11, జులై 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1470 (వీఁపుఁ జూపువాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వీఁపుఁ జూపువాఁడు వీరవరుఁడు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. Yuddha rangamu nandundi otamigani
    Bheeruvagu vaadu bhayamuto veepu joopu,
    Vaadu veera varudagunu bhayamuveedi
    Veera maranamondu varaku poru vaadu
    B

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ...

    యుద్ధరంగము నందుండి యోటమి గని
    భీరువగువాఁడు భయముతో వీఁపుఁ జూపు;
    వాఁడు వీరవరుఁ డనఁబడు భయమువీడి
    వీరమరణ మొందువరకు పోరువాఁడు.

    రిప్లయితొలగించండి
  3. వీపు జూపువాడు వీర వరుడు కాడు
    దురము నందు యోద్ధ వెరవడెపుడు
    మహిత జయముకైన మరణంబుకై నను
    సిద్ధ పడును జోదు యుద్ధ మందు.

    రిప్లయితొలగించండి
  4. కలియగము నధర్మ కయ్యము నందున
    వీపుజూపువాడె వీరవరుడు
    మంచి సమయ మెంచి మార్కొన గాదగు
    యుద్ధమందు నెంత యోధులైన

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి ప్రయాగ శ్రీరామ చంద్ర మూర్తి నమస్కారములు.

    కఠిన కార్యమందు కలవర పడిపోయి
    వీఁపుఁ జూపువాఁడు వీరవరుఁడు
    కాడు, కష్టములను మిండొడ్డు వానికి
    జయము నిశ్చయంబు జగతి లోన

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ”ముందుజూపు”వాడు బుద్ధి మంతు డనగ
    ప్రక్కజూపువాడు” తక్కరీడు
    వెనుకనున్న దొంగలను గని పెట్టగ
    “వీపుజూపువాడు’వీరవరుడు
    2.కదనరంగమందు కదలుచు తిరుగుచు
    వధను జేయు వేళ వాహినులను
    ముందు వెనుక పైన క్రింద ననగ నేల
    వీపుజూపువాడు వీర వరుడు
    3 బకుని కొరకు దెచ్చి బండెడన్నమ్మును
    కుడువ గాలి కొడుకు, కుపితుడగుచు
    గ్రుద్దె నసురుడతని,కుందు పడక
    వీపుజూపువాడు వీర వరుడు

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మూడవపూరణ పద్యములో మూడవ పాదము
    గ్రుద్దె నసురుడతని,క్రుందు పడక తిను
    యని మార్చుకొనవలెను

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ]మల్లెల వారిపూరణలు
    ధర్మయుద్ద మందు ధారుణి వెన్నునే
    జూపినంత నోడి సోలి నట్లు
    ధర్మ మదియె మారె తా గెల్వ మోసాన
    వీపు జూపు వాడు వీర వరుడు
    2.దొడ్డవాడు నౌను దొంగ తనము జేయ
    కాపి కొట్టువాడు ఘనుడు విద్య
    హింస కూడ దనుచు యింపు కోడిని మెక్కి
    వీపు జూపు వాడు వీర వరుడు
    3.గొర్రె పోతు తాను కొంచెంబు తగ్గినా
    యినుమడి౦చు శక్తి నెత్తి పొడుచు
    దాని వోలె శక్తి తా జూప నెంచుచున్
    వీపు జూపు వాడు వీర వరుడు

    రిప్లయితొలగించండి
  9. వీపు జూపు వాడు వీరవరుడు కాడు
    భీరు వయిన వాడె భీతి జెందు
    జయము బడయు వరకు జంకకూడదెపుడు
    పోరి గెలువ వలెను వీరు డైన

    రిప్లయితొలగించండి
  10. అరిభయంకరుండు వ్యవహారదక్షతా
    ఘటికుఁడగుచు ధీర కౌశలమునఁ
    ధైర్యసాహసములు తనవిగా కుత్తిక
    వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

    కుత్తిక వీపు = ఒక రకమైన బాణము

    రిప్లయితొలగించండి
  11. చూపు చూపు లోన చుర కత్తు లెగయగ
    చేవ సన్న గిల్లి చిత్త గించ
    నెవని యెదుట నిల్వ నేరక శత్రువు
    వీఁపుఁ జూపు, వాఁడు వీరవరుఁడు

    రిప్లయితొలగించండి
  12. దేశరక్షదీక్షధీరుడై సమరాన
    కాలరుద్రునివలె కాలుద్రువ్వి
    మౌళివంగగట్టి మదమణంచి రిపుల
    వీఁపుఁ జూపువాఁడు వీరవరుఁడు.

    రిప్లయితొలగించండి
  13. వీరుడనగ నతడె పోరు ను సాగించి
    శత్రుసేన ద్రుంచి శాంతి నిలుపు ;
    నొక్కడైన నేమి యురముతోసమముగా
    వీఁపుఁ జూపువాఁడు వీరవరుఁడు.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    అరసిజూడ దేశమందున యీనాడు
    వెట్టి చాకిరీని విసుగు గొనక
    పోరు సేయ లేక పొట్టను పోషింప
    వీపుజూపువాడు వీర వరుడు

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ రచించారు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    జయమునకు, మరణంబునకు... అనవలసింది.. ఆ పాదాన్ని ‘మహిత జయమునకును మరణంబునకు నైన’ అందాం.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అధర్మకయ్యము’ అని సమాసం చేయరాదు కదా.. ‘కలియుగము నధర్మకదనమునందున’ అనండి.
    *
    ప్రయాగ శ్రీరామ చంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది.“కాఁడు, కష్టములను కచ్చించువానికి’ అందామా? (కచ్చించు = మిండొడ్డు = ఎదిరించు)
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణ మూడవ పాదంలో గణం తప్పిందనుకుని సవరణ సూచించబోయి మీ సవరణ చూశాను. బాగుంది.
    మీ నాల్గవ పూరణ కూడా బాగున్నది.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణలో ‘తగ్గినా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘తగ్గిన/ నినుమడించు...’ అందాం.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ ‘కుత్తికవీపు’తో వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్న్ది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పుస్తకాల సంచిమోతబరువుకాగ
    వీపుజూపువాడువీరవరుడు
    చదువుకొనెడు వీరసమరాంగణమునందు
    విజయమందితొరగు భుజమునొప్పి

    రిప్లయితొలగించండి
  17. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. వింత కాదు కాని విపరీతమననోపు
    హింది చిత్ర సీమ హేల గాను
    కండ, లురము, డొక్క, కాంచుడీ యనుచును
    వీపు జూపు వాడె వీరుడగును

    రిప్లయితొలగించండి
  19. ఊ.దం. గారూ మీ పూరణ బాగుంది ..నేనూ మీబాటలో ప్రయత్నిస్తున్నా....


    బాడి బిల్డరగుచు పదిమందిలో నిలచి
    చేతికండరములు సిక్సు ప్యాకు
    పొట్ట ఛాతి త్రిప్పి పొంగించుచు తిరిగి
    వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

    రిప్లయితొలగించండి
  20. ‘ఊకదంపుడు’ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అవసరార్థం అన్యదేశ్యపదాలను వాడినారు. పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువు గారూ,గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధ్యనవాదములు.

    రిప్లయితొలగించండి