14, జులై 2014, సోమవారం

పద్యరచన - 620

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. కుసుమ సుకుమారి దమయంతి కూడు లేక
    కానలందున యీరీతి కమలి పోయె
    నేను లేకున్న తనవారి నెలవు చేరు
    ననుచు దమయంతి నడవిలో నలుడు వీడె

    రిప్లయితొలగించండి
  2. చక్ర వర్తికి యిల్లాలు చారు శీలి
    పెక్కు నిడుములు బడయుచు దిక్కు లేక
    యడవి మృగముల బడవైచి వీడి వెడల
    పాడి గాదని నలుడెంచె భర్త గాను
    ________________________________________
    నలచక్ర వర్తి భార్యట
    కలనైనను గాంచ నట్టి కష్టము లందున్
    వలచిన పతివీడి వెడల
    తిలకించు చునుండె గనుము తీరని వ్యధతోన్


    రిప్లయితొలగించండి
  3. నలుని మనోగతం...

    అరయ తనపుట్టినింటికి నలిగి పోదు
    నలుడ నాతోడనున్నచో నలిగిపోవు
    కాన విడుతును కానను, కానరాక
    త్రోవ తలిదండ్రి కడకేగు తొయ్యలికను.


    రిప్లయితొలగించండి
  4. నలుడు దమయంతి వీడిన
    సులువుగ తలిదండ్రిఁ జేరి సుఖపడు ననుచున్
    దలచెను, సుఖ దుఃఖంబుల
    చెలితోడుండగ మరచెను చేసిన బాసల్

    రిప్లయితొలగించండి
  5. రాజ్యలక్ష్మిని గోల్పోయి రాజు నలుడు
    చేరె కానను భార్యతో దారి లేక
    వెతల నొందెడి సహచరి గతికి వగచి
    తాను లేకున్న తలిదండ్రి దరికి బోవు
    ననుచు విడిచెను దమయంతి నడవిలోన

    రిప్లయితొలగించండి
  6. నే విధి వంచితుండ కడు నిర్దయ తో నిశి రాత్రి యొంటిగా
    నీ వెతలెల్ల గాంచి భరియించక ఘోర వనాంతరంబునన్
    పోవుచునుంటి వీడి నిను పొమ్మిక ప్రేయసి నాకు నీకు నే
    డీ వసుగర్భలోన ఋణమెల్లను దీరెను బుట్టి నింటికిన్

    అని మనమున చింతించుచు
    గనులందున నీరు మిగుల గ్రమ్ముచు నుండన్
    తన సతి నిదురించుట గని
    మనసారగజూచెచుండె మతిచెడి నలుడున్

    రిప్లయితొలగించండి
  7. రాజ్య భ్రష్టుడై నలమహా రాజు జ్యూత
    మందు నడవిలోనికి చనె నాలుతోడ
    విధి వశమ్మున సహచరిన్ విడిచి పోయె
    నెంత దుర్గతి పాలయ్యె నిందువదన

    రిప్లయితొలగించండి
  8. ఈనాటి పద్యరచన శీర్షికను అలరించిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    శైలజ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి