7, సెప్టెంబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1514 (కవిత లల్లకున్న)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కవిత లల్లకున్నఁ గలుగు సుఖము.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు


30 కామెంట్‌లు:

 1. అర్ధరాత్రి వరకు నల్లుతు కవితల
  నిద్రలేక గనుల నీరుగార
  కష్టబడుటగన్న కార్యాలయమునందు
  కవిత లల్లకున్నఁ గలుగు సుఖము

  కంటిపైనగునుకు కరువగు నెటులైన
  కవిత లల్లకున్న, గలుగు సుఖము
  మంచి దార తోటి మధురపద్యమువ్రాయ
  కవనదాహమలవికాదు తీర్చ

  రిప్లయితొలగించండి
 2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘అల్లుచు’ అనండి.

  రిప్లయితొలగించండి
 3. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. కలికి గొణుగుచుండె కంఠమ్ము తగ్గించి
  కూర తెమ్మనంటి దూరదేమి
  కదలరెపుడు జూడ కంప్యూటరే ? పిచ్చి
  కవిత లల్లకున్న గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 5. తిక్కన్న యెవ్వడో తిక్కసన్నాసంచు
  నన్నయ్య అవ్వానికన్నయంచు
  వెర్రి రాతలవాడు యెర్రన్నయేనంచు
  పూతన మామయే పోతనంచు
  చంపకమాలన్న జయమాల్ని చెల్లెలో
  చూడ కాంచనమాల చుట్టమంచు
  తేటగీతి యనిన తెలుయునా మీకంచు
  గాజువాకాపిల్ల కాదొ? యనుచు.

  తెరను వెలుగు వారు దేవతలేనంచు
  దొరల మాట పలుక దొడ్డ లంచు
  తెలుగు తెలియదన్న తెలుగువారలమధ్య
  కవితలల్లకున్న కలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 6. శ్రీగురుభ్యోనమ:

  పదమునొకటి పట్టి పలుమార్లు పలుకుచున్
  విసుగు నొందునట్లు వెగటు గలుగ
  భావమేమిలేక ఫలితము శూన్యమౌ
  కవిత లల్లకున్నఁ గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ సీసపద్య పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. మల్లెల వారి పూరణలు

  కవిత లందు కవులు కలిగింప విజ్ఞతన్
  కవిత లల్ల గాను కలుగు మేలు
  కవిత రెచ్చ గొట్ట కామంబు, క్రోధంబు
  కవిత లల్ల కున్న కలుగు సుఖము

  భావ, రసము లున్న పావన కైతలే
  జగతి దిద్దు నవ్వి సవ్య గతిని
  జనుల మనము నందు చపలత పెంచేటి
  కవిత లల్ల కున్న కలుగు సుఖము

  గుణము లున్న కవిత గొప్పదై వెలుగొందు
  దోష యుతమునైన దొసగుఁ గూర్చు
  జగతి నెందు, నట్ల సభ్యమౌ భావాల
  కవిత లల్ల కున్న కలుగు సుఖము

  కవిత రీతులెన్నొ కాంచమే పెక్కుగా
  వాని యందు మేలు వరలు చుండ
  సేమ మరయ. కీడు సేసెడి భావాల
  కవిత లల్ల కున్న కలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 9. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘పెంచేటి’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘పెంచెడి’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 10. నిద్రపట్టదు కడు నిష్టతో ప్రతిరోజు
  కవితలల్లకున్నఁ గలుగు సుఖము
  నొజ్జ యిచ్చినట్టి యుత్తమ సలహాలు
  స్వీకరించి నపుడు వీక తోడ
  వీక: ఉత్సాహము

  రిప్లయితొలగించండి
 11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ఆర్యా ! ధన్యవాదములు.

  నిన్నటి దత్తపదికి నా పూరణ..

  శ్రీ రాముని గురించి రావణుని తలంపు...

  కనగ దుశ్శాసనుడనౌచు ననికి బంప
  కుంభకర్ణుఁడు విలుధాటి గూలినాడు
  మనసు యోధనుఁడనియెడు మాట మెదిలె
  నాదు యాశకు నిప్పులనతడు బోసె.


  రిప్లయితొలగించండి
 13. కలత పడును మనసు కవులకు ప్రతి రోజు
  కవిత లల్లకున్న, కలుగు సుఖము
  నాటవిడుపు వేళ నాహ్లాద కరమగు
  కవిత లల్లుచున్న కాంక్ష దీరు !

  రిప్లయితొలగించండి
 14. పనులు మానుకొనుచు పదిలంగ గూర్చుని
  కవిత లల్లుచున్న గసురుకొనుచు
  నప్పడాలకర్ర నర్ధాంగి బట్టగా
  కవిత లల్లకున్న కలుగు సుఖము !

  రిప్లయితొలగించండి
 15. శైలజ గారూ,
  మీ తాజాపూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. పూజ్యులు గురుదెవులు శనరయ్య గారికి వందనములు
  చిన్న సంఘటనల చెన్నుగా పత్రిక
  లందు ముఖ్య వార్తలగను జూపి
  దొరతనమును,ప్రజల తూటాడు కొనుచును
  కవిత లల్ల కున్న కలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు గురుదెవులు శనరయ్య గారికి వందనములు
  తెలుగు కవిత నేడు వలుగుజూడదనిన
  గ్రాంధిక౦పుబ్రిల్లి మ్ర్యావు మనుట
  తండులములు నిండే తరలు జోగీ యనుచు
  కవిత లల్లకున్నఁ గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 18. కె.ఈశ్వరప్పగారి పూరణ:
  ప్రేమయన్న పదము కామంముగా మార్చి
  కామమందు మనిషి కసిని బెంచు
  ద్వంద్వ పదములందు వంచన పెంచేటి
  కవితలల్లకున్న గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 19. రవీందర్ గారూ .. బాగుంది.
  ‘కొత్త కవిత ' యనుచు కోరి " తవిక " జెప్పి
  అంటే....(తవిక కూడా జంధ్యాల సినిమా లోదే .. అందువల్ల..)


  అవునూ ! మస్టరుగారూ ! వీర తాడులన్నీ కిశోర్జీకి ఇచ్చేశారా ! ఈ మధ్య ఎవరికీ వేయట్లేదు.

  రిప్లయితొలగించండి
 20. అంట రాని రీతి నాలుపిల్లలుఁ జూచి
  మదన పడెడు నన్ను కదప లేక
  యవసరమ్ము లందు నడుగఁజాలక నిల్పి
  కవితలల్ల కున్న గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
 21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  టైపాట్లు ఉన్నాయి. నన్ను ‘శనరయ్య’ను చేశారు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. అందమైన పదములందు నధిక భావ
  నిధియు, హితముఁ గూర్ప నేర్వవలెను.
  చదువరులకువిసువొసంగెడు విధముగ
  కవిత లల్లకున్నఁ గలుగు సుఖము

  రిప్లయితొలగించండి
 23. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. పూజ్యులు గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు...
  కవితలందు భావుకత్వంబు దెలుపక
  వెంబ డించుచు విని పించు టేల?
  అర్థరహితమైన వ్యర్థ పదాలతో
  కవిత లల్లకున్న కలుగు సుఖము!

  రిప్లయితొలగించండి
 25. కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. భాష భాస మెరిగి భావంబు పలికింప
  కవిత లల్లి నపుడు కలుగు సుఖము
  భాష లేక మిగుల వసివాడి పసలేని
  కవిత లల్ల కున్న కలుగు సుఖము
  కొరుప్రోలు రాధ కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 27. భాష భాస మెరిగి భావంబు పలికింప
  కవిత లల్లి నపుడు కలుగు సుఖము
  భాష లేక మిగుల వసివాడి పసలేని
  కవిత లల్ల కున్న కలుగు సుఖము
  కొరుప్రోలు రాధ కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 28. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి