29, జులై 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1488 (గోపాలుడు మెచ్చునయ్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    బకాసుర వధ :

    01)
    ______________________________

    కాపాడగ బాలకులను
    గోపాలుడు మెచ్చునయ్య - కొంగ జపమ్మున్ !
    పాపాత్ముడు చే బడెనని
    కోపోద్రేకమ్ము హెచ్చ - కొక్కెర జంపెన్ !
    ______________________________
    కొక్కెర = కొంగ

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  3. పాపాలు జేసి జేసి కొండొకచో కోరికలు
    కోరి కోరి ఆ మీదట కొంగ జపము జేయ
    మనసు నిలువునా 'నర వానరా' ఏ
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్ ?!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కాపాడును గోపూజ లనగ
    గోపాలుడు మెచ్చు నయ్య , కొంగ జపమ్ము
    న్నేపాప మెఱుగని చేపలు
    వాపోవుచు దిరుగు చుండు వాగులు వంకల్

    రిప్లయితొలగించండి
  5. పాపాత్ముల కాపాడును
    గోపాలుడు; మెచ్చునయ్య! కొంగజపమ్మున్
    యేపున లోకపు తీరిది
    చేపలవలె మోసపోయి చెంతకుచేరన్

    రిప్లయితొలగించండి
  6. గోపికల వంపు సొంపులు
    గోపాలుడు మెచ్చునయ్య, కొంగ జపమ్మున్
    సాపాటు కొరకుఁ జేయును
    ఏపాటు పడకను తిండి యేవిధి వచ్చున్

    రిప్లయితొలగించండి
  7. కాపాడ నికృష్ట జనుల
    గోపాలుడు మెచ్చునయ్య; కొంగ జపమ్మున్
    పాపాలు కోట్లు జేయుచు
    శాపాలను పెట్టెదనుచు జడి పించుటకే!

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    గోపికలాడిరి కల్లలు
    యే పాపము నెరుగనంచు నింతి యశోదన్
    కోపి౦పకు మని వేడిన
    గోపాలుడు మెచ్చు నయ్య కొంగ జపమ్మున్

    రిప్లయితొలగించండి
  9. లోపలి నీ మానసమది
    కూపమ్మో నింగి నంటు గోపుర శిఖమో
    చూపెడు నంతర్యామియె
    గోపాలుడు, మెచ్చు నయ్య కొంగ జపమ్మున్?

    రిప్లయితొలగించండి
  10. కోపము లేకను పశువుల
    నోపికగా గాచు వేళ నొక కాలిపయిన్
    దాపించక నుండు గనుక
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్!

    రిప్లయితొలగించండి
  11. గోపకులు వెన్న దింపిన
    గోపాలుడు మెచ్చునయ్య, !కొంగ జపమ్ము
    న్జేపల బట్టుట కొఱకై
    నోపికగా జేయుచుండు నొంటి ప దముపైన్

    రిప్లయితొలగించండి
  12. గోపెమ్మ వెన్న ముద్దలు
    గోపాలుడు మెచ్చునయ్య, కొంగ జపంబున్
    జేపట్టియు పట్టుకొనిన
    చేపల నది మెచ్చునయ్య చెరువుల చెంతన్

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. మల్లెల వారి పూరణలు

    కోపాలకు, తాపాలకు
    శాపాలిడు నా తమసము, జపమున పోదా
    రూపాన్ని మనసు నిలపక
    గోపాలుడు మెచ్చునయ్య, కొంగ జపంబున్?

    ధూపము, దీపము లాదిడ
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపంబున్?
    పాపాలను వీడక, మది
    తాపూజల సేయ ఫలము దక్కదు గదరా!

    పాపాలను వీడక తా
    వేపూజల సేయ, నట్లు పెద్దగ నటనన్
    రూపింప మేలు కాదుగ
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపంబున్?

    గోపాల నామ మెలమిని
    పాపాలవి తాకకుండు, భజనలు సేయన్,
    కాపుండును జనులకు తా
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపంబున్?

    రిప్లయితొలగించండి
  15. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం.....

    పాపములు పెక్కు జేసియు
    కోరిక లగణితముగాగ కోరుచు నిక నీ
    దేరా భార మన నెటుల
    గోపాలుఁడు మెచ్చునయ్య కొంగజపమ్ముల్?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    1,3 పాదాలలో గణదోషం.
    మొదటిపాదాన్ని ‘కాపాడును గోపూజలు’ అనండి.. రెండవ పాదానికి సవరణ సూచించలేకపోతున్నాను.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జపమ్మున్ + ఏపున’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘జమమ్ము/ న్నేపున’ అనడంలో దోషం లేదు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జేయును + ఏపాటును’ అని విసంధిగా వ్రాయరాదు. అక్కడ యడాగమం కూడా రాదు...‘సాపాటుకె చేయును తా/ నేపాటును’ అందాం.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కల్లలు + ఏ పాపము = కల్ల లేపాపము’ అవుతుంది. అక్కడ ‘గోపికలు కల్లలాడగ/ నేపాపము...’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. జిలేబీ గారి భావానికి నేనిచ్చిన పద్యరూపంలో ప్రాస తప్పిన విషయాన్ని చంద్రమౌళి గారు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు.
    సవరించిన పద్యం....

    పాపములు పెక్కు జేసియు
    నేపుగ గోరికలు కోరి హే హరి దయనే
    చూపుమను దొంగభక్తుల
    గోపాలుఁడు మెచ్చునయ్య కొంగజపమ్ముల్?

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మీ సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకు నమస్కారములు.

    (పై పై నటనలుగల నటులను రాంగోపాల్ వర్మ మెచ్చఁడనుట)

    ఏపాటి మనము నిడకయె
    పై పయి నటనములు సేసి పైకమ్మడుగన్
    దాపుఁ జను నటులఁ గని రాం
    గోపాలుఁడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్?

    రిప్లయితొలగించండి
  19. సాపాటు లేక మాడిన
    గోపాలకుడొకని వేటకొనసాగి బక
    వ్యాపకమున వలవిసిరిన
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గోపాలానుజ కనుగొని
    యా పార్ధుని కపటయతిగ ననుకొని విరహం
    బాపుమ నుచుఁ దానిట్లనె
    గోపాలుడు మెచ్చు నయ్య కొంగ జపమ్మున్

    రిప్లయితొలగించండి
  22. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. చేపల రూపున మెలగెడి
    పాపమ్ముల మ్రింగుచుండి బకపతి వోలె
    న్నోపుచు ధ్యానించినచో
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్

    రిప్లయితొలగించండి
  24. పాపాత్ములు మేలుకొనుచు
    దాపున నెన్నికలు రాగ దండుల వోటర్
    చేపల కొరకై సలుపగ
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్

    రిప్లయితొలగించండి


  25. పాపాత్ముడ! సత్యమగున
    కోపద్ధతి లేక యిట్లు కూయన్ దుష్టుం
    డా! పద పదవయ్యా యే
    గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి