25, సెప్టెంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1523 (ఈతాకుల గుడిసెలోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. సైతానుల నెదిరింపగ
    వైతాళికుడైన క్రీస్తు వచ్చెను భువికిన్
    మాతయగు మరియ కడుపున
    యీతాకుల గుడెసెలోన నినుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  2. మాత వరంబుల మిషయో!
    వ్రాతో! పితృ వాక్యమునకొ! రావణ వధకో!
    సీతాపతి వెడలె వనికి
    నీతాకుల గుడెసెలోన నినుఁ డుదయించెన్!!

    రిప్లయితొలగించండి
  3. మాతాతలు నిదురించిరి
    యీ తాకుల గుడిసె లోన, నినుడుద యించె
    న్నీతూరుపు కను మలలో
    మాతా ! యిక లెమ్ము నిదుర మాబడి కేగన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కుటీరమునకు కన్నముంటే :

    1)
    ________________________________

    సీతాపతి సేవనమున
    ప్రీతిని లక్ష్మణుడు నేయ; - బెజ్జము మిగులన్
    సీతయు రాముండు పడిన
    నీతాకుల గుడిసె లోన - నినుడుదయించెన్
    ________________________________
    పడు = శయనించు

    రిప్లయితొలగించండి
  5. సూర్యనారాయణ గారూ ! చక్కని పూరణ !

    సత్యనారాయణ గారూ ! బహు చక్కని పూరణ !
    కాని చిన్న సందేహం !
    సీతాపతి రామచంద్రుడే గాని రామసూర్యుడు కాదుగదాయని !

    రిప్లయితొలగించండి
  6. ప్రహ్లాద జననము :

    2)
    ________________________________

    పూతక్రతు చెర విడివడె
    నా తాపసి కరుణ తోడ - నాశ్రమ మందున్
    మాతయ్యెను లీలావతి ;
    యీతాకుల గుడిసె లోన - నినుడుదయించెన్ !
    ________________________________
    పూతక్రతుడు = ఇంద్రుడు

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కడుపున/ నీతాకుల...’ అనండి.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మాబడి కేగన్’....? ‘నిదుర మాపటికె కదా’ అంటే బాగుంటుందేమో?
    *
    వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు. సరి చేశాను.
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    జిగురువారి పూరణలో గుడిసె వంటి వనములో రాము డనే సూర్యు డుదయించాడని భావం.
    ప్రహ్లాద జననం విషయంగా మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
    ‘మాత + అయ్యెను’ అన్నప్పుడు సంధిలేదు. ‘మాత యయెను లీలావతి’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. తాతా వేగము లెమ్మిక
    నీతాకులగుడిసెలోన; నిను డుదయించెన్,
    నూతన వత్సర మాయెను
    ప్రాతగు వస్త్రముల విడచి పండుగ చేయన్

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారు ఇంతకుముందే ఫోన్ చేసి ఈ సమస్య 16-7-2012 నాడు ఇచ్చిందే అని గుర్తుచేశారు. వారికి ధన్యవాదాలు. అప్పటి పూరణలను, వ్యాఖ్యలను ఒకసారి వీక్షించండి.
    http://kandishankaraiah.blogspot.in/2012/07/764.html

    రిప్లయితొలగించండి
  10. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ప్రసిద్ధమైన పూర్వపూరణ ‘తాతా తొంగున్నావా/ యీతాకుల గుడిసెలోన..’ను గుర్తుకు తెచ్చారు.

    రిప్లయితొలగించండి
  11. సీత యు లవకుశు లుండిరి
    నీతాకుల గుడిసెలోన, నినుడు దయించెన్
    మాత యయె కుంతి ముదముగ
    నా తాపసి మంత్ర మొసగ నార్కియె బుట్టెన్!

    రిప్లయితొలగించండి
  12. నూతన రాష్ట్రపు సారధి
    చేతన మార్గంబు నెంచి చేరెను( బదవిన్,
    రైతుల ఋణములు దీర్చగ
    ఈతాకుల గుడిసెలోన (నినిడు దయించెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమ:

    జాతర జూడగ బాలుడు
    మాతామహు వెంట వెడలె మాపటివేళన్
    రాతిరి నిదురన్ జేసిరి
    యీతాకుల గుడెసెలోన, నినుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  14. సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.

    ఆతఁడుఁ బేదయు రైతౌఁ
    బోతన! భాగవత రచన పూజితమాయెన్!!
    హేతువెది యౌనొ? యేమో?
    యీతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్!!!

    రిప్లయితొలగించండి
  15. సీతాపతి పూదోటకు
    నేతామెత్తంగవలయు నేమరియిటులన్
    తాతా తొంగున్నావా
    ఈతాకుల పాకలోన ఇనుడుదయించెన్

    ఇది నా చిన్నతనంలో ఎప్పుడో విన్న సమస్యా, దాని పూరణానూ.

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారూ,
    త్రేతాయుగంలో మొదలుపెట్టి ద్వాపరం దాకా లాక్కొచ్చారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ దృష్టాంతం చాలా బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీరు గుర్తు చేసిన పూరణ గతంలో మన బ్లాగులోనే పండిత నేమాని వారు గుర్తుచేశారు. ధన్యవాదాలు.
    సీతాపతి పూదోటనె
    ఏతామెత్తంగవలె గదేకువ వేళన్
    తాతా తొంగున్నావా
    ఈతాకుల గుడిసెలోన? ఇనుడుదయించెన్

    రిప్లయితొలగించండి
  17. తేదీ:16 జూలై 2012 నాటి యీ (764వ) సమస్యకు నా పూరణము:

    ఆ తఱి నిననిభ తనుఁడై
    సీతాలక్ష్మణులతోడ శ్రీరాముఁడు నా
    రాతి రట విడిది సేయఁగ
    నీతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్!

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారూ,
    ఆనాటి మీ చక్కని పూరణను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. సీతయు లవకుశులుండిరి
    నీతాకుల పాకలోన

    ఉండిరి + ఈతాకుల, ఇక్కడ దృతం రాదేమో కదా కొంచెం చూడండీ శైలజ గారూ

    రిప్లయితొలగించండి
  20. కామేశ్వర శర్మ గారూ,
    శైలజ గారి పద్యంలో ‘ఉండిరి యీతాకుల..’ అని సవరణ సూచించాలనుకొని మరిచిపోయాను.

    రిప్లయితొలగించండి
  21. గురుతుల్యులు కామేశ్వర శర్మ గారికి , శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    తాతయ్య పొలము కెళ్ళెను
    కోతలు మొదలయ్యె నేడు కూడిదిగోరా!
    భ్రాతా! వేగమె పొమ్మిక
    నీ తాకుల గుడిసెలోన నినుడు దయించెన్

    రిప్లయితొలగించండి
  22. కవయిత్రి శైలజగారూ,

    "క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికంబుగా నగు"నను చిన్నయసూరిగారి సూత్రానుసార మిక్కడ...

    ఉండిరి + ఈతాకుల = ఉండిరీతాకుల, ఉండిరి యీతాకుల...అను రెండు వికల్ప రూపములు రావలసియున్నది.

    ఇందులో ద్రుతము(నకారము)నకుఁ దావులేదు.

    కావున, మీరు...ఉండిరి యీతాకుల...యను యడాగమ రూపమును స్వీకరించఁగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. శైలజగారూ,

    మీ రెండవ పూరణము బాగుగనున్నది. అభినందనలు. కాని, చిన్న సవరణ మవసరము. "పొలముకెళ్ళెను"...అను ప్రయోగమును ...పొలముకు+ఎళ్ళెను...అని విసంధి చేయవలసియుండును. కాని యిది సాధువుకాదు. దీనిని "తాతయ్య పొలమునకుఁ జన"యని మార్చఁగలరు.

    రిప్లయితొలగించండి
  24. మల్లెల వారి పూరణలు

    పాతై పోయెను కప్పది.
    పూతపు చంద్రుని, నినునల, పూర్తిగ కనమే
    తాతా! నిద్దుర విడుమా!
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

    నేతలు నందరు బీదల
    పూతంబగు, నోట్లగొనియు, పొల్పుగగెలువన్
    వేతలప వచ్చు గాదే!
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

    తాతల నాడల లేవుగ
    తా,తాపము , వర్ష మాప ధరణిని డాబాల్
    వాతానికి పై కెగురగ
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

    ఈతాకుల, తాటాకుల
    పూతంబుగపైనఁ గప్పు, పూరిండ్లవియే
    వేతావుల చిల్లులు వడ
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

    వేతల్పగ గుడిసెలలో
    తా, తాపసులెల్ల గడిపి, ధర్మము, జ్ఞానం
    బేతెల్ప, వెలిగె పుడమియె
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

    పూతంబైనవి, యాకుల
    చేతను పైకప్పు నిడిన, చీకిన కప్పుల్
    నీతికి నెలవులు నౌటను
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  25. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    నూతన తరమిది ,నే డా
    జాతపు టధికార మునకు స్వస్తి పలుకగా
    నేతగనెన్నుకొనంగను
    యీ తాకుల గుడిసె లోన నిను డుదయించెన్
    2.ఏ తార తమ్య మెరుగడు
    ప్రీతిని భవనము లపైన విభలనొసగుచు
    న్నాతీరున చిల్లులుగల
    యీ తాకుల గుడిసె లోన నిను డుదయించెన్

    రిప్లయితొలగించండి
  26. మల్లెల వారి పూరణ
    ఏతావుల సూర్యుదు పడు
    నాతావులె శక్తి నెలవు లనుటయె నిజమౌ
    చేతల జేసెడి బీదల
    యీతాకుల గుడిసె లోన నిను డుదయించెన్

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఏడు పూరణలు (తిమ్మాజీ రావు గారి ద్వారా వచ్చిన దానితో) బాగున్నవి. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    శైలజ గారి పూరణలను సమీక్షించి సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. కె .ఈశ్వరప్ప గారి పూరణ
    1.జాతిని జాగృతి జేయగ
    నేతగ లోకాల దిరుగు నేర్పరు డయ్యున్
    భూతల మం దెందైనను,
    యీతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్!!
    2.భూత భవితవ్య మెరిగిన
    జాతకుడౌవీర బ్రహ్మజనియించె గదా
    ఈతరమందున వెలుగై
    యీతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  29. శ్రీ మధుసూదన్ గారికి, నా పద్యాలను సరిదిద్ది, వివరం గా తెలియచేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  30. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. మాస్టరుగారూ ! పాత సమస్య ఐనా పరవాలేదు...క్రొత్త వారికి క్రొత్త సమస్యే
    పాత వారికి క్రొత్త పూరణ....

    ప్రీతిగ కొలిచెను సూర్యుని
    మాతమ్మే పుత్రు కొరకు మరి పుట్టగనే
    ఆతనికి పేరు పెట్టెను
    ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  32. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. సీతను వెదుకఁగ కానలఁ
    నే తావులఁ గాన రాక యినకులు డలసెన్
    యాతనతో నిదురించగ
    నీతాకుల గుడిసెలోన నినుడుదయించెన్!

    రిప్లయితొలగించండి
  34. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. సూతుడు కనుగొని తేగా
    ప్రీతిగ రాధమ్మ ముద్దు పిలుపుల తోడన్
    రాతిరి యొడిలో నిదురిడ;
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి


  36. తాతా! విన్నావా కథ?
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించె
    న్నేతావాతా క్రీస్తువు
    గా తా లోకమున వెలిగి కటకట తీర్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. తాతల కాలపు చూరుర!
    భీతిలి పెనుగాలి కిడగ పెక్కులు బొక్కల్
    ప్రాతః కాలము నందున
    నీతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి