26, జులై 2014, శనివారం

సమస్యా పూరణం – 1485 (బొమ్మా! నీకింత సిగ్గు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా.
(ఈ సమస్య ప్రసిద్ధమైనదే)

24 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    సిగ్గుతో తలవంచుకున్న పెళ్ళికూతురు
    మోము చూడ లేక పోతున్న పెళ్ళికొడుకు స్వగతం :
    (కాస్త తలెత్తి చూస్తే బావుండునని)

    01)
    _________________________________

    బొమ్మెటుల దీర్చె నిన్నిటు !!!
    బొమ్మల విల్లున విడువుము - ముల్కుల చూపుల్
    బొమ్మంచుదాన, బంగరు
    బొమ్మా! నీకింత సిగ్గు - పోలదు సుమ్మా !
    _________________________________
    బొమ్మ = బ్రహ్మ
    బొమ్మ = కనుబొమ
    బొమ్మంచు = ఎఱ్ఱని
    బొమ్మ = ప్రతిమ

    రిప్లయితొలగించండి
  2. కొమ్మగ మలచిరి కుందన
    బొమ్మా ! నీకింత సిగ్గు పోలదు సుమ్మా
    నెమ్మిని వలచితి నినుమది
    గుమ్ముగ నీవుండి పలుక కోకిల రవముల్

    రిప్లయితొలగించండి
  3. బమ్మే మలచిన ముద్దుల
    గుమ్మా! నామది గెలిచిన కులుకుల కొమ్మా!
    రమ్మా! నాచెంతకు వెస
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!

    రిప్లయితొలగించండి
  4. రమ్మా! వికసించిన పూ
    రెమ్మా! సాగే సొగపు రథమ్మా! నుడికా
    రమ్మా! వాణీ ! నాకను
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా

    రిప్లయితొలగించండి
  5. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్ర బృందమునకు నమోవాకములు.

    ఇమ్ముగఁ గులికెడి వలపుల
    కొమ్మా! నా దరికి రమ్మ! కోరిక నిమ్మా!
    తమ్మికనుల చక్కఁదనపు
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    కాలేజీ విద్యార్ధి: రమ్మన రాదా నను స్వ
    ర్గమ్మును విడి రాన నీదు కౌగిలి జేరన్
    సమ్మదమున నో చక్కెర
    బొమ్మానీకింత సిగ్గు పోలదు సుమ్మా
    నాడు పెళ్లి చూపులలో:రమ్మనగానే నాగపు
    రమ్మును విడి వచ్చినాను రమణీ నీకై
    సమ్మతి తెలుపుమ చక్కెర
    బొమ్మానీకింత సిగ్గు పోలదు సుమ్మా
    శోభనము నాటిరాత్రి:లెమ్మా పాదమ్ములు విడు
    వమ్మానీచోటు హృదయమందున కొమ్మా
    యిమ్మా కౌగిలి బంగరు
    బొమ్మానీకింత సిగ్గు పోలదు సుమ్మా

    రిప్లయితొలగించండి
  7. కమ్మగ బలుకవ పుత్తడి
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!
    బొమ్మల నెత్తుచు నొకపరి
    నిమ్మళముగ జూడవమ్మ నీరజ నేత్రీ!

    రిప్లయితొలగించండి
  8. ఇమ్మనె సగభాగ మొకతె
    కమ్మగ తన కొంగు నిచ్చె కాంత మరొకతె పె
    దమ్మవు పతికడ నుండవు
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా.

    రిప్లయితొలగించండి
  9. ఇమ్మా నాకొక ముద్దును
    బొమ్మా ! నీకింతసిగ్గు పోలదు సుమ్మా !
    కొమ్మా !నాయా శీ సులు
    నెమ్మనమున నిచ్చు చుంటి నిజముగ నీ కున్

    రిప్లయితొలగించండి
  10. మల్లెల వారి పూరణలు

    కొమ్మగు సుభద్ర నాయతి
    నిమ్ముగ సేవింపగాను నియమింపంగా
    రమ్మన, సిగ్గును వడ, ననె
    " బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!"

    ఇమ్మన, కుంతియె వరమును
    నిమ్ముగ నిచ్చె ముని, సంతు నేర్పడ పొందన్
    రమ్మని సూర్యుడు ననె, నిటు
    "బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!"

    కొమ్మను గనియా గుహలో
    బొమ్మగ నామణి ని నాడి, పురుశుని కృష్ణున్
    ఇమ్ముగ గని సిగ్గిల ననె
    "బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!"

    రమ్మని పిలువగ కేళికి
    కొమ్మను, నా మొదటి రాత్రి, కూడిన సిగ్గున్
    పొమ్మనె- భర్తయు ననె గా
    "బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!"

    రిప్లయితొలగించండి
  11. అమ్మాయి బావఁ గని యో
    లమ్మో! సిగ్గనుచుఁ గప్పె లంగా తలపై!
    దిమ్మెర తో బావనె నిటు
    "బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!"

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు నమస్కారములు. బహుళ ప్రాచుర్యం పొందిన జోక్
    అని పై పూరణ చేశాను. ఇబ్బంది కరమనిపిస్తే తొలగిస్తాను.

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కుందనపు బొమ్మ’ అనవలసింది. అక్కడ ‘బంగరు/బొమ్మా’ అందాం.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    అంత్యానుప్రాసతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో గణం, యతి తప్పాయి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పెద్దమ్మా’ టైపాటు వలన ‘పెదమ్మా’ అయింది.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    పరవాలేదు... మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కొమ్మ సుభద్రను గని యనె
    నెమ్మదిగా పార్థు డంత నెలతా! దరికిన్
    రమ్మా తపము ఫలించెను
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా !

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. రమ్మా! నాలుకపై నిల
    వమ్మా! విద్యారథమ్మ వాక్కులచెమ్మా
    ఇమ్ముగ బలుకమ్మ విధికి
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా

    ఇమ్మా తాళంచెవి తెర
    వమ్మా పదపేఠి వాణి పదభక్తునికిన్
    ఇమ్ముగ ఫలమిమ్మ విధికి
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా

    రిప్లయితొలగించండి
  17. కొమ్మా! యెందుకు పుత్తడి
    బొమ్మా నీకింత సిగ్గు? పోలదు సుమ్మా
    చెమ్మ కనులందున, పరిణ
    యమ్మాడ జననిని వదలి యరుదెంచమ్మా

    రిప్లయితొలగించండి
  18. కొమ్మను జూడగ వచ్చిరి;
    యిమ్ముగ నవ వరుని జూసి యిష్టము దెలుపన్
    గుమ్మ బిడియ పడ వరుడనె
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!

    రిప్లయితొలగించండి
  19. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. నమ్మితి నేనొక క్షణమున
    బొమ్మను సుదతిగ నొకింత పూచిన కెంపుల్
    సమ్మోహపఱచె; నొహొహో
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా.

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ఝమ్మని నను వెంటాడెడి
    గుమ్మా! నీవెవరొ చెప్పు గుంభన వలదోయ్!
    కొమ్మా! నీ పేరేమిటి?
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా! :)

    రిప్లయితొలగించండి
  24. కుమ్ముచు నమేఠి కేగుచు
    దుమ్మున రాహులుని గలుపు తొయ్యలి వీవే!
    కొమ్మా! ఇరాని! బంగరు
    బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!

    రిప్లయితొలగించండి