10, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1469 (వాణి వారవనితలందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వాణి వారవనితలందు వాసికెక్కె.
(‘రౌడిరాజ్యం’ బ్లాగునుండి)

22 కామెంట్‌లు:

  1. కవిత వాద్య నృత్యోల్లాస కళల మూర్తి
    గీత గాంధర్వ విద్యలకీడు కీర్తి
    స్వామిని గొలిచి బహుగుణశాలి మంజు-
    వాణి వారవనితలందు వాసికెక్కె

    రిప్లయితొలగించండి
  2. తెలుగు నాటకములలోన తీరుగాను
    తెలియ చింతామణీ పేరు వెలిగిపోవు
    మరలచూడగ పేరొంది మగువ మంజు
    వాణి, వారవనితలందు వాసికెక్కె.

    రిప్లయితొలగించండి
  3. సరస భాషణంబు యురకలెత్తించగన్
    భోజనంపు పిదప బుగ్గ గిల్ల
    " మోటు చేయ బోకు మొదటి బేరమిదను "
    వాణి వార వనిత లందు వాసి కెక్కె!

    రిప్లయితొలగించండి
  4. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చింతామణీ’ అని దీర్ఘాంతంగా ప్రయోగించారు. అక్కడ ‘తెలియగను చింతామణి పేరు...’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరి పాదం తేటగీతి... వాణి శబ్దాన్ని పైపాదానికి తేగలిగితే మొత్తం ఆటవెలది అవుతుంది. ‘మోటు చేయబోకు పోపొ మ్మనెడు వాణి/ వారవనితలందు..’ అందామా?

    రిప్లయితొలగించండి

  5. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    పూరణ1:జాణతనమున తరుణ౦పు జవ్వనమున
    సరస భావ చేష్టలను, యొరుల
    సేమ మరయగ గురజాడ సృష్టి మధుర
    వాణి వార వనిత లందు వాసి కెక్కె
    2.దేవలోకాన నొకపరి దేవ గణిక
    లందు నందాల నృత్యంపు పందెమమరె
    రంభ,”యందాల రాణి”,యూర్వశి యె “నాట్య
    వాణి” వార వనిత లందు వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మల్లెల వారిపూరణ
    .భక్త”చింతామణి”యె తాను పాపములను
    చెందకుంటయె గాకను చేసె విటులు
    కల్గ ముక్తిని తెలుగు లొ “కాళ్ళకూరి”
    వాణి వార వనిత లందు వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
  7. అల గిరీశము తలెచెనా డతివ'' మధుర
    వాణి'' వారవనిత లందు వాసి కెక్కె.
    మధుర భాష, భావము,గుణ, మతి శయిల్లు
    కాంత సంస్కార వంతుని గాగ మలచె

    రిప్లయితొలగించండి
  8. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా గురజాడవారి ‘మధురవాణి’ని ఎవరు ప్రస్తావిస్తారా అని ఎదురుచూస్తున్నాను. ఆ పని మీరు చేశారు. సంతోషం. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం.. ‘సరస శృంగార భావ చేష్టల నొరులను’ అందామా?
    రెండవ పూరణలో ‘నాట్యవాణి’ ప్రయోగం అన్వయించడం లేదని అనుమానం.

    రిప్లయితొలగించండి
  9. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. రంకులాడికి తెలుసును బొంకు లన్ని
    జారులను మబ్య పెట్టియు కోరుకున్న
    యాస్థి రాబట్టుకొను మేటి యాటవెలది
    వాణి, వార వనితలందు వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
  11. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మల్లెల వారిపూరణ
    2. త౦జపుర రఘునాధు నాస్థానమందు
    ముద్దుపళని గణిక యైన,ముదము గూర్చె
    కావ్య రాజినoది౦చెను ఘనము గాను
    వాణి, వార వనిత లందు వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ధన్యవాదాలు.
    పోపో మనియెడు భాషల
    కోపంబున నైన జెప్ప గోరరు వారల్
    రూపాయలకై చేసెడు
    పాపము వ్యతిరేక మాట పలుకక నాపున్!
    అందువల్ల యిలా సవరిస్తున్నాను.పరిశీలించ
    ప్రార్థన :

    సరస సంభాషణంబుల నురక లెత్త
    భోజనాదులు ముగియగ బుగ్గ గిల్ల!
    "మోటు వరసేల బేరము మొదటి ద" నెడు
    వాణి వార వనిత లందు వాసి కెక్కె!

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మీ సూచనకు ధన్యవాదములు
    "నాట్య సరస్వతి"కి బదులు "నాట్య వాణి"
    తప్పు కాదని ప్రయోగము చేసాను

    రిప్లయితొలగించండి
  15. మొదటి పద్యము రెండవ పాదము
    "సరస శృంగార భావ చేష్టల నొరులను"
    యని యుండ వలెను టైపు చేయుట లో
    పొరపాటయినది

    రిప్లయితొలగించండి
  16. మధుర మధుర మైన మందార మకరంద
    మామె మాటలవియె మత్తు గొల్పు
    మనసు వెన్న జూడ,మాయురే!మధుర
    వాణి, వారవనితలందు వాసికెక్కె

    రిప్లయితొలగించండి
  17. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ వివరణాత్మక పద్యం చాలా బాగుంది. సవరించిన పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది. సంతోషం.
    *
    ‘శీనా’ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మాయురే మధుర’ అన్నచోట గణభంగం.

    రిప్లయితొలగించండి
  18. వాణి నారాణి యనుచును వరుస గలిపి
    పెండ్లి యాడెద ననిబల్కి ప్రియుడు విటుడు
    హృదయ వైశాల్య మునుబెంచి యాద రించ
    వాణి వారవనిత లందు వాసి గెక్కె

    రిప్లయితొలగించండి
  19. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

    సరస సంభాషణలతోడ సంతతమ్ము
    విటుల బుట్టలో పడవేసి వేడ్క పెంచి
    గణిక లెందరో మహి నగ్రగాము లందు
    వాణి వారవనితలందు వాసి కెక్కె.

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    3.పల్లకీ లోన నూరేగ వధువు వరుడు
    నాట్యములు జేసి ప్రీతిగ నాధు విడిది
    యింట జేర్చగ నాచార మిదియె “మేజు
    వాణి” వార వనిత లందు వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
  21. అక్కయ్యా,
    మీరు చెప్పింది వాణి అనే వేశ్య గురించి కదా... బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజి రావు గారూ,
    మేజువాణితో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మాస్టరుగారూ ! ధన్యవాదములు..
    మధురవాణి పేరు గుర్తు రాక మంజు వాణి అని వ్రాశాను. మిత్రుల పూరణతో తెలిసినది.... సవరణతో...


    తెలుగు నాటకములలోన తీరుగాను
    వెలిగెను గద చింతామణి తెలియగాను
    మరలచూడగ పేరొంది మగువ మధుర
    వాణి, వారవనితలందు వాసికెక్కె.

    రిప్లయితొలగించండి