30, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1489 (కాశి కేగినవానికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
కాశి కేగినవానికిఁ గలుఁగు మిత్తి.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింపనున్నవి !

  నేడు కాశీ కెళ్ళి రావడ మంటే మంచినీళ్ళ ప్రాయం :

  01)
  _____________________________

  కాలి బాటలె రహదార్లు - కాశి జనగ
  కారడవులను మధ్యలో - గదల వలెను
  క్రూరమృగములు, యాపదల్ - దారిలోన
  కరకు సర్పము లవి యెన్నొ - కాటు వేయ
  కలము లెందరొ మధ్యలో - గళము గోయ
  కడిదు లన్నియు గమియించి - కాశి జేరి
  కాశి నాథుని దర్శించి - కరువు దీర
  మరలి వచ్చుట సాధ్యమే - మానవులకు !
  కాశి జచ్చిన స్వర్గంబు - కానవచ్చు
  ననెడి భావన హృదయంబు- నలదు కొనగ
  కాశి కేగిన పాటౌను - కాటి కనుచు
  జనులు తలచుట పూర్వంబు - జగతి లోన
  "కాశి కేగిన వానికి - గలుగు మిత్తి"
  యనెడు సామెత యుదయించె - నవని లోన !
  కాశి కేగుట జచ్చుట - కాదు నేడు !
  చాలసులభముగా వెళ్ళి - మళ్ళవచ్చు !
  _____________________________
  చను = నడచు , వెళ్ళు
  కదలు = గమించు
  కలముడు = దొంగ
  కడిది = ఆపద

  రిప్లయితొలగించండి
 2. కాశి కేగినవానికిఁ గలుఁగు మిత్తి
  గొంగ, బేసికంటివేల్పు, కూటకృత్తు,
  జలధితూణీరు, జింకతాలుపరి, జ్వాలి
  శివుని సాయుజ్య సామ్రాజ్య జీవనంబు

  రిప్లయితొలగించండి
 3. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మమత బంధము లన్నియు మాసి పోయి
  సాక్షి గణపతి విశ్వేశు సదనమైన
  కాశి కేగిన వానికి కలుగు ముక్తి
  భవవిముక్తియు,శివలోక ప్రాప్తి నిజము

  రిప్లయితొలగించండి
 4. పెద్ద వారలు చెప్పగా విన్న మాట
  కాలినడకఁ గాశికి జను కాలమందు
  "కాశికేగిన వానికి కలుగు మిత్తి"
  ఆధునికమైన ఈకాలమందు గతపు
  తిప్పలన్నియు నిజముగా తప్పి పోయె

  రిప్లయితొలగించండి
 5. ముక్తి నిచ్చును శంభుడు మోద మలర
  కాశి కేగిన వానికి, కలుగు మిత్తి
  ప్రాణ వాయువు మననుండి బయట బడగ
  పుట్టు మనుజుడు తప్పక గిట్టు సుమ్ము

  రిప్లయితొలగించండి
 6. మల్లెల వారి పూరణలు

  వాసికెక్కిన దవిముక్త పట్టణముగ
  విశ్వనాధుని వాసంబు, వెడల నటకు
  ముక్తి కల్గును నందురు-మునుపు నుడియ
  "కాశికేగిన వానికి కలుగు మిత్తి"

  పూర్వ కాలంబు నందున పూర్తి నడక
  కాశి కేగెడి వారిని, కనగ తిరిగి
  వచ్చు టనుమాన మౌటను వాదు కలిగె
  "కాశికేగిన వానికి కలుగు మిత్తి"

  కాశిలో మరణంబుచే కలుగుముక్తి
  యనుచు నేగియు కొందరు నచట నుండి
  ముదిమి వయసున గడుపగ, మోక్షమేమొ?
  "కాశికేగిన వానికి కలుగు మిత్తి"

  పుణ్య మిడునని కాశికి మోక్షమంద
  కోరి వాసంబు చేసిన కుటిల మతికి
  కాశికేగిన వానికి కలుగు మిత్తి
  మోక్ష మందుట కనరాదు పూర్తిగాను

  రిప్లయితొలగించండి
 7. కాశి కేగిన వారికి కలుగు మిత్తిని దప్ప,
  విశ్వనాథు డేలు, వివిధ పాప
  కర్మములను జేయు కడుపాపి నైనను
  భక్త జనులపాలి భవ హరుండు.

  రిప్లయితొలగించండి
 8. కాశి కేగిన వారికి కలుగు, మిత్తి
  దప్ప, పాప కర్మలచేత దగిలినట్టి
  చింత వంత లన్ని తొలగి చిత్త శాంతి
  పాల నేత్రుడు భక్తల పాలివాడు

  రిప్లయితొలగించండి
 9. ముక్తి కాంతకు తోడుగా మోక్షఫలము
  కాశి కేగిన వానికి కలుగు; మిత్తి
  భయము తొలగును,గఱకంఠ పాహి యనిన,
  శివుని నామము జపియింప భవ హరము

  రిప్లయితొలగించండి
 10. వసంత కిశోర్ గారూ,
  పూర్వకాలపు కాశీప్రయాణపు కష్టాలను వివరంగా పద్యంలో తెలిపారు. మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘క్రూరమృగములు + ఆపదల్’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘క్రూరమృగములు నాపదల్’ అనండి.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  శివుని అచ్చతెనుగు పేర్లతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. ‘బేసికన్నులవేల్పు’ అంటే సరి!
  మూడవ పాదంలో యతి తప్పింది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  కాని సమస్యలోని మిత్తిని ముక్తిగా మార్చారు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘ముక్తి కల్గును నందురు’ అన్నదాన్ని ‘ముక్తి కల్గు నటందురు’ అనండి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శంకరయ్య గారు,
  ధన్యవాదాలు. సవరించిన పద్యం:

  కాశి కేగినవానికిఁ గలుఁగు మిత్తి
  గొంగ, బేసికన్నులవేల్పు, కూటకృత్తు,
  జలధితూణీరు, కాట్రేడు, జ్వాలి, శూలి
  శివుని సాయుజ్య సామ్రాజ్య జీవనంబు

  రిప్లయితొలగించండి
 12. వాసికెక్కెను గాకాశి వసుధయందు
  విశ్వనాథుని పురముగ, వెళ్ళి రాగ
  సులభమీనాడు, నాటిదే చూడ మాట
  " కాశి కేగినవానికిఁ గలుఁగు మిత్తి. "

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి
  వ౦దణములు

  మిత్తి కి బదులు ముక్తి యని టైపు
  చేసినాను పొరపాటు క్షంతవ్యుణ్ణి

  రిప్లయితొలగించండి
 14. పుణ్య పురుషులకు నెలవు పుడమి యందు
  భక్త జనులక భయదాయి వారణాసి
  కాశి కేగినవానికిఁ గలుఁగు మిత్తి
  గొంగ కారుణ్యగంగానుషంగమహిమ

  రిప్లయితొలగించండి
 15. శివుని సన్నిధిఁ గనుమూయ శ్రేయ మనుచు
  కాశి కేగిన , వానికి కలుగు మిత్తి
  దిక్కు మొక్కు లేని యడవిఁ జిక్కి స్రుక్క
  కఠలు కావవి విధిలీలఁ గనెడు వ్యథలు

  రిప్లయితొలగించండి