15, జూన్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 736 (రక్షణమ్ము నొసఁగు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రక్షణమ్ము నొసఁగు రాక్షసుండు.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. దైవమనఁగ వేరు తలపులు లేకుండ
    రక్షణమ్మునొసగు; రాక్షసుండు
    పరుల బాధపెట్టు పాపపు పనులను
    చేయుచుండు తాను సిగ్గుపడక.

    రిప్లయితొలగించండి
  2. తాను తనదియనుచు తామసబుద్ధితొ
    కూర్మితోడదెచ్చి కూడబెట్టు
    తప్పకయంతయు తానేయనుభవింప
    రక్షణమ్ము నొసగు రాక్షసుండు

    రిప్లయితొలగించండి
  3. నా పూరణ...

    (దుర్యోధనుఁడు శకునితో....)

    అనిలసుతుని పుత్త్రుఁ డా ఘటోత్కచుఁ డెన్నొ
    మాయలందు మేటి, మామ! వినుము;
    భండనమునఁ జెలఁగి పాండవ సేనకు
    రక్షణమ్ము నొసఁగు రాక్షసుండు.

    రిప్లయితొలగించండి
  4. దేవ,మునులనెల్ల ధిక్కార బుద్ధితో
    ధూషణముల జేయు దుర్మధాంధు
    లసురజాతికెపుడు నత్యంత యార్తితో
    రక్షణమ్ము నొసగు రాక్షసుండు

    రిప్లయితొలగించండి
  5. రక్షణమ్ము నొసగు రాక్షసుడతడంచు
    భీమసేను సుతుడు పేరుగాంచె
    ఆ ఘటోత్కచుడు మహాపరాక్రమశాలి
    తత్త్వ వేత్త సత్య ధర్మ శీలి

    రిప్లయితొలగించండి
  6. ధర్మ తత్పరుండు దశరథసూనుని
    స్నేహితుండు సకల నీతిశాలి
    యగు విభీషణుండు ఆశ్రితులకు నెల్ల
    రక్షణమ్ము నొసగు రాక్షసుండు

    రిప్లయితొలగించండి
  7. (చిన్న సవరణతో)
    ధర్మ తత్పరుండు దశరథసూనుని
    స్నేహితుండు సకల నీతిశాలి
    యగు విభీషణుడు సమాశ్రితులకు నెల్ల
    రక్షణమ్ము నొసగు రాక్షసుండు

    రిప్లయితొలగించండి
  8. ఎల్ల వేళలందు నీ శ్వరు వేడిన
    రక్ష ణమ్ము నొసగు , రాక్ష సుండు
    పాప కర్మ లందు బద్ధుడై యుండుచు
    మాంస భక్ష ణంబు బరగు చుండు .

    రిప్లయితొలగించండి
  9. బలి,విభీషణ,ప్రహ్లాద ,ప్రముఖ దైత్య
    వరులు ధర్మమ్ము గాచిరి వారి వంశ
    మేది యైన సద్గుణములె కాదె వలయు
    రక్షణమ్ము నొసంగును రాక్షసుండు.
    అనుకోకుండా ఆటవెలది బదులు తేటగీతి లో పూరించినందుకు మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  10. బలి,విభీషణ,ప్రహ్లాద ,ప్రముఖ దైత్య
    వరులు ధర్మమ్ము గాచిరి వారి వంశ
    మేది యైన సద్గుణములె కాదె వలయు
    రక్షణమ్ము నొసంగును రాక్షసుండు.
    అనుకోకుండా ఆటవెలది బదులు తేటగీతి లో పూరించినందుకు మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  11. అరయ రావణుండు
    హరివరాధీనుడై
    మోక్షగాముడైనరాక్షసుండు
    తాక కుండఁసీతఁ తనచావుకైదెచ్చి
    రక్షణమ్మునొసఁగురాక్షసుండు

    రిప్లయితొలగించండి
  12. దాన మీయ గోరె దనుజుడై ననుబలి
    తనదు క్షేమ మెంచ తలపు లేక
    ఆది శేషు డొచ్చి యడుగంగ కొరతేమి
    రక్ష ణమ్ము నొసగు రాక్ష సుండు !

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘తప్పక యంతయు’ను ‘తప్పక సకలమ్ము’ అందాం.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఘటోత్కచ, విభీషణుల గురించిన మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    సమస్య పాదాన్ని విరిచి చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    చివరి పాదంలో యతిదోషం. ‘మాంసభక్షణంబు మానకుండు’ అంటే సరి!
    *
    కమనీయం గారూ,
    అప్పుడప్పుడు నేనూ ఇలాంటి పొరపాట్లు చేస్తూనే ఉంటాను. సమస్యపాదాన్ని అనుగుణంగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ లోని భావం ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
    ‘హరివరాధీనుడై...’?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 15, 2012 9:26:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    లలితహృదయుడైన రాముని గొలచిన
    రక్షణమ్ము నొసఁగు, రాక్షసుండు
    వచ్చి శరణమనుచు పదముల పై వ్రాల
    అభయ మొసగు వాడు యతడు గాడె!

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    చివరిపాదంలో ‘వాడు + అతడు’ అన్నప్పుడు యడాగమం రాదు.
    ‘అభయ మొసగునట్టి యధిపు డతడు’ అందామా?

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 15, 2012 11:24:00 PM

    ధన్యవాదములు గురువుగారు. మీ ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.

    రిప్లయితొలగించండి
  17. శ్రీగురుభ్యోనమః
    ఆర్యా,ధన్యవాదములు.
    హరి వర+అధీనుడై అనవచ్చా?దయతో తెలియజేయప్రార్థన.స్వస్తి.

    రిప్లయితొలగించండి