18, జులై 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1477 (వరము వైషమ్యములఁ దెచ్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వరము వైషమ్యములఁ దెచ్చె ప్రజలలోన.

19 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    గాడిదకే కొమ్ములొస్తే ?

    01)
    _________________________

    హరుడు వరముల నిచ్చుటన్ - బరి తెగించి
    కోరి మొలిపించు కున్నట్టి - కొమ్ము దూసి
    పొగరు తలకెక్కి దుర్మార్గ - పోకడలను
    కాన వచ్చిన వారిని - గాయ పరచు
    గాలిగాడదె రాజైన - గ్రామమునను
    వరము వైషమ్యములఁ దెచ్చె - ప్రజలలోన !
    _________________________
    గాలిగాడు = గాడిద
    వైషమ్యము - ఒడుదొడుకు

    రిప్లయితొలగించండి
  2. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    నేడు సైతము పాలనా నీతి మనకు
    బ్రిటిషు “విడదీసి పాలనా”విధము వోలె
    వరలు హిందు ముస్లిము క్రైస్తవ మతపు కల
    వరము వైషమ్యముల దెచ్చె ప్రజల లోన

    రిప్లయితొలగించండి
  3. ఆంద్ర రాష్ట్రమునకలిపె కేంద్ర ప్రభుత
    ముంపు ప్రాంతము లన్నింటి తెంపుతోడ
    భగ్గుమనిరి తెలంగాణ ప్రజలు, పోల
    వరము వైషమ్యములఁ దెచ్చె ప్రజలలోన

    రిప్లయితొలగించండి

  4. పరమ దుర్మార్గ ధ్యేయాల పైనిలబడి
    నాయకులు వేయు పథకాల నైచ్యమెరిగి
    భీతి యవమాన మనుమాన భిన్నజాతి
    జ్వరము వైషమ్యములఁ దెచ్చె ప్రజలలోన

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దుర్మార్గ ధ్యేయాల’ అన్నప్పుడు ‘ర్గ’ గురువై గణదోషం. అక్కడ ‘దుష్టమౌ ధేయాల’ అందామా?

    రిప్లయితొలగించండి
  6. పుట్ట గొడుగుల వలెనేడు పుట్టచున్న
    కరము పార్టీల నడరవకాశ మిచ్చి
    నట్టి భారత రాజ్యాంగ చట్ట మిడిన
    వరము వైషమ్యములు దెచ్చె ప్రజలలోన

    రిప్లయితొలగించండి
  7. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మల్లెల వారి పూరణలు

    అధిక కులము వారనుచును నధమ కులము
    వారి, నశ్రధ జేసియు వదలి వేయు
    పాలకుడు నోట్ల కొరకయి పక్షమౌ వి
    వరము వైషమ్యముల దెచ్చె ప్రజలలోన

    అధిక మౌరీతి నొకచోటె నందవృద్ధి
    తక్కు ప్రాంతాలనశ్రద్ధ, దలపకున్న
    ప్రాంత భేదాలు పెరుగును, వరలనొకట
    వరము వైషమ్యముల దెచ్చె ప్రజలలోన

    రిప్లయితొలగించండి
  9. వైరి పార్టీకి చెందిన వర్గమన్న
    సొంత వానికి సరిపోదు చెంత జేర
    విభజనమ్ము తెచ్చిన పార్టి వేదననిడ
    విజయ మెంచి నాయకులిట వేరు పడిరి
    వైరి పార్టీలఁ జేరెడు వలస వారి
    వరము, వైషమ్యములఁ దెచ్చె ప్రజల లోన!

    రిప్లయితొలగించండి
  10. అన్నగతలంచి ప్రజలంత యెన్నుకొనగ
    ఓట్లు పొందిన తదుపరి నోట్లకొరకు
    నితరులను చేరదీసి తానిచ్చినట్టి
    వరము వైషమ్యముల దెచ్చె ప్రజల లోన

    రిప్లయితొలగించండి
  11. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱికిని నమోవాకములు.

    అఱువదేఁడుల కల నిజమైన వేళఁ
    బాలకులు గిరిజనుల వివక్షతోడ
    నాజ్యమునుఁ బోసి రగిలింప నకట పోల
    వరము వైషమ్యములఁ దెచ్చెఁ బ్రజలలోన!

    రిప్లయితొలగించండి
  12. పూలజడ సొంపు మెచ్చుక పొలతి ప్రియుడు
    పట్టి యూపగ పడె జారె పాప మట స-
    వరము వైషమ్యములఁ దెచ్చె, ప్రజలలోన
    పరువు మాయుట సిగ్గుచే నిరువురికిని

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    భాగవతుల కృష్ణా రావు గారి పూరణ
    నాడు తమిళా౦ధ్ర రాష్ట్రాన నలుగు నపుడు
    రాష్ట్ర విభజన నా౦ధ్రుల రక్ష దీర్చె
    వరముగా తెలoగాణమే మరల నిడగ
    వరము వైషమ్యముల దెచ్చె ప్రజల లోన

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ ‘సవరము’ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. తపము జేసిన యసురులు నెపము లేక
    వరము వైషమ్యముల దెచ్చె ప్రజల లోన
    చేను మేయగ కంచెలు మేను మరచి
    దోచు కొనుటకు దొంగలు త్రోవ దొరికె

    రిప్లయితొలగించండి
  16. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. స్వంత లాభముఁ గోరెడు స్వార్థపరుల
    కాలమిది! రామ రామ, యకారణముగ
    నేడు వారల కోరిక నిజము కాగ
    వరము వైషమ్యములఁ దెచ్చె ప్రజలలోన.

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి