30, జులై 2014, బుధవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 39

రామాయణము-
సీ.      ఇల, (ఖ్యాతి స్ఫూర్తియు తైణిలోచనల సత్
క్ష్మాపాత్మజుల్ గొప్పగాఁ) గొని ప్రియ
ముగ (నీతిశ్రేయపు బుద్ధి నేడు గలయన్
ధీ నొక్కొకండున్ ధృతిన్) సుకృతము
లెదఁ (బ్రీతి ప్రజ్వలితేచ్ఛ సల్పిరి జనుల్
ప్రేమం గనంగా లలిం), గనుకనుఁ,
దద్(భూతి శ్రేష్ఠతఁ దాఱి హెచ్చు సమయం
బుల్ పొందుచున్ మోదమున్) మనముల
గీ.       నెంచి రాముఁ డందఱలోన హె, చ్చతండు
క్ష్మాపుఁడై మూడుపూవు లాఱుకాయలగు న
టంచు వారు విధివిరామ మంత విడిరి;
ప్రభుఁడు కార్యనిర్వాహకోద్భటుని భటుని. (౫౪)

భారతము-
శా.     ఖ్యాతి స్ఫూర్తియు తైణిలోచన లసత్ క్ష్మాపాత్మజుల్ గొప్పగా
నీతిశ్రేయపుబుద్ధి నేడు గలయన్ ధీ నొక్కొకండున్ ధృతిం
బ్రీతిప్రజ్వలితేచ్ఛ సల్పిరి జనుల్ ప్రేమం గనంగా లలిన్
భూతి శ్రేష్ఠతఁ దాఱి హెచ్చు సమయంబుల్ పొందుచున్ మోదమున్. (౫౪)

టీక- (రా) ఖ్యాతిన్ = కీర్తితో; స్ఫూర్తియుత = కాంతిని గూడిన; (భా) ఖ్యాతిస్ఫూర్తియుత = కీర్తికాంతుల గూడిన, (ఒకటే సమాసము) నీతిశ్రేయపుబుద్ధి, ప్రీతిప్రజ్వలితేచ్ఛ, భూతిశ్రేష్ఠతయును నిట్లే. నేడు = (రా) రాజు (దశరథుఁడు); కలయన్ = (రా) పాల్గొనఁగా; ఏఁడుగలయన్ = (భా) సంవత్సరపర్యంతము పొందుటకు; సమయంబుల్ = (రా) కాలములు, (భా) ఒడంబడికలు. నాలుగుపాదములందు సీసమందు నాలవయక్షరములు, శార్దూలమున రెండవ యక్షరములగు ‘తి, తి, తి, తిలు రామాయణార్థమున లఘువులుగాను, భారతార్థమున గురువులుగా నున్నవి. ఏణిలోచన = లేడివంటి కన్నులుగలది. (రా) ఏణిలోచనల, సత్; (భా) ఏణిలోచన లసత్; మూడుపూవు లాఱుకాయ లగుట = వృద్ధిజెందుట.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి