ

    అక్షర రమ్యత కవికిని
    అక్షయముగ బాపు ఫాంటు అందరికీనూ
    అక్షర లక్షల విలువగు
    అక్షరములనిచ్చి మాకు అమరుడవయ్యవ్

    రిప్లయితొలగించండి
  9. లేవు లేవాయె యిక మాకు లేవు బాపు !
    పాడి గాదయ్య మము వీడ పరమ పురుష !
    బాపు బొమ్మలు గనగానె పరవ శింతు
    రఖిల జనములు పుడమిని నదియ మేటి .

    రిప్లయితొలగించండి
  10. హంగుగ బాపు రూపమున హాయిగ నాడుచు రామ గాధకున్
    పొంగుచు నిత్య నూత్నముగ భూరి యశస్సుల నద్దుచుండగా
    రంగు సుదూరమై యెడద రాజుకొనన్ మరి తాళలేక నా
    రంగుల కుంచె రాలిపడె రావణ కాష్ఠము నార్పివేయగన్!

    (బాపును కుంచెగాను, ముళ్ళపూడిని రంగు గాను ఊహించి వ్రాశాను)

    రిప్లయితొలగించండి
  11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    నిజంగా మీరు అదృష్టవంతలు.
    మీ సిడి కవర్ పైన బాపు గీసిన మీ చిత్రం అద్భుతంగా ఉంది.
    బాపు మీద మీరు వ్రాసిన పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శీనా శ్రీనివాస్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    చివరి పద్యం చివర ‘అమరుండైతే’ అనండి. (అమరుడవయ్యవు కదా అని భావం.)
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అందరి వాడవ యైతివి
    యెందరొ మఱి నిన్ను గూర్చి యేడ్చిరి యిచట
    న్నిందరి మనసులు నొవ్వగ
    నెం దుకయా యేగి తీవ యిపుడే బాపూ !


    ఎం దులకో యీ కోపము
    అందరమూ నిన్ను గురిచి యార్తిని నుండన్
    మందిమి మేముం టి మిగా
    నందముగా మమ్ము జూచి యాశి సు లిమ్మా !

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    బాపు
    భావనా పటిమకె రూపు భాసిలంగ
    పుత్తడిన్ మించు నందాల చిత్తరువుల
    బాపు బొమ్మలైదీపించి ప్రబలినారు
    తెలుగు కన్నెలు మరచి పోగలరె నిన్ను
    2.ముజ్జగమ్ముల నాడించు పురుష వరుడు
    స్ఫూర్తి తోడను దిగ్దర్శ మును వహింప
    నిన్ను బిలిచెను రమణుడు సన్నుతించ
    బొమ్మలాట ప్రస్తుతి జేయ రమ్మట౦చు
    3. దివిజువరులు నిన్ మెచ్చిరన్ తృప్తి కలిగె
    కాని నీవు లేని వెలితి గానిపించు
    నవ్యరీతుల రేఖలు భవ్యముగను
    దీర్చ శిష్యుల నాశీర్వ దించ వయ్య

    రిప్లయితొలగించండి
  14. పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
    త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
    పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
    తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
    డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

    రిప్లయితొలగించండి
  15. సుబ్బారావు గారూ,
    మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    చాలా చక్కని పద్యాన్ని అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. ఈ సందర్భంలో నా శ్యామలీయం బ్లాగులోని బాపూరమణీయం టపా పద్యాలుః

    ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
    రాత గీత భువిని రాజ్యమేలె
    రాత నిన్న చనెను గీత నేడు చనెను
    రాత గీత దివిని రాజ్యమేలు

    కం. రావోయీ బాపూ అని
    తా వాత్సల్యంబు మీఱ దశరథసుతుడా
    కైవల్యము నిచ్చుటకై
    రావించుకొనెను రమణను రమ్మన్నట్లులే

    ఆ.వె. బాపు రమణ లేని వసుధనే మెచ్చడు
    రమణ బాపు లేక రమణ కాడు
    రమణ ముందుగానె రాముని చేరగా
    బాపు చేరె రామ పాద మిపుడు

    శా. ఓ బాపూ భవదీయమైన తను వీ యుర్విన్ విసర్జించినన్
    నీ బొమ్మల్ తెలుగిళ్లకిచ్చితివి పోని మ్మంతియే చాలులే
    నీ బంగారు కలంబు చూపగల వన్నెల్ చిన్నెలున్ స్వర్గమం
    దే బాగొప్పగ నాంధ్రమాత యశమున్ హెచ్చింపగా వెల్గుమా

    రిప్లయితొలగించండి
  17. గీత గీత లోనగిలిగింతలఁ గలిపి
    కుంచెఁ గదిపి నాడ వంచితముగ!
    "నవని 'బాపు బొమ్మ' నవరస భరితమ్ము"
    తెలియు గొంతుక లిదె పలుకు నయ్య!

    రిప్లయితొలగించండి