25, జులై 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1484 (కల్లుఁ ద్రాగుమనెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల.

17 కామెంట్‌లు:

  1. ఎల్లరోగములకు తల్లియైదేహము
    క్రుళ్ళినారకమున కూలి పడగ
    ఇల్లుభూమిపిల్లలిల్లాలు నశియింప
    కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల.

    రిప్లయితొలగించండి
  2. మద్యపాన రక్తి మానివేయుట మేలు
    కల్లు; త్రాగుమనెను గాంధి జనుల
    మేకపాలవంటి మేలైన ద్రవములన్,
    హింసమానుటెపుడు హితముకాదె!

    రిప్లయితొలగించండి
  3. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఓర్పు గలిగి చేసె నుప్పు సత్యాగ్రహ
    యుద్యమమ్ము ప్రబల యూధుడయ్యు
    గంజి నీళ్లఁ గలుపగా స్వదేశీ యుప్పు
    కల్లుఁ ద్రాగు మనెను గాంధి జనుల

    రిప్లయితొలగించండి
  5. మల్లెల వారి పూరణలు

    ఉప్పు మీద పన్ను నొప్పుగాదనుచును
    చేసె నుద్యమంబు చెలువ మొప్ప
    గంజి నీళ్లనైన కలుపక నాయుప్పు
    కల్లు, త్రాగు మనెను గాంధి జనుల

    త్రాగి నంత మెదడు తథ్యంబు చెరచునా
    కల్లు,- త్రాగు మనెను గాంధి జనుల
    మేక పాలు నయిన మేలైనవంచును
    మద్యపాన మిలను మాన్పగాను

    కల్లు త్రాగు వారి కాలేయము చెడని
    తెల్లమవగ దేశమెల్ల చాటి
    బలము నందవారు బాగు, గంజిని నుప్పు
    కల్లు త్రాగు మనెను గాంధి జనుల

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ఇల్లు గుల్లజేయు నిల్లాలి పీడించు
    త్రాణ తొలగ జేయు,త్రాగ వలదు
    కల్లు; త్రాగు మనెను గాంధి జనుల సేమ
    మరసి ప్రేమరసపు టాసవమ్ము

    రిప్లయితొలగించండి
  7. చక్కనైన వనుచు షడ్రుచులను మ్రింగి
    స్థూల కాయ మొంది స్రుక్కు కన్న
    కష్ట జీవి రాగి గంటె జొన్నల గంజి
    కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల.

    రిప్లయితొలగించండి
  8. కల్లు ద్రాగు మనెను గాంధి జనుల టగ
    నెవరు ద్రాగు మనిరి యెందు కనిరి ?
    కల్లు నేర ముగద !కల్లునకు బదులు
    చల్ల ద్రాగు డార్య !చల్ల గుండు

    రిప్లయితొలగించండి
  9. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సత్యాగ్రహ + ఉద్యమము’ అన్నప్పుడు గుణసంధి జరుగుతుంది. యడాగమం రాదు. నా సవరణ...
    ‘ఓర్పు గలిగి చేసె నుప్పు సత్యాగ్రహో
    ద్యమముఁ యోధుఁడై స్వతంత్రకాంక్షి’
    అలాగే ‘స్వదేశపు టుప్పు’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జనుల టగ’....?

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    దేశీయ నీరా దుకాణం విక్రేత గాంధి
    మరిరెండు పూరణలు 1.హరుడుత్రాగె నాడు హాలాహలమ్మును
    రామరాజ్య మందు సోమరసము
    కలియుగము నందు కమ్మని యిప్పపూ
    కల్లు త్రాగు మనెను గా౦ధి జనుల
    దేశ నేత యువాచ
    2.బ్రిటిషు వారి తోడ బీరు బ్రా౦దీ లను
    ఫ్రెంచి వారి తోడ వ్హిస్కి సోడ
    వోడ్క రూసున౦దు వేడ్క దేశమందు
    కల్లు త్రాగు మనెను గాంధి జనుల

    రిప్లయితొలగించండి
  11. చేటు దెచ్చు ప్రజకు సేవించి నటులైన
    కల్లు, ద్రాగుమనెను గాంధి జనుల
    మేక పాల నధిక మేలుచేయునటంచు
    భరత పితుని పలుకు భవ్య మగును

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    ఓర్పు గలిగి చేసె నుప్పు సత్యాగ్రహో
    ద్యమముఁ యోధుఁడై స్వతంత్ర కాంక్షి
    గంజి నీళ్లఁ గలుపగా స్వదేశపు టుప్పు
    కల్లుఁ, ద్రాగు మనెను గాంధి జనుల

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గాంధిమాట మరచి ఖలులు కొందరతిగ
    కల్లుఁ ద్రాగు, మనెను గాంధి జనుల
    మనములందు, నమర మాతని చరితంబు
    బ్రతుక వలెను వారి బాట లోన

    రిప్లయితొలగించండి
  15. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములు.

    మద్యపానమందు మదినిఁ జిక్కఁగనీఁక,
    పాలుఁ ద్రావఁగాను మేలు కలుగు!
    పాలు కొనఁగలేనివారు గంజియు నుప్పు
    కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల!

    రిప్లయితొలగించండి
  16. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. చల్లదనము కొఱకు సహజ సిద్ధమ్ముగా
    చెట్టునుండి అపుడె పట్టినట్టి
    మత్తునీని ద్రవము మాత్రమె అగు త్రాటి
    కల్లు ద్రాగుమనెను గాంధి జనుల

    రిప్లయితొలగించండి