4, జులై 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 19

రామాయణము-
సీ.      విహగనాథుఁడు శత్రు(భీముఁ డెచ్చయి కెడ
పి పరు మహాహి డిం(దుపడక మిగు  
లుగతి రాముఁడు దీర్చుఁ బగ నని ముని గొన
(బు ధృతిఁ గూడె; దదనుజధృతిఁ గాంచె)
జటికోటి భూపాగ్ర(సత్సుతుఁ గని యేక
చక్రపురమ మాధు)రిక్రమసుచ
రితదూరఖలులన్ హరింపదె పెక్కు మా
ఱు లటులను రఘువరుని ప్రతాప
గీ.      మొక్కటే చాలు దనుజుల నుడుప ననెను
దారిలోఁ, గూర్మిఁ జూచెనా తాపసాధి
కని(కరము నృపజులు ద్విజగతుల; నెఱపఁ)
గ సవము ముని చెఱుపవచ్చి రసురు లపుడు. (౩౪)
భారతము-
ఆ.      భీముఁ డెచ్చయి కెడపి పరు మహాహిడిం
బు ధృతి, గూడెఁ దదనుజ ధృతి; గాంచె
సత్సుతుఁ; గని యేకచక్రపురమ మాధు
కరము నృపజులు ద్విజగతుల నెఱప. (౩౪)

టీక- (రా) శత్రుభీముఁడు = విరోధులకు భయంకరుఁడు; మహాహిన్ = గొప్పపామును; గొనబుధృతిన్ = మనోజ్ఞమగు సంతసమును; తదనుజధృతిన్ = అతని తమ్మునియొక్క (లక్ష్మణుని) ధైర్యమును; ఏకచక్రపురము = ఒక్క (విష్ణు)చక్రముయొక్క భాగ్యమే; ద్విజగతులన్ = పక్షుల గమనమును.
(భా) హిడింబు = హిడింబుఁడను రాక్షసుని; ధృతిన్ = ధైర్యముతో; తదనుజన్ = అతని చెల్లెలగు హిడింబిని; ధృతిన్ = సంతోషముతో; ద్విజగతులన్ = బ్రాహ్మణుల విధముతో; సత్సుతు = ఘటోత్కచుని;   విహగనాథుఁడు = గరుత్మంతుడు; జటికోటి = మునులగుంపు.

రావిపాటి లక్ష్మీనారాయణ

1 కామెంట్‌: