14, సెప్టెంబర్ 2014, ఆదివారం

నిషిద్ధాక్షరి - 9

ద్విత్వ, సంయుక్తాక్షరాలను ఉపయోగించకుండా
సత్య హరిశ్చంద్రుని గుఱించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.


నా పద్యము....
దివికి భువికి చెడినవాని దేహజుండు
నిరతము నిజము పలికెడి నియమశీలి
దొరతనము పోయిన, సతీసుతుల విడివడి
యిడుము లందిన బొంకుట యెఱుఁగడాయె.

41 కామెంట్‌లు:

 1. మాట పైన నిలువ రాజ మకుటముడిగె
  సతిని దాసి జేసె సుతు లోహితుడి తోడ
  కాటి కాపరిగను జేసె మేటి రాజు
  ఇడుములవి గలిగిన మాట విడువలేదు!!

  రిప్లయితొలగించండి
 2. అందరికి వసంతకిశోరు - వందనమ్ము !
  అందమైనట్టి పద్యాల - నిందు గనిన
  నెందరెందరొ మిత్రు, ల - నింద్యముగను
  నాంధ్ర మాతకు నాభర - ణమ్ము లనగ
  నంద జేతురు నిత్య మా - నంద మెగయ !

  సత్య హరిశ్చంద్రుడు :

  01)
  _______________________________

  కపిలు వంశజు డాతడు - కలిమి ఱేడు
  కాఱు పలుకడ దేనాడు - కలను గూడ !
  కలిమి నొసగెను తపసికి - కానుకగను
  కాశి జేరెను మునిరోయి - కనకమిడగ
  కలతెఱగు నిలుప సతినే - వెలకు నిడెను !
  కాటికాపరియైనను - కటక టనక
  కాంత మెడగోయ కరవీర - కమును విసరె !
  కాంత, సుతుతోడ నాడికన్ - కడకు బొందె !
  కాఱులాడని చిరజీవి - గ నిల మిగిలె !
  _______________________________
  రోయి = అప్పు
  నాడిక = దేశము(రాజ్యము)

  రిప్లయితొలగించండి
 3. ఇడిన మాటపై నిలచిన పుడమి రేడు
  సంతతము నీతమున నుండు సాదు జీవి
  మంచి దారినఁ బయనించు మనుజ వరుడు
  దారసుతులను నిజముకై దారవోసె

  రిప్లయితొలగించండి
 4. నిజమునుఁ వీడకూడదను నేమముతోడని లంచె, నాతడే
  ప్రజలకు దారిఁ జూపగల పాలకుడౌచు నునుండె; లోకమున్
  నిజమను మారు పేరిడుచు, నేటికి నైన తలంతురాతనిన్.
  సుజనుడు, దేవతల్ పొగడు జోదుడు, వందనమందు నేడిదే.

  రిప్లయితొలగించండి
 5. నిజము నిలుపఁ గొడుకుఁ దన నెలఁతఁ బంపె
  బానిసలుగ, లేని ఋణము పలుకకుండ
  దీరిచెను కాటికాపరి తీరు గాను
  దండములిడెదనో నీకు నిండుకుండ!
  మనసులో మాట: మేము చిన్నప్పుడు చాలా సార్లు సత్య హరిశ్చంద్ర నాటకం చూసి కాటికాపరి సీనులో లోహితాస్యుడు "అమ్మా, అమ్మా" అంటుంటే ఏడ్చేవాళ్ళము. కానీ పెద్దయ్యాక అసలు కష్టం హరిశ్చంద్రుడిదని తెలిసింది. అంత నిండుకుండగా ఎలా ఉండగలిగాడా అనిపిస్తుంది ఇప్పటికీ. వీలయితే sv రంగారావుగారి హరిశ్చంద్ర సినిమా చూడండి, ntr దానికన్నా చాలా బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 6. శ్రీగురుభ్యోనమ:

  అనృతముల పలుక నేరడు
  దినకరకులజాత విభుడు దివిజులసముడే
  ఘనమగు నిడుములు కలిగిన
  ను నియమమును వీడడాయె నుడువుగ నిజమున్

  రిప్లయితొలగించండి
 7. జిగురువారి పద్యంలో "సుతు లోహితుడి తోడ" అనటం కొంచెం సవరించి "సుతుడు లోహితునితో" అంటే బాగుంటుంది. సుతు అన్నచోట షష్ఠీవిభక్తి కనిపిస్తోంది కాబట్టి.

  వసంతకిశోరులు సతినే అన్నది సతిని అంటే చాలు. కటకట + అనక అన్నచోట యడాగమం ఉందనుకుంటాను. కరవీరకమును విసరె బదులు కరవీరకంబు దూసె అనండి. విసరటం చేయలేదుగదా.

  అన్నపురెడ్డిగారి పద్యం బాగుంది.

  లక్ష్మీదేవిగారు ప్రజలను అన్నారు సంయుక్తాక్షరంతో. "పాలకుడౌచు నునుండె లోకమున్" కన్నా "పాలకుడై కొమరారి లోకమున్" అని సరిచేయండి. జోదుడు అన్నమాట లేదు జోదు అనే కాని. ఇక్కడ జోదును అని మార్చండి. ఇంకా పద్యంలో అన్వయసుభగత్వం రావాలి.

  మనతెలుగువారు, "నిజము నిలుపఁ గొడుకుఁ దన నెలఁతఁ బంపె" అన్నది "నిజము నిలుపఁ బంపె నెలఁతఁను గొడుకును" అనండి - ఇంకొంచెం సుభగంగా ఉంటుంది. అలాగే చివరిపాదం "దండములిడెదనో నీకు నిండుకుండ!" మార్చి "దండముల జేతు గైకొమ్ము నిండుకుండ!" అంటే బాగుంటుంది.

  నాగరాజుగారు తనపద్యంలో పొరబది బొత్తిగాను అని త్వాక్షరం వాడేసారు. అందుచేత బొత్తిగాను పరిహరించి గొంకు లేక అని ఉంచండి ప్రాసయతిని.

  ఒక్క విషయం జనాంతికంగా చెప్పదలచాను. కవిమిత్రులు మన్నిస్తారని ఆశిస్తూ కొంచెం అధికప్రసంగంగా. పద్యాలలో మూడు ముఖ్య లక్షణాలు పట్టాలి. (1)లక్షణశుధ్ది (2)బాషాశుధ్ధి (3)ధారాశుధ్ధి. అంటే వరుసగా ఛందోలక్షణాలు సరిగ్గా ఉండటం, పద్యాలు కాబట్టి కవిపండితామోదం పొందే భాషనే ప్రయోగించటం, ఎక్కడా నడకకుంటకుండా ఏకధారగా సాగటం. ఈ మూడు అభ్యాసంచేత మెఱుగుపడతాయి. పద్యాలు వ్రాయటంలో పట్టు చిక్కటం అంటే గణాలను సరిపోల్చుకుంటూ వ్రాయవలసిన స్థితినుండి ఎదగటం. గణాలమీద దృష్టి వ్యగ్రమై ఉన్నప్పుడు ధారచెడటం చాలా సాధారణమైన విషయం. ఇవి గాక వృత్తాలకు ప్రవాహగుణం అందం - ఏక బిగిని పద్యం అంతా కొనసాగాలి. రీతులూ శయ్యలూ వంటి అంశాలజోలికి పోవటం లేదు. దేశిఛందస్సులైన కంద,గీతాదుల్లో ఏ పాదానికి ఆపాదంగా విడిపోతూ వస్తే అందం. కవిమిత్రులు కేవలం పద్యం పూర్తి చేయటం పైన మాత్రమే కాకుండా ఈ పై విషయల్లో కూడా తగినంత దృష్టి పెట్టవలసిందని విజ్ఞప్తి.

  రిప్లయితొలగించండి
 8. నుడువును నిజమే, లేకను
  మడియునుతా నపుడు గాని మనలేడిలలో
  నడవడి జూడగ నిజముగ
  నిడ నిజమున మారుపేరు నీతండగుగా .

  రిప్లయితొలగించండి
 9. శ్యామలీయం గారు విపులంగా యిచ్చిన సూచనలకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శ్యామలీయం గారూ, మొదటి పాదం నడక నాకే సరిగా లేదనిపించినా పూరణ చేసి వేసేశాను. కానీ మీరు సూచించిన "నిజము నిలుపఁ బంపె నెలఁతఁను గొడుకును" లో యతిగానీ, ప్రాస యతి గానీ కలవలేదు. ఇలా వేద్దాం, "నిజము నిలుపఁ బంపె సుతుని నెలఁతనటుల".
  ఇక మిగతా సూచనల విషయంకొస్తే, ఈ దిశలోనే నిష్ణాతులైన వారు పూరణ చేసి పోస్టు చేయమని చాలా సార్లు మనవి చేశాను. చింతా వారు ఒక పోస్టులో పద్య రచనకు ఉండవలసిన పదిలక్షణాలను వివరించారు. అలానే శంకరయ్య మాష్టారు, విష్ణునందన్గారూ, ఏల్చూరివారూ ఇలా ఇంకొందరు మిత్రులు. వారి పూరణలు మనందరకూ చెప్పక చెప్పిన పాఠముల వలె పనికివస్తాయని. ఇప్పటికీ నా మనవి అదే. వీలైనంత మటుకూ సమస్యలో పసని బట్టి గాక, పాఠము కోసం అనుకొని తరచుగా పూరించమని వారికి నా మనవి.

  రిప్లయితొలగించండి
 11. నిజమే పలికెడు రాజని
  యజరామరుఁ జేయ మునియె నాసన మడిగెన్
  నిజదారా సుతుల విడచి
  నిజము నిలుపఁగాటిఁ గాసె నిరుపమ రీతిన్

  రిప్లయితొలగించండి
 12. మల్లెల వారి పూరణలు

  బొంకి యెరుగడు సంపద పోవ నయిన,
  సతిని సుతులను వీడిన, సకల కటము
  లంది యుండి, విచారము నందలేదు.
  నిజము పలుకుటె కోసలు నియమ మెంచ

  సంపద పోయిన కుములడు.
  ఇంపుగ కోసలు డిడుముల నెంతో కనెగా
  రంపపు కోతగ సతి, సుతు
  లంపెను కౌశికు గృహముకు నాడక బొంకే

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్కారములు.

  ||సీ||
  ఇరుమూఁడు పుడమి కాపరులందు మొదటి వాఁ
  ........డయి, నిజమరియైన ధవళితయశుఁ;
  డాడిన మాటకై యడలక యడరెడు
  ........నాడిక విడనాడు నయవిదుండు;
  తన ననుసరియించు ధరణీసురుని ఘన
  ........ఋణముఁ దీరుపఁ జను ఋజుగమనుఁడు;
  తన సతీసుతుల నాదరమునఁ గొనఁగాను
  ........విపణివీథిని వేడు వినయధనుఁడు;
  తన వెలనిడఁగాను తానె చండాలు సే
  ........వకుఁడైన కాటికాపరి యతండు;

  ||గీ||
  ఉరగ దంశనమునఁ దనయుండుఁ జావఁ
  గాటి సుంకముం గోరిన కారయితుఁడు;
  సతిని నేరాభియోగానఁ జంపుమనెడి
  రాజునానతిఁ దలనిడు రతన మతఁడు!!

  రిప్లయితొలగించండి
 14. వెతలు గొనినగాని సతతము నిజమునే - మనమునందు నిలిపి మసలుకొనెను
  గాధిసూనుండెంత బాధించిననుగాని - మారుమనువుతాను గోరలేదు
  దానంబుగ తనదు ధారుణి సంపద -గౌశికునకిడి తాఁ గాశికేగె
  దాసిగ బంపించి తన సతీసుతులను - కటికవాని గొలిచె గడకుతాను
  సుతుడు లోహితు మరణము జూచిగూడ
  సతిని జంపగ తనకు రాజానతిడిన
  జంకలేదు కడవరకు బొంకలేదు
  యినకులమణి యితడనంగ ఋతము సతము

  రిప్లయితొలగించండి
 15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  సర్వలఘుతేటగీతి
  పద్యము :పలుకు నిలుపు కొనగ తన పదవి వదలె
  తనను సతి సుతు కొనుమని ఋణము తొలగ
  ఋషికి ధనమిడె మహి పతి యినకులమణి
  దలచి నిజమునె అజరము వెలుగు ననగ

  రిప్లయితొలగించండి
 16. మిత్రులు శ్యామలీయంగారు చేసిన పద్యపరామర్శ మఱియు సూచన బాగున్నది. అభినందనలు.
  అటులే వారు సూచించిన సవరణములలో టైపాటు కాఁబోలు...
  మిత్రులు మన తెలుఁగుగారి పద్యమందు చేసిన సవరణములలో...
  (౧) "...బంపె నెలఁతఁను..."లో "త"పిదప నరసున్న యటులేయున్నది. దీనిని "నెలఁతను" అనవలెను.
  (౨) "దండముల జేతు గైకొమ్ము నిండుకుండ!"యని సూచించిన సవరణమున "మ్ము" ద్విత్వాక్షరము. దీనిని "...దండములఁ జేతుఁ గొనుమయా నిండుకుండ!" యని యనవలెను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. నిజము పలుకు వాడై నీతినే పూని సూనున్
  నిజము కొఱకె యాలిన్ నిందలన్ పొంది వీడెన్
  నిజము ఘనత మౌనిన్ నేరుగా వంచి వైచెన్
  నిజము విలువ నాడే నేరిపెన్ రాజు భూమిన్.

  రిప్లయితొలగించండి
 18. నుడువిన మాటలకై తన
  కొడుకుయు దారయును తాను కూడని విధమౌ
  యిడుముల బడిరి కదా కా
  రడవుల జీవనముఁ జేయ హతవిధి చూడన్.

  రిప్లయితొలగించండి
 19. * మిత్రులు మిస్సన్నగారి "మాలినీ వృత్తము" చాల బాగుగనున్నది. అభినందనలు.

  * మిత్రులు సంపత్‍ కుమార్ శాస్త్రిగారి పూరణము బాగున్నది. అభినందనలు. కాని, చిన్న సవరణములు..."నుడువిన" యనునది..."నుడివిన" యని యుండవలెను. అటులనే..."కొడుకుయు" యనునది..."కొడుకును" యని యుండవలెను.

  * మిత్రులు మన తెలుఁగుగారికి సూచించిన సవరణమున...వారన్నట్లుగ శ్యామలీయంగా రాపాదము నాటవెలఁదిగఁ బొరపడి సవరణనిచ్చినారు. మన తెలుఁగుగారి సవరణము సరిపోయినది. అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. శ్యామల రావుగారు,
  ధన్యవాదాలు. మీ సవరణలు బాగున్నాయి.
  కానీ అన్వయ సౌలభ్యలోపాన్ని సరిదిద్దుతూ మరల వ్రాసినాను. కృపతో పరిశీలించగలరు.
  నిజమును వీడరాదనెడు నేమము పాలనజేయువాని, సా
  మజముగ సాగి లోకమున మాటకు గౌరవమెంతొ బెంచునా
  భుజబల శాలినిన్ మిగుల పూనికతో తలపంగ నెంతు; రా
  సుజనుకు, దేవతల్ పొగడు జోదుకు వందనమందు నేడిదే

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకుఁ దెలియఁజేయునదేమన...

  శ్రీ కంది శంకరయ్యగారు నేఁడు వారి మిత్రుఁడొకరు పరమపదించినందున గ్రామాంతరమునకు వెడలియుంటినని, కర్మకాండలు ముగియనంతవరకు బ్లాగునకు నందుఁబాటులోనుండలేనని దూరభాషణమునఁ దెలిపినారు. గమనించఁగలరు.

  రిప్లయితొలగించండి
 22. ధరను నిజము పలికి దారా సుతులు పోవ
  మాట నిలుపు కొనిన మహితు డతడు
  తుదకు తనను కూడ వదలక వెలబోసి
  నిలిపె యశము తుదకు నింగి నేల

  రిప్లయితొలగించండి
 23. * మిత్రులు గుండా వేంకట సుబ్బ సహదేవుఁడుగారి పూరణము బాగుగనున్నది. అభినందనలు. కాని, చిన్న సవరణము...రెండవపాదాంతమున "...నాసన మడిగెన్" అని కాక, "...యాసన మడుగన్..." అనినచో సరిపోఁగలదు.

  * మల్లెలవారి పూరణములు బాగున్నవి. అభినందనలు. అగుచోఁ జిన్న సవరణములు. మొదటి పద్యము రెండవపాదమందు..."వీడిన"కు బదులు "వీడియు" గా సరిచేసిన సరిపోవును. రెండవ పద్యము నాల్గవపాదమందు "లంపెను కౌశికు గృహముకు నాడక బొంకే"యను దానిని "నంపెను కౌశికు గృహమ్ము నాడక బొంకున్" అని సరిచేసిన బాగుండును.

  *చంద్రమౌళి సూర్యనారాయణగారి పూరణము చాల బాగుగనున్నది. అభినందనలు.

  * కెంబాయి తిమ్మాజీరావుగారి సర్వలఘుతేటగీతి బాగుగనున్నది. కాని మూఁడవపాదమున "మహిపతి" యనునది "మహీపతి" కావలసినందున సర్వలఘు నియమము సడలును. కావున దీనిని "నరపతి" యనిన సరిపోఁగలదు.

  * సోదరి లక్ష్మీదేవిగారి సవరించిన పద్యము బాగుగనున్నది. అభినందనలు. కాని, యింకను జిన్న సవరణముఁ జేయవలసియేయున్నది. "సుజనుకు, దేవతల్ పొగడు జోదుకు వందనమందు నేడిదే" యనుదానిలో..."సుజనుకు" నన్నచోట "సుజనునకు" ననవలసియుండును (అట్లే జోదుకు...జోదునకు ననవలయును) గాన...గణభంగము కాకుంటకు..."సుజనుని, దేవతల్ పొగడు జోదునిఁ గీర్తనఁ జేతు నేఁడిదే" యనిన సరిపోవును.

  * రెండుచింతల రామకృష్ణమూర్తిగారి పూరణము బాగుగనున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  నిజమే పలికెడు రాజని
  యజరామరుఁ జేయ మునియె నాసన మడుగన్
  నిజదారా సుతుల విడచి
  నిజము నిలుపఁగాటిఁ గాసె నిరుపమ రీతిన్

  రిప్లయితొలగించండి
 25. *మల్లెలవారికి నేను సూచించిన సవరణమున "నంపెను కౌశికు గృహమ్ము నాడక బొంకున్" అనుదానిలో "మ్ము" ద్విత్వాక్షరము దొరలినది. దానిని "గృహమున కాడక బొంకున్" అని సవరించునది.

  *సోదరి లక్ష్మీదేవిగారికి నేను సూచించిన సవరణమున "సుజనుని, దేవతల్ పొగడు జోదునిఁ గీర్తనఁ జేతు నేఁడిదే" అనిదానిలో "ర్త" యని సంయుక్తాక్షరము దొరలినది. దానిని "సుజనుని, దేవతల్ పొగడు జోదుని వందితుఁ జేతు నేఁడిదే" అని సవరించునది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 26. మిత్రులు గుండా వేంకట సుబ్బ సహ దేవుడుగారి సవరించిన పూరణమున "మునియె యాసన..." యని కాని, "మునియు నాసన..." యని కాని సవరించిన సొగసుగ నుండఁగలదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 27. కృత యుగము నందు రవికుల కృతము దెలుప
  మాట వీడక విభవపు మూట విడిచె
  సతిని వీడెను పరసేవ సంగరమున
  లోహితుని వీడె విధి చేత నిహితముగను
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 28. మిత్రులు నాగరాజు రవీందర్ గారూ, ధన్యవాదములు. నా సీసపద్యమందలి ప్రథమపాదోత్తరార్ధమునందు "డ"కారమునకును, "ధ"కారమునకును యతివేయఁబడినది. దీనిని "అగ్రాహ్యసంబంధవళి"యందురు. డ-ణలకుఁ గాని, ద_డలకుఁ గాని యతిమైత్రిఁ బొసఁగించుట దీని ప్రత్యేకత.

  రిప్లయితొలగించండి
 29. కె .ఈశ్వరప్ప గారి పూరణ
  లోహితపితరుల చరితము
  బాహిరపోవంగ నీతి పాలన గనగా
  సాహసమందున సాగిన
  దౌ హిత మిడునుమనకు వినదగినదియౌరా

  రిప్లయితొలగించండి
 30. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  మహిపతిని నరపతి గా మార్చిన మీసూచనకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 31. నిజమే,
  సుజనునకు, జోదునకు అని వ్రాయవలసి ఉన్నది.
  ధన్యవాదాలు.
  ఇంక వందితుడిని మనము చేయడం అనే విషయం కొంచెం సంశయంగా ఉన్నది. అందుకే ఇంకో సవరణ.
  నిజమును వీడరాదనెడు నేమము పాలనజేయువాని, సా
  మజముగ సాగి లోకమున మాటకు గౌరవమెంతొ బెంచునా
  భుజబల శాలినిన్ మిగుల పూనికతో తలపంగ నెంతు; రా
  సుజనుని, దేవతల్ పొగడు జోదుని సాటిగ నేరు చూడగా?

  రిప్లయితొలగించండి
 32. శ్రీ గుండు మధుసూదన్ గారికి వందనములు
  మహిపతిని నరపతి గా మార్చిన మీసూచనకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 33. కొరుప్రోలు రాధాకృష్ణరావుగారూ, మీ పూరణము బాగుగనున్నది. అభినందనలు. కాని, యిందు నాల్గవపాదమున ప్రాసయతి కుదురలేదు. "లోహితుని"లోని హకారము దీర్ఘాక్షరపూర్వకము. "నిహితము"లోని హకారము హ్రస్వాక్షరపూర్వకము. కావున "లోహితుని వీడె విధిచేత మోహము విడి"యని కాని, "లోహితుని వీడె విధిచేతిలోనఁ బడియు" యని కాని సవరింపఁగలరు.

  రిప్లయితొలగించండి
 34. నాగరాజు రవీందర్‍గారూ, వచించు, వచియించు వలె అనుసరించు, అనుసరియించుటగా వ్రాసితిని. తమరు సూచించినట్టుల మార్చినచో...(తనను వెన్నాడెడు) ద్విత్వాక్షరయుతము కాఁగలదు. దీనికన్న "తనను వెంటాడెడు" అనిన సరిపోవును గదా! స్పందించినందులకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 35. మాట నిలకడ గలిగిన మనుజు డతడు
  మాట కొరకుగా దానాయె గాటి కాప
  రిమరి ,నిజమునే బలుకు ని యమము గలుగు
  నతడు ,పలుకనే రడుసామి !యనృత మెపుడు

  రిప్లయితొలగించండి
 36. * సోదరి లక్ష్మీదేవిగారూ, మీ సవరించిన పూరణము మనోజ్ఞముగానున్నది. అభినందనలు.

  * కె. ఈశ్వరప్పగారూ, మీ పూరణము బాగుగనున్నది. అభినందనలు.

  * సుబ్బారావుగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 37. మిత్రులు మధు గారికి నమస్కారములు
  మీ సూచనకు ధన్యవాదములు
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 38. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్నటి నిషిద్ధాక్షరికి పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు.
  పూరణ గుణదోషాలను ప్రస్తావించి తగిన సవరణలను సూచించిన మిత్రులు గుండు మధుసూదన్ గారికి, శ్యామల రావు గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి