27, జులై 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1486 (వారకాంతమీఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
వారకాంతమీఁది వలపు మేలు.

31 కామెంట్‌లు:

 1. ఇంటి యందు మంచి యిల్లాలినివదిలి
  వారకాంతమీఁది వలపు మేలు
  కాదు చేటు తెచ్చు కాంతల కన్నీరు
  భార్య విలువ తెలిసి మసలు కొమ్ము

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ప్రేమకోసం ప్రాణమైనా యివ్వగలిగిన పడతి లభిస్తే
  వారకాంతలతో పనేమిటి ?

  01)
  _________________________________

  "నీవు లేని నాడు - నిజము నే మననని"
  వలపు వెలయ పలుకు - వలతి వినిన
  పారవశ్య మొంది - వక్షమెంతయొ తని
  వార ! కాంత మీఁది - వలపు మేలు !
  _________________________________
  మనను = జీవింపను
  వెలయ = హెచ్చ
  వక్షము = హృదయము
  తనివార = తృప్తినొంద
  కాంత :

  [తెలుఁగు]కోరఁదగిన యువతి.
  [తమిళము]పెణ్‌, మంగై, కాదలిక్క తగుది యుడయవళ్‌.
  [కన్నడము]ప్రియ, మనోహర, చెలువాడ హెణ్ణు, చెలువె, కాంతె.

  రిప్లయితొలగించండి
 3. ధనము కోసమైనా వలపు నటిస్తుంది గదా !

  02)
  ____________________________

  మంచి చెడ్డ మరచి - మగనిని హింసించు
  భార్య తోడ భర్త - బ్రతుకు టెట్లు ?
  పణము కోసమైన - వలపును నటియించు
  వారకాంత మీఁది - వలపు మేలు !
  *****
  వారకాంత మీఁది - వలపు మేలు !
  *****
  వారకాంత మీఁది - వలపు మేలూ---------------------

  రిప్లయితొలగించండి
 4. ఒక్కొక్కసారి
  డబ్బుతో ప్రేమను కొనుక్కోవడం తప్పదు మరి :

  03)
  ____________________________

  బ్రతుకు నరక మవగ - భార్య సాధింపుల
  వలపు లేని బ్రతుకు - బ్రతుక గలరె ?
  ఫలము గొనిన నైన - వలపుల గురిపించు
  వారకాంత మీఁది - వలపు మేలు !
  ____________________________

  రిప్లయితొలగించండి
 5. వారకాంత మీద వలపు కాదది వ్యామోహం
  ముమ్మాటికీ తప్పు తప్పు తప్పు :

  04)
  ____________________________

  తప్పు తప్పు తప్పు - యొప్పగు నేరీతి
  వారకాంత మీది - వలపు మేలు ???
  కష్ట సుఖము లందు - కలసి నడచు చున్న
  కలికి యింట నుండ - కరువె వలపు ?
  ____________________________

  రిప్లయితొలగించండి
 6. యిష్టమైన యింతి యింటిలో నుండగా
  పాడు పనులు పాపం గదా !

  05)
  ____________________________

  వారకాంత మీది - వలపు మేలెటు లౌను?
  విత్తమంత సమయు - వేల గలుగు !
  యిష్టమైన యింతి - యింటిలో నుండగా
  పాడు పనుల జేయ - పాప మొదవు !
  ____________________________
  వేల = రోగము

  రిప్లయితొలగించండి
 7. భార్య భగవాను డిచ్చిన వరము గదా :

  06)
  ____________________________

  నీదు భాగ్యరాశి ! నిను పె - న్నిధిగ నెంచు !
  నీవు వచ్చు సరికి యెన్నె- న్ని యమరించు !
  భార్య భగవాను డిచ్చిన - వరము గాదె !
  వీధి చివరను నిను గాంచ - వెదకు చుండు !
  తలచు చున్నది నిన్నదే - తలుపు వార !
  కాంత మీది వలపు మేలు - గనగ నిలను !
  ____________________________
  వార= ప్రక్క,మూల
  కాంత = స్త్రీ(భార్య)

  రిప్లయితొలగించండి
 8. ఇలను యింతి భాగ్య రాశి గదా భర్తలకు :

  07)
  ____________________________

  వలదు వారకాంత మీది - వలపు మేలు గాదురా
  నిలచి గనిన నిత్య మైన - నీదు కాంత మేలురా !
  కలను గాని వేరొకనిని - గాంచ నిష్ట పడదురా !
  కాల మంత నీదు వెంట - కలసి మెలసి నడచురా !
  ఇలను యింతి భాగ్య రాశి - యెసగు వంశమంతయున్ !
  ____________________________

  రిప్లయితొలగించండి
 9. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  చేరవారకాంత చెడునునారోగ్యంబు,
  కీర్తి,ధనములెల్ల,కృతకమౌను
  వారకాంతమీదివలపు,-మేలు
  కులము యశము నిల్పు కులపు కాంత!

  వారకాంతపొందు బాగైనసుఖమంచు
  కులపుకాంత విడుచు కుమతి చెడడె
  వారకాంత మీది వలపు, మేలు
  కాదునెంచ, రోగ కారకంబు

  నీతి తప్పు భార్య నెపుడు వీడగనౌను
  కులము,యశము,లవ్వి కోరినంత.
  నీతితప్పకుండ నేమాలతో మెల్గు
  వారకాంత మీది వలపు మేలు

  కులము చెరచు నట్టి కుటిలంపు వర్తన
  కలిగియున్నకాంత కనగచేటు,
  భార్య యైనగాని ;-వర్తనన్ మేలైన
  వారకాంతమీది వలపుమేలు

  రిప్లయితొలగించండి
 10. ఇంట బంధు జనులు యిల్లంత నిండగా
  నూత్న వధువును గననుత్సు కతకు
  క్రొత్త పెండ్లి కొడుకు కోర్కె దీర్చ నెమకు
  వార; కాంతమీఁది వలపు మేలు.

  రిప్లయితొలగించండి
 11. ఎంత హొయలు చూపి యెన్నిపల్కిన గాని
  వారకాంత పొందు వలదు వలదు
  కులపు కీర్తి పెంచు, కోరంగ నౌ,పరి
  వారకాంతమీది వలపు మేలు.

  రిప్లయితొలగించండి
 12. ప్రేమ తగదు మనసు విచ్చిన్నమును జేయు
  వార కాంత మీద, వలపు మేలు
  సతము సుఖము నిచ్చు చక్కని సతిపైన,
  మంచి జీవితమును పంచు కొనగ

  రిప్లయితొలగించండి
 13. పుట్టినిల్లు వదలి ముచ్చటగా భర్త
  కన్నబిడ్డల సరి గనుచునుండు
  పురుష పుంగవ విను పుణ్య మిదియె తని
  వార, కాంతమీది వలపుమేలు

  రిప్లయితొలగించండి
 14. విత్తమొసగినంత వేగవలపుజూపు
  వారకాంతపొందు వదలు మోయి!
  వంశ వృద్ధి చేయు వరసైన యాపరి
  వారకాంతమీది వలపుమేలు

  రిప్లయితొలగించండి
 15. మంచి నడవడికయు మర్యాద మన్ననల్
  పెద్దలందు భక్తి మెండుగలిగి
  భర్తమనసు తెలిసి మసలుకొను సుపరి
  వారకాంతమీఁది వలపు మేలు

  రిప్లయితొలగించండి
 16. పతిని విడచి తిరుగు పాశ్చాత్య సంస్కృతి
  నొంది నట్టి భార్య నొంది భర్త
  బాధ పడుట కంటె పరితోషమును బంచు
  వార కాంత మీద వలపు మేలు!

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 18. పెట్టు కొనకు నెపుడు ప్రియమైన సోదర !
  వార కాంత మీది వలపు ,మేలు
  నీదు భార్య పైన నిజమైన ప్రేమను
  కలిగి యుంట , సుఖము కలుగు నపుడు

  రిప్లయితొలగించండి
 19. ఇంటి గడప దాటి యింకించు జనులను
  వారకాంత మీఁది వలపు వలదు
  స్వాంతమందు వెలుగు శాంతితొ నాంతర్య
  ద్వారకాంతమీఁది వలపు మేలు

  ఆంతర్యద్వారకాంత = అంతర్ద్వారకాంత = ఇంటిలోపలనున్న గడపదాటని ఇల్లాలు

  రిప్లయితొలగించండి
 20. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  ఆమె దేవదాసి. యామె ముముక్షువు,
  వార కాంత మీది .. వలపు మేలు
  కొలుపు పాట పాడు కొనెను. రంగపతిని
  పరమ పదము ప్రాప్తి వరము గోరి

  రిప్లయితొలగించండి
 21. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ప, ఫ, బ, భ, వ లకు యతిమైత్రి చెల్లుతుంది గదా. "మ" తో యతి మైత్రి ఉంటుందా.దయ చేసి తెలియ జేయండి.

  రిప్లయితొలగించండి
 22. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీరు ‘తనివార’ వ్రాసిన ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ప,ఫ,బ,భ లతో మకారంతో యతి చెల్లదు. కాని అనుస్వారపూర్వకమైనప్పుడు అంటే ంప,ంఫ, ంబ, ంభ లతో మకారానికి యతి చెల్లుతుంది.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. చేటుఁ దెచ్చు నీకు చెప్పెద వినుమయ్య,
  వారకాంత మీది వలపు మేలు
  కాదు కీడు నీకు ; కల్లకాదిది నిజ
  మయ్య! వినుము మంచిదయ్య నీకు.

  రిప్లయితొలగించండి
 24. గురువుగారు,
  పద్యరచన 621 నుంచి వ్రాయగలిగినన్ని పూరణలు, రచనలు ఉంచినాను.
  వీలున్న యెడల గమనించగలరు.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. కట్టు కున్న భార్య కడుపు నింపగ జూచు
  పెట్టు కున్న భామ పీల్చు సొమ్ము
  మనసు పెట్టి జూచి కనుము వారల మధ్య
  వార, కాంత మీది వలపు మేలు
  (వార = తేడా, బేదము )
  కాంత = భార్య)

  రిప్లయితొలగించండి
 26. పతియె దైవమనుచు పతియె జీవనమని
  మదిని దలచి కొలుచు మగువ వరము
  వార కాంత వలదు వలపు లెదను పొంగు
  వార కాంతమీఁది వలపు మేలు.

  రిప్లయితొలగించండి
 27. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱికిని నమస్కారములు.

  వారకాంత మీఁది వలపు మదాంధతన్
  గులము, గుణము, ధనము కొల్లఁగొనును!
  సకలశుభకరమగు శాంతగుణమ్ము దై
  వార, కాంతమీఁది వలపు మేలు!

  రిప్లయితొలగించండి
 28. మాస్టరుగారూ ! ధన్యవాదములు..
  రెడ్డి గారూ ! నిజమే మొదతి పాదం లో యతి దోషమును సరిచేయుచున్నాను.

  పుట్టినిల్లు వదలి పొలతియె తన భర్త
  కన్నబిడ్డల సరి గనుచునుండు
  పురుష పుంగవ విను పుణ్య మిదియె తని
  వార, కాంతమీది వలపుమేలు

  రిప్లయితొలగించండి
 29. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి