18, జులై 2014, శుక్రవారం

పద్యరచన - 624

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. నరులకు నాలుక జివ్వను
  నురుగుల కాఫీనిగనిన, నోరూరించున్,
  నరముల కుత్తేజమిడెడి
  వరమిది మనుజులకెపుడును, వాహ్ రే కాఫీ!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  అమృతము కన్న గొప్పది గదా కాఫీ యనిన :

  01)
  ____________________________

  పాలు మరగించి కొద్దిగా - పంచదార
  పొడుము సరిపడ కలిపినన్ - పొంగ నురుగు
  అమృతమును మించు పానీయ - మమరు ! నట్టి
  మంచి కాఫీని సేవించు - మానవులను
  గనిన కినుకను జెందరే - గగనచరులు ???
  ____________________________
  కినుక = అసూయ
  గగనచరులు = దేవతలు

  రిప్లయితొలగించండి
 3. ఉదయమున చల్ల గాలికి
  సదనపు తిన్నియ లపైన సరసపు సతితోన్
  వదలక కాఫీ త్రాగుచు
  ముదముగ ముచ్చట్ల తేలి మోహం బలరన్

  రిప్లయితొలగించండి
 4. కాఫీ త్రాగినగానీ
  'సాఫీ' గా పనులుగావు సరి యుదయమునన్
  మాఫీ యగు తలనొప్పులు
  కాఫీనే యతిథి కిడక కదలడు గనుమా !

  రిప్లయితొలగించండి
 5. నీరము పౌడరునకలిపి
  తీరుగ ఫిల్టరునవేసి తీపిని చేర్చన్
  క్షీరము జోడించ నమరు
  నోరూరించుచునుమంచి నురగల కాఫీ!

  రిప్లయితొలగించండి
 6. ఓ కాఫి కప్పూ, భలే వేడి కప్పూ, ప్రభాతాన నన్లేపు పానీయ కప్పూ నినున్ త్రాగకున్నన్ జగంబందు కార్యముల్ సాధ్యమే యటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తనల్ చేసి ఓ కప్పు సేవించి నీ రూపు వర్ణింప నీ మీద నే దండకంబొక్కటిం జేయ ఊహించి నే వ్రాయ ప్రారంభించితిన్ గాని వేవేల రూపంబులై నీవులోకంబులో నుండ నిన్నెంచ
  నేనెంత వాడంగదే


  తొల్లి వైకుంఠమున్, పాల సంద్రమ్మునన్, శేష తల్పమ్మునందున్ మహావిష్ణువున్ హాయిగా నిద్రపోవంగ నాపైన లేవంగ తాబద్దకింపంగ లోకమ్మునన్ ఆలనా, పాలనా, పోషణా, రక్షణా లేక క్షోబించగా.

  భూదేవియున్, అక్క శ్రీదేవియున్, త్రైలోక కల్యాణముంగోరి శ్రీవారికిన్ శక్తి తెచ్చేటి మార్గంబదేమంచు బ్రహ్మాదులన్ వేడగా

  వారు క్రొత్తైన బీజంబు సృష్టించి కాఫీయనే నామమున్నిచ్చి భూదేవికిన్ మరియు శ్రీదేవికిన్ ఈ గింజలన్ వేచి చూర్ణమ్ముగా చేసి వేడ్వేడి నీరందు వేయంగ వచ్చేడి పానీయమున్ గుడ్డలోనుంచి పోనించి కొంచెంబుగా చెక్కెరన్ వేసి త్రావించినన్ మంచి ఉత్తేజమున్ గల్గు నంచున్ వచింపంగ శ్రద్దాళియై విన్న శ్రీ దేవి అట్లె శ్రీవారికిన్ ఈయగా లోక కళ్యాణమయ్యెంగదా

  నాటికిన్ నేటికిన్ భర్తకున్ శక్తి కల్పింప చిక్కనై, పల్చనై, వేడియై, చల్లనై, తీపియై, చప్పనై, తెల్లనై, నల్లనై, వివిధ రూపంబులై, లోకోపకారార్ధివై అత్యంత శ్రేయమ్ము, సౌఖ్యమ్ము హాయిన్ ఒసంగేటి కాఫీ, చిదానంద దాయీ, అనేకాను రూపంబులౌ నిన్ను వర్ణింప నావల్లనౌనే ప్రియే

  నీకు సాటేది లేదీ బువిన్ శిరోభారాది రోగమ్ములన్ ద్రుంచి స్వస్థతన్ శక్తినిన్ మాకొసంగంగ నీవే తగున్

  నీ దాస దాసుండనై నీదు భక్తుండనై నిన్నునే కొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూపి మాకు ఉత్తేజమున్ నిమ్మ. కాఫీమ తల్లీ నమస్తే, నమస్తే, నమస్తే నమః

  రిప్లయితొలగించండి
 7. మరిగిన నీటను పొడితో
  మరిజేర్చుడు శర్కర తగు మాత్రము పాలన్
  నురగలు గ్రక్కెడు కాఫీ
  మరిగిన వారెట్లు మారు మరిమరి త్రాగున్.

  రిప్లయితొలగించండి
 8. ఎప్పుడు పడితే నప్పుడు
  ముప్పొద్దుల త్రాగుచుండ్రు మురియుచు కాఫీ
  చెప్పక వచ్చెడు నతిధికి
  కప్పుడు కాఫీ నొసగును కమ్మగ నతివల్

  రిప్లయితొలగించండి
 9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  పుష్యం గారూ,
  అద్భుతంగా వ్రాశారు కాఫీ దండకాన్ని. చాలా బాగుంది. అభినందనలు.
  కాకుంటే అక్కడక్కడ గణదోషాలున్నాయి. నా సవరణలతో మీ దండకం....

  ఓ కాఫి కప్పూ, భలే వేడి కప్పూ, ప్రభాతాన నన్లేపు పానీయముం గల్గు కప్పూ నినున్ త్రాగకున్నన్ జగంబందు నేకార్యముల్ సాధ్యమే గావటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నామ సంకీర్తనల్ చేసి ఓ కప్పు సేవించి నీ రూపు వర్ణింప నీ మీద నే దండకంబొక్కటిం జేయ ఊహించి నే వ్రాయ ప్రారంభమున్ జేసితిన్ గాని వేవేల రూపంబులై నీవులోకంబులో నుండ నిన్నెంచ
  నేనెంత వాడంగదే.
  తొల్లి వైకుంఠమున్, పాల సంద్రమ్మునన్, శేష తల్పమ్మునందున్ మహావిష్ణువున్ హాయిగా నిద్రపోవంగ నాపైన లేవంగ తాబద్దకింపంగ లోకమ్మునన్ ఆలనా, పాలనా, పోషణా, రక్షణా లేక క్షోభించగా నప్డు భూదేవియున్, అక్క శ్రీదేవియున్, మూడులోకాల కల్యాణముంగోరి శ్రీవారికిన్ శక్తి తెచ్చేటి మార్గంబదేమంచు బ్రహ్మాదులన్ వేడగా వారు క్రొత్తైన బీజంబు సృష్టించి కాఫీయనే నామమున్నిచ్చి భూదేవికిన్ మరియు శ్రీదేవికిన్ గింజలన్ వేచి చూర్ణమ్ముగా చేసి వేడ్వేడి నీరందు వేయంగ వచ్చేడి పానీయమున్ గుడ్డలోనుంచి పోనించి కొంచెంబుగా చెక్కెరన్ వేసి త్రావించినన్ మంచి ఉత్తేజమున్ గల్గు నంచున్ వచింపంగ శ్రద్దాళియై విన్న శ్రీ దేవి ఆరీతి శ్రీవారికిన్ ఈయగా లోక కళ్యాణమయ్యెంగదా!
  నాటికిన్ నేటికిన్ భర్తకున్ శక్తి కల్పింపగా చిక్కనై, పల్చనై, వేడియై, చల్లనై, తీపియై, చప్పనై, తెల్లనై, నల్లనై, పెక్కు రూపంబులై, లోకసంక్షేమకార్యార్ధివై యెంతొ శ్రేయమ్ము, సౌఖ్యమ్ము హాయిన్ ఒసంగేటి కాఫీ, చిదానంద దాయీ, అనేకాను రూపంబులౌ నిన్ను వర్ణింప నావల్లనౌనే? ప్రియే! నీకు సాటేది లేదీ బువిన్. మా శిరోభారాది రోగమ్ములన్ ద్రుంచి స్వాస్థ్యమ్మున్ శక్తినిన్ మాకొసంగంగ నీవే తగున్.
  నీ దాస దాసుండనై నీదు భక్తుండనై నిన్నునే కొల్చెదన్ నీ కటాక్షంబునున్ జూపి మాకెల్ల ఉత్తేజమున్ తెమ్ము. కాఫీమ తల్లీ నమస్తే, నమస్తే, నమస్తే నమః!

  రిప్లయితొలగించండి
 10. కమ్మ నైనట్టి కాఫీని కప్పుత్రాగ
  నుదయ కాలము నందున నొదవు శక్తి
  నుల్లసము గల్గు నిజముగా నుల్ల మందు
  వృద్ధజనులును దీనిని విడువ లేరు

  రిప్లయితొలగించండి
 11. ఉదయపు మగతను దులపగ
  కుదురుగ తగు పంచదార, పాలును పొడితో
  నదునుగ మరిగించి పిదప
  పెదవుల కందించ కాఫి వేడుక కాదే!

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యా,

  దండకము నచ్చినందుకు, సవరణలు సూచించినందుకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 13. కాఫీ నిను నే జూచిన
  మాఫీ యగు బద్ధకమ్ము మార్నింగున నౌ
  సాఫీగా పనులన్నియు
  నే ఫలములు నే టిఫిన్లు నీకీడగునే!

  రిప్లయితొలగించండి
 14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  బాగున్నది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. ఉదయపు మగతను దులపగ
  కుదురుగ తగు పంచదార, పాలును పొడితో
  నదునుగ మరిగించి పిదప
  పెదవుల కందించ కాఫి వేడుక కాదే!

  రిప్లయితొలగించండి
 16. ఉదయపు మగతను దులపగ
  కుదురుగ తగు పంచదార, పాలును పొడితో
  నదునుగ మరిగించి పిదప
  పెదవుల కందించ కాఫి వేడుక కాదే!

  రిప్లయితొలగించండి
 17. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి