3, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1462 (సవతి లేని యింట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
సవతి లేని యింట సౌఖ్య మేది?

21 కామెంట్‌లు:


 1. వసతియై కలిగిన ఉద్యోగమూ ,
  అనుకూలవతియైన 'జిలేబి',
  అన్నలక్ష్మియై వెలయు 'ర'
  సవతి', లేని ఇంట సౌఖ్యమేది !!

  శుభోదయం
  జిలేబి
  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. చిలిపి పనులు జేసి శింగార మొలికించి
  నుల్ల మలర ప్రేమ జల్లు విరియ
  మోద మందు ముంచి మురిపించు మధుర ర
  సవతి లేని యింట సౌఖ్య మేది ?

  రిప్లయితొలగించండి
 3. అన్ని వసతులున్న నందాల గ్యహమున్న
  భార్య లుండు చోటు వంట గదియె
  సంత సమ్ము నిీయు సరియైన మంచి ర
  సవతి , లేని ఇంట సౌఖ్య మేది

  రిప్లయితొలగించండి

 4. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మొదట నౌకరీయె మోహంపు సతి యౌను
  పిదప సవతి వచ్చె పెండ్లి యాడ
  నొకతె ధనము నీయ యొకతె సంతు నిడును
  సవతి లేని యింట సౌఖ్య మేది?

  రిప్లయితొలగించండి
 5. తెల్లవారగానె తీరని జగడాలు
  నాళ కూపమందు నారిమణుల
  జీవనంబు లోకసేవ్యధాతు, గౌరి
  సవతి లేని యింట సౌఖ్య మేది ?

  రిప్లయితొలగించండి
 6. సతి వసతి పరపతి సంప్రాప్త మైనచో
  బుద్ధి మతికి తృప్తి పుడమి లోన
  రుచి గలట్టి భుక్తి రూపునొసగని ర
  సవతి లేని యింట సౌఖ్య మేది?

  రిప్లయితొలగించండి
 7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

  సంతసమున మెలఁగు సహధర్మచరి యయ్యు
  భర్త బాధ్యతలను పంచుకొనుచు
  ప్రణయకలహమందు ప్రతిభఁ జూపెడు విలా
  సవతి లేని యింట సౌఖ్య మేది?

  రిప్లయితొలగించండి
 8. జిలేబీ గారూ,
  _/\_
  *
  అక్కయ్యా,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  కాని కొన్ని టైపు, సంధి దోషాలున్నాయి.. మీ పద్యానికి నా సవరణ...

  చిలిపి పనులు జేసి శృంగార మొలికించి
  యుల్ల మలర ప్రేమ జల్లు కురిసి
  మోద మందు ముంచి మురిపించు మధుర ర
  సవతి లేని యింట సౌఖ్య మేది ?
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గృహము’ టైపాటు వల్ల ‘గ్యహము’ అయింది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పులుసుల/ నారగింతుము గద చూరగొనుచు/ నన్ని...’ అనండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  నిజమే! కొందరికి ఉద్యోగమే మొదటి పెళ్ళాం.. బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  ‘ధనము నీయ నొకతె..’ అనండి.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  ‘గౌరి సవతి’ మంచి భావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. సుఖము శాంతి గలుగు సుజనులార!మనకు
  సవతి లేని యింట సౌఖ్య మేది ?
  సంపద లవి యుండి సరియగు నారోగ్య
  వంతు డుమఱి కాని వాని కిలను

  రిప్లయితొలగించండి
 10. దాస్య బంధములను తార్క్ష్యుడు దొలగించె
  వినత సంతసమున వివశ యాయె
  కలగి మనసు తలచె కద్రువ 'బానిస
  సవతి లేని యింట సౌఖ్య మేది?'

  రిప్లయితొలగించండి
 11. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  2. పక్క జేరి శివుని బ౦ధి౦చె పార్వతి
  నెత్తి నెక్కిగంగ జుత్తు నమరె
  సవతి లేని యింట సౌఖ్యమే దిగులని
  మత్తు దీర నాట్య మాడె శివుడు

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మల్లెల వారి పూరణలు:కష్ట సుఖము లవియెగల్గుగా బ్రతుకున
  దుఃఖ మింత లేని తోష మదియె
  చెడ్డ లేని మంచి జెందవు నాణ్యతన్
  సవతి లేని యింట సౌఖ్య మేది?
  జీవనమ్ము గడుప చిన్నదౌ యుద్యోగ
  మున్న గాని సౌఖ్య ముండ దె౦దు
  వృత్తి పెద్ద భార్య పిదపనే యిల్లాలు
  సవతి లేని యింట సౌఖ్య మేది

  రిప్లయితొలగించండి
 14. ఇంతి యున్న చాలు యింటి వెలుగు వచ్చు
  కస్సు బుస్సు లాడు కాంత వలదు
  మగని మనసు నెరిగి మసలు కొనెడి సర
  సవతి లేని యింట సౌఖ్య మేది?

  రిప్లయితొలగించండి
 15. శక్తి నిచ్చు నట్టి శాంకరి తోడున్న
  చదువులమ్మ తోడు చక్క నున్న
  కలుము లొసగు తల్లి కమల, భూదేవికి
  సవతి లేని యింట సౌఖ్య మేది?

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మజీ రావు గారూ,
  మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చాలు నింటివెలుగు’ అనండి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమనస్సులు.

  లోని కడుగిడఁగను వీనుల విందైన
  మాటలాడి, తోషమందుఁ దేల్చి,
  మగని గారవించఁగను బ్రియోక్తి సుధార
  సవతి లేని యింట సౌఖ్యమేది?

  రిప్లయితొలగించండి
 18. అనుదినము తగవుల కలవాటు పడి పోయి
  సవతి ఊరి కి చన సాధ్వి యొకతె
  సవతి లేని యింట సౌఖ్య మేది? యనుచు
  చిత్త మందు తలచె చిత్ర మదియె

  రిప్లయితొలగించండి
 19. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. అమర పురికి నధిపతివలె నతివ గృహపు రాణియై
  క్రమముగాను యందరికిని కాలసిన కార్యముల్
  శమన రిపుని శక్తి తోడ శౌర్యత జరిపించుచూ
  శమనియందు,దినమునందు,సేవలెపుడు జేయుచూ

  నమదుపడులు ప్రేమతోడ నతివ యందజేయుచూ
  సుమశరుని శలాకము వలె చుట్టి మగని సొక్కుచూ
  సమముగా కుటుంబ కార్య సామరసతను నిల్పు యా
  సమరసవతి లేని ఇంట సౌఖ్యమేది చెప్పుమా!

  (శమన రిపుడు = సూర్యుడు, శమని = రాత్రి, నమదుపడులు = నైవేద్యములు - ఆహార పానీయాదులు, సుమశరుడు = మన్మధుడు, శలాకము = బాణము)

  రిప్లయితొలగించండి
 21. హరికి సిరులరాణి మరియొకతి ధరణి
  భార్యలగుచు నొప్పు భాగ్యమొప్ప
  పుడమినున్న మనకు గడువగ భూదేవి
  సవతి లేని యింట సౌఖ్యమేది ?

  రిప్లయితొలగించండి