20, జూన్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 741 (మద్యనిషేధచట్టమును)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. (మిత్రులారా! మద్య నిషేధ చట్టము అనేది దుష్ట సమాసము కదా)

    మద్య నిషేధ చట్టమను మాటల పొందిక లెస్స యౌనొకో?
    మద్యపు మాటలేల విను మంచి విశేషములైన చెప్పుమా
    పద్య రసప్రియా మనకు పద్యమె హృద్యము గాన కమ్మనౌ
    పద్యరసమ్ము గ్రోలుమిదె బాగుగ వీనుల విందులొందుమా

    రిప్లయితొలగించండి
  2. విద్యను గల్గియుంజనులు వింతగ జంతుగుణమ్ముఁజూపుచున్
    మద్యముఁ ద్రావినట్టి తఱి మైకము మేనినిఁ గ్రమ్మునందు రా
    యుద్యమమందు వాక్కునిడి యొప్పుగ కూర్చక తప్పులున్నచో..
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  3. మద్యపు టంగడుల్ వెలసె మాలికలై మన ధాత్రి నెల్లెడన్
    మద్యము కాల్వలై మనకు మంచి జలమ్ముల మించి యౌనిటన్
    మద్య భయంకరాసురుని మానము ప్రాణము దీయలేని యీ
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  4. మద్యవిషేశ విక్రయమె మాయుపజీవనమంచు మందిగా
    ఉద్యమదారులెల్లజని వొత్తిడితేగ ప్రభుత్వమోడి త-
    న్మద్యల రాజకీయమున మానుచు వాపసుదీయజేసినా
    మద్యనిషేదచట్టమును మానునులెల్ల దిరస్కరించిరే

    రిప్లయితొలగించండి
  5. పద్యము జెప్పుచుంటినిక వ్రాయుము పుత్రుడ!చెప్పు నాన్న! వ్రాయ్!
    "మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!"
    పద్యము నొక్క పాద మిట వ్రాసితి, చెప్పెద నాలకింపుమా
    "మద్య 'నిషా' ద చట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!"

    రిప్లయితొలగించండి
  6. మద్యమనర్థ హేతువగు మద్యము శ్రీల హరించి వేసెడిన్
    మద్యము విద్యలందుడిచి మానము బాపును మానవాళికిన్
    మద్యపు రక్కసిన్ దునిమి మాలిమి నేలని సారహీనమౌ
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  7. మద్యము భర్తృ మానమును మాయను ముంచి హరించి వేసెడిన్
    మద్యము పిల్ల పాపలను మాలిమికిన్ కడు దూరముంచెడిన్
    మద్యము లేమి జేసెడిని మద్యము నాపగ లేని డొల్లయౌ
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  8. విద్యల బాపు నెల్లరకు వీధిన బెట్టెడి నింటి గుట్టులన్
    సద్యశ మార్పి సజ్జనుని చప్పున మార్చును నీచ బుద్ధిగన్
    ఉద్యమ మెంత జేసినను యుల్కదు పల్కదు మేలు జేయదీ
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  9. సద్యశమందజేయునిక సౌఖ్యములిచ్చును స్వాగతించరే
    మద్యనిషేధచట్టమును మానినులెల్లఁ, తిరస్కరించిరే(తిరస్కరించిరి+ఏ)
    మద్యము సర్వశక్తులను మంటలగాల్చు, ధనంబు, కీర్తులన్
    విద్యను, బంధుభావముల, వేగము గూల్చునొ దాని నెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,

    దుష్టమైన సమాసమే; దొసఁగు గాన
    రానిదై యా ప్రయోగమ్ము ప్రజల నాల్క
    లందు నడయాడుచున్నదే! యందు వలన
    స్వీకరించుట తగునని చెప్పవచ్చు!

    రిప్లయితొలగించండి
  11. ఏ చట్టమొచ్చినా ఆడకా, మగకా, ఇద్దరకూనా అనేది చాలా పాశ్చాత్య దేశాలలో మొదటి ప్రశ్న. ఇక్కడ కొంచెం ఆడవాళ్ళు అగ్రెసివ్ కాబట్టి, హాస్యం జోడిస్తూ:
    సేద్యము జేయు రైతులటఁ జేరి బిగిన్చిరి బుడ్డి యేకమై
    సద్యము యాడువారలట చట్టము దెచ్చిరి పొందుగా నికన్
    మద్యము త్రాగుటన్ననది మానినులొక్కర కేననంగ స్త్రీ
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  12. ఉద్యమమెంతగా నడుప, ,నుత్తమ సూక్తుల నెన్ని చెప్పినన్
    మద్యము త్రాగువారలది మానరు దేశవిదేశ సీమలన్,
    మద్యనిషేధముల్ విఫల మాయెను,స్త్రీలును దాని నేర్వగా
    మద్యనిషేధ చట్టమును మానినులెల్ల దిరస్కరించిరే ?
    ప్రాచీన కాలం నుంచి మనదేశంలోను,ఇతర దేశాల్లోను కొందరు స్త్రీలు,పురుషులు,దేవతలు కూడా సురా(మద్య) పానం చేస్తున్నట్లు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  13. ఉద్యమ మేదియైన జను లూరక పానము లేక యుందురే
    హృద్యము గాను మేనిశ్రమ యూరట జెందను ద్రాగు చుండగా
    తధ్యము విప్లవమ్ము ప్రతి దారయు భర్తల బాధలన్ గనన్
    మధ్య నిషేధ చట్టమును మానిను లెల్ల దిరస్క రించిరే !

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 20, 2012 7:03:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    మద్యముగ్రోలుచున్ మనిషి మానవధర్మము మంటగల్పగా
    నుద్యమకారులైరి మరి యోర్పు నసించగ వేణులెల్లరున్
    చోద్యముజేయుచున్ ప్రభుత చూడగ పూర్తిగ రద్దుజేసె నా
    మద్యనిషేధచట్టమును, మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  15. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    సద్యశ మందఁగా ప్రభుత చట్ట మదేమనుపేరఁ దెచ్చెనో
    మద్యముఁ ద్రాగఁ గూడదని? మక్కువ మీఱఁగ నేర్పుచుండినన్
    విద్యల నేర్తు రెవ్వ? రవివేకిని మంత్రినిఁ జేయ మెచ్చిరా?
    మద్య నిషేధ చట్టమును; మానిను లెల్లఁ; దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి
  16. మద్యనిషేధ చట్టమును మాన్యుడు రాము(డు రూపు దిద్దగన్
    చోద్య మదేమియో పిదప చోదకులెల్లరు నీరుగారినన్
    బాధ్యత లేక పాక్షికపు మార్పులజేయగ నిశ్చయించినన్
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    (రాముడనగ శ్రీ నందమూరి తారక రామరావుగారనుకొనప్రార్థన )

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,

    పద్యరసప్రియులమె కద!
    హృద్యముగాఁ బద్యరచనమే మన కిష్టం
    బాద్యము రసానుభూతియె
    మద్యము మనకేల యనిన మాట హిత మయెన్.

    దుష్టసమాసముఁ గనిన న
    నిష్టము పూరణమునందు హెచ్చెను, మీకున్
    కష్టము గలిగించెనొ ‘ముద
    నష్టపు’ నా మాట, నతులు నను మన్నింపన్

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీదేవి గారూ,
    లోపాలున్న చట్టాన్ని తిరస్కరించారన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    డొల్లయైన చట్టాన్ని నిరసించిరన్న మీ నాలుగు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని పద్యంలో కొన్ని దోషాలున్నాయి. బ్రాకెట్లలో నా సవరణలతో మీ పద్యం....

    మద్యవిశేష విక్రయమె మా యుపజీవనమంచు (గుంపు)గా
    ఉద్యమ(కా)రులెల్లజని (యొ)త్తిడి(నివ్వ) ప్రభుత్వమోడి త-
    న్మద్యల రాజకీయమున మానుచు (తా వెను)దీయజేసినా
    మద్యనిషేదచట్టమును మానునులెల్ల దిరస్కరించిరే
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చమత్కార జనకంగా ఉంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ చక్కని విరుపుతో, అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    హాస్యస్ఫోరకమై మీ పూరన అలరిస్తున్నది. అభినందనలు.
    ‘సద్యమ యాడువారలు...’ అందాం. ‘సద్యము + ఆడు..." అన్నప్పుడు యడాగమం రాదు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాకుంటే మూడో పాదంలో ప్రాస తప్పింది.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వేణులందరున్’...? ‘కాంతలందరున్’ అందాం...
    *
    గుండు మధుసూదన్ గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సేద్యము జేయు రైతులకు సేద్యము వీడగ పిచ్చిపట్టదా?
    పద్యము వ్రాయు శాస్త్రులకు పద్యము వీడగ పిచ్చిపట్టదా?
    మద్యము త్రాగు భామలకు మద్యము వీడగ పిచ్చిపట్టగా
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    రిప్లయితొలగించండి


  20. చోద్యము! రాజశేఖరుని‌ చొక్కపు టౌరసుడా!యిదేమయా
    మద్యము త్రాగి మూలని ఢమాలని కూలుచు తొంగు మావలే
    మద్యము లేక తొంగుటకు మార్పును చెందక బాదు చుండగా
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!

    జిలేబి

    రిప్లయితొలగించండి