15, సెప్టెంబర్ 2014, సోమవారం

శ్రద్ధాంజలి

బాల్యమిత్రుడు వినోద్ కుమార్‍కు శ్రద్ధాంజలి.
 
మా బాల్యమిత్రుడు వినోద్ కుమార్ మరణం మా మిత్రబృందాన్ని కలచివేసింది. 
చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. పెద్దయ్యాక సుఖదుఃఖాలను పంచుకున్నాం. 
నవ్వుతూ, నవ్విస్తూ మాతో అన్యోన్యంగా మెలగిన మిత్రుని మరణం నన్ను విషాదంలో ముంచెత్తింది.
కొంతకాలం ‘కవితావినోదం’ (http://kavithavinodam.blogspot.in) అనే బ్లాగును నిర్వహించి 
తన కవితలను కొన్నిటికి ప్రకటించాడు. 
చిన్నప్పుడు నేను వ్రాసిన కొన్ని వచన కవితలను ‘శంకర్’ పేరుతో అందులో ప్రకటించాడు.

వినోద్ కుమార్ వ్రాసిన ఒక కవిత....
పరిహారం కాలేదా ప్రభూ?
నీఇంట, నీవెంట, నీసందిట
నేనున్నప్పుడు,
అసంకిల్పితంగా ఎప్పుడైనా
ఎదురాడినానా ప్రభూ?

నీచెంత ఏచింత లేకుండా ఉంటూ
అనాలోచితంగా నోరుజారి
కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?

నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను
నా కలవరింతలలో నిన్ను కలతపరచే
కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?

నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ
నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను
కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?

తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?
మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?
అయిందా? నన్ను చేర్చుకో ..
లేదా ... నాతో ఉండు!

5 కామెంట్‌లు:

  1. మాస్టారూ! మీ మిత్రుని ఆత్మకు శాంతి కలుగుగాక ! భగవంతుడు మీ మిత్రబృందానికి మనోనిబ్బరము ప్రసాదిన్చుగాక!

    రిప్లయితొలగించండి
  2. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌
    నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
    తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
    నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.(SATYAHARISCHANDRA)

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ ! కవిత ద్వారా మీ బాల్య మిత్రులు ఎంత సున్నిత మనస్కులో అర్థమౌతుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని మీకు మనో నిబ్బరము కలగాలని భగవంతుని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  4. నీదుమిత్రుని మరణంబు మదిని దొలిచె
    శంక రార్యుడ !కోరుదు శంభు నిపుడు
    వారి యాత్మకు శాంతిని వడిగ నిమ్ము
    అనుచు , నంద జేయుడు వారి యాత్ము లకును
    సాను భూతిని నాదిగా సామి !మీరు

    రిప్లయితొలగించండి
  5. వినోద్ కుమార్ గారి ఆత్మకు శాంతి కలుగు గాక !

    రిప్లయితొలగించండి